రియాద్, అక్టోబర్ 7 : పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే వణికిస్తున్నాయిప్పుడు. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, హొర్ముజ్ జలసంధిలో రవాణాకు అంతరాయం.. ముడి చమురు సంక్షోభానికి దారితీశాయి మరి. ఇక గల్ఫ్ దేశాల్లో క్రూడాయిల్ ఉత్పత్తి దారుణంగా పడిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేవి కావన్న అంచనాలు వినిపిస్తుండటం కలవరపెడుతున్నది. వార్ దృష్ట్యా తరిగిపోయిన అంతర్జాతీయ చమురు నిల్వలు తిరిగి పుంజుకోవాలంటే ఏండ్ల సమయం పట్టవచ్చని సౌదీ ఆరామ్కో సీఈవో అమిన్ నాజర్ హెచ్చరించారు.
హొర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకున్నా.. మునుపటి పరిస్థితి నెలకొనడానికి రెండేండ్ల సమయమైనా పడుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదీ సంక్షోభం ప్రభావాన్ని చూడాల్సి వస్తుందని పెట్రోనస్ సీఈవో మహ్మద్ అన్నారు. అమెరికాకు మద్దతిస్తున్నాయని యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్లపై ఇరాన్ దాడులకు దిగుతున్నది. దీంతో ఆయా దేశాల్లో ఉత్పత్తి పెద్ద ఎత్తున దిగజారింది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఈ దేశాల వాటానే దాదాపు 35 శాతంగా ఉండటం గమనార్హం. అలాగే హొర్ముజ్ జలసంధి మీదుగానే ప్రపంచ రవాణాలో 20 శాతం జరుగుతున్నది.