KIng Movie Shooting | బాలీవుడ్ కింగ్ షారుక్‌ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్‌ల క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘కింగ్’. ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె ప్రస్తుతం గర్భవతి కావడంతో ఈ సినిమాలో తన యాక్షన్ సన్నివేశాలకు మేకర్స్ కాస్త విరామం ఇస్తారని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, దీపికా ఏప్రిల్ 21, 22 తేదీల్లో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో అత్యంత భారీ పోరాట సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం. చిత్రబృందం ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ఆమె ఎంతో ఉత్సాహంగా ఈ యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, త్వరలోనే సుమారు ఎనిమిది మంది ఫైటర్లతో కూడిన మరో భారీ పోరాట ఘట్టాన్ని ఇసుకలో చిత్రీకరించేందుకు సిద్ధార్థ్ ఆనంద్ ప్రణాళికలు సిద్ధం చేశారు. షారుక్, దీపికా ఇద్దరి కాంబినేషన్లో రానున్న ఈ ఇసుక పోరాటం సినిమాకే హైలెట్‌గా నిలవనుందట. ఇక సినిమా వాయిదా పడుతుందేమో అన్న సందేహాలకు తెరదించుతూ, డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ఒక ప్రత్యేక వీడియో ద్వారా స్పష్టం చేశారు. దీంతో ఈ ఏడాది చివరలో ‘కింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని అభిమానులు ఖరారు చేసుకున్నారు.