Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, ఆయన సన్నిహితురాలు గౌరీ స్ప్రాట్ వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆమిర్ ఖాన్ నివాసంలో అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ప్రత్యేక వివాహ చట్టం (Special Marriage Act) ప్రకారం ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోల్లో ఆమిర్ ఖాన్ వివాహ పత్రాలపై సంతకం చేస్తున్నట్లు కనిపించగా, ఆయన పక్కనే గౌరీ స్ప్రాట్ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఆమె ధరించిన ఆభరణాలు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఫొటోలని బట్టి చూస్తుంటే వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నట్లు చెబుతున్నారు. గౌరీ స్ప్రాట్ తన మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమారుడితో కలిసి వేడుకకు హాజరైనట్లు, అలాగే ఆమిర్ ఖాన్ కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వైరల్ అవుతున్నట్టు ఫొటోలని బట్టి తెలుస్తుంది.. ఉంగరాల పెట్టెలతో ఇద్దరు పిల్లలు కనిపించిన దృశ్యాలు రెండు కుటుంబాల కలయికకు ప్రతీకగా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
అయితే, ఈ వివాహానికి సంబంధించిన వార్తలు, ఫొటోలపై ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ లేదా గౌరీ స్ప్రాట్ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, గత మార్చిలో తన 60వ పుట్టినరోజున గౌరీతో పెళ్లి విషయాన్ని ఆమిర్ ఖాన్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 5న ఇంట్లోనే చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంటున్నాం. ఇరు కుటుంబాలు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరవుతారు అంటూ ఆయన తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకుని, 2002లో విడిపోయారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకుని, 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు గౌరీతో వైవాహిక జీవితం కొనసాగించనున్నారు.