బాలీవుడ్ బయోపిక్ పరంపరలో మరో సినిమా చేరింది. వంటలరాణిగా పేరున్న దిగ్గజ చెఫ్ తార్లా దలాల్ బయోపిక్ నిర్మితమవుతున్నది. ‘తార్లా’ టైటిల్‌తో తెరకెకుతున్న చిత్రంలో టైటిల్ రోల్లో హ్యూమా ఖురేషి నటిస్తున్న విషయం తెలిసిందే. పీయూష్ గుప్తా దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హ్యూమా మాట్లాడుతూ…‘నా బాల్యంలో మా అమ్మ తార్లా దలాల్ వంట పుస్తకాలు చదివి మాకు అల్పాహారం చేసి పెట్టేది.
పుస్తకంలోని హోం మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ నాకింకా గుర్తే. ఈ పాత్రలో నటించడం నా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లినట్లుంది’ అని చెప్పింది. భారతీయ వంటల గురించి వందకు పైగా పుస్తకాలు రాసింది దిగ్గజ వంటలక తార్లా దలాల్. ఆమె రాసిన పుస్తకాలు కోటి ప్రతులు అమ్ముడయ్యాయి. ఇంటర్నెట్ ఊసే లేని 80, 90 దశకాల్లో తార్లా వంటల పుస్తకాలు చాలా ప్రసిద్ధి పొందాయి.