ITR Deduction | ఆదాయం పన్ను చట్టం (1961) లో 80సీ సెక్షన్. దేశంలోని వేతన జీవులు వాడే పన్ను ఆదా చేయడానికి వాడే టూల్స్‌లో ఇదొకటి. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయర్స్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్), లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్), హోంలోన్ రీ పేమెంట్ (ప్రిన్సిపల్ అమౌంట్), రెసిడెన్షియల్ ఇండ్లప్లాట్ల కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ ప్లస్ రిజిస్ట్రేషన్ చార్జీలు, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్), యూఎల్ఐపీ, ఐదేండ్ల గడువు గల టాక్స్ సేవింగ్ ఎఫ్డీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు తదితరాలతో ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను ఆదా చేయొచ్చు. అయితే ఆదాయం పన్ను చట్టం (ఐటీ యాక్ట్-1961)లోని 80సీ చట్ట ప్రకారం ప్రతియేటా రూ.1.50 లక్షల వరకు మాత్రమే డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. ఇతర సేవింగ్స్ పథకాల్లో నిధులు మదుపు చేయడం ద్వారా మరింత పన్ను ఆదా చేయొచ్చు. అవేంటో చూద్దామా..!
ఆదాయం పన్ను చట్టంలోని 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను డిడక్షన్ పరిమితి దాటిందనుకోండి. అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50 వేల వరకు డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. అందుకు ఇదే చట్టంలోని 80సీసీడీ సెక్షన్ అవకాశం కల్పిస్తున్నది. ప్రతియేటా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు కోరవచ్చు.
ఐటీ చట్టం 80డీ సెక్షన్ కింద పన్ను చెల్లింపుదారులు తమ హెల్త్ ఇన్సూరెన్స్ప్రీమియం మీద మీరు మీ జీవిత భాగస్వామికి, మీ ఇద్దరు పిల్లకు రూ.25 వేలు, తల్లిదండ్రుల కోసం అదనంగా రూ.25 వేలు క్లయిమ్ చేయొచ్చు. ఒకవేళ పేరెంట్స్ 60 ఏండ్లు దాటితే రూ.75 వేల వరకు మినహాయింపు పొందొచ్చు. తల్లిదండ్రులిద్దరూ 60 ఏండ్లు దాటితే.. రూ.లక్ష వరకు డిడక్షన్ క్లయిమ్ చేసుకోవచ్చు. ఇదు సెక్షన్లో హెల్త్ చెకప్ కింద రూ.5000 ఖర్చు చూపవచ్చు.
ఆదాయం పన్ను చట్టంలోని 80ఈ సెక్షన్ కింద ఎడ్యుకేషన్ లోన్ రీ పేమెంట్ క్లయిమ్ చేయొచ్చు. జీవిత భాగస్వామి అయినా, పిల్లలకైనా, ఇతర ఏ విద్యార్థికైనా మీరు లీగల్ గార్డియన్ అయినా ఈ స్కీం కింద క్లయిమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లోన్ రీపేమెంట్ ప్రారంభించినప్పటి నుంచి ఏడేండ్ల వరకు చేయొచ్చు. ఉన్నత విద్యా చదువులకు మాత్రమే ఎడ్యుకేషన్ లోన్ లభిస్తుంది.
ఇల్లు కొనుగోలు కోసం తీసుకునే రుణంపై చెల్లిస్తున్న వడ్డీ మీద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 24 సెక్షన్ ప్రకారం గరిష్టంగా రూ. 2 లక్షల వరకు మినహాయింపు కోరవచ్చు. ఒకవేళ మీరింగా ఆ ఇంట్లోకి రాకుండా ఉంటే, ఇంటద్దె చెల్లిస్తూ ఉన్నా.. మొత్తం వడ్డీపై పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు.
ఇంతకుముందు సొంతిల్లు లేనివారు.. రుణంపై తొలిసారి ఇల్లు కొన్నా.. సంబంధిత బ్యాంకులిచ్చిన రుణాలపై వడ్డీ మినహాయింపు కోరవచ్చు. ఆదాయం పన్ను చట్టం 80ఈఈ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.50వేల వరకు డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. ఇది 24 సెక్షన్ కింద రూ.2 లక్షల మినహాయింపునకు అదనం. ఇంటి విలువ రూ.50 లక్షలు ఉండాలి. రుణం మొత్తం రూ.35 లక్షల్లోపు ఉండాలి. 2016 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2017 మార్చి 31 మధ్య కొనుగోలు చేసి ఉండాలి.
ఇతర ఇండ్లు లేనివారు తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తే ఆదాయం పన్ను చట్టంలోని 80ఈఈఏ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఇదీ కూడా 24 సెక్షన్లో రూ.2 లక్షల డిడక్షన్ ఆప్షన్‌కు అదనం. అయితే, స్టాంప్ డ్యూటీ వాల్యూ ప్రకారం ఆ ఇంటి ధర రూ.45 లక్షల్లోపే ఉండాలి. ఇంటి రుణం కూడా 2019 ఏప్రిల్1-2020 మార్చి 31 మధ్య మంజూరై ఉండాలి.
మీరు పని చేసే సంస్థలో హెచ్ఆర్ఏ పొందకపోయినా.. మీరు స్వయం ఉపాధి కలిగి ఉన్న వ్యక్తి అయినా ఆదాయం పన్ను చట్టంలోని 80జీజీ ఇంటద్దె కింద క్లయిమ్ చేయొచ్చు. ఈ డిడక్షన్ క్లయిమ్ చేయాలంటే మీరు ఫామ్ 10బీఏ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ కింద రూ.60 వేల వరకు క్లయిమ్ చేయడానికి ఆస్కారం ఉంది.