Credit Suisse-UBS | సంక్షోభం అంచుల్లో ఉన్న స్విస్ బ్యాంక్ ‘క్రెడిట్ సూయిజ్’ను టేకోవర్ చేసేందుకు దాని ప్రత్యర్థి సంస్థ యూబీఎస్ ఏజీ గ్రూప్ సిద్ధమైంది. ఇందుకు 100 కోట్ల డాలర్లు చెల్లించేందుకు యూబీఎస్ ఏజీ గ్రూప్ రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుత సంక్షుభిత సమయంలో క్రెడిట్ సూయిజ్ బ్యాంకు కొనుగోలు ఒప్పందానికి వాటాదారుల ఆమోదం నిబంధనను బైపాస్ చేసేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం చట్టంలో సవరణలు తేవడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిసిందని ఫైనాన్సియల్ టైమ్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఈ అంశంపై స్పందించడానికి క్రెడిట్ సూయిజ్ గానీ, యూబీఎస్ ఏజీ గ్రూప్ గానీ, స్విట్జర్లాండ్ సర్కార్ గానీ ముందుకు రాలేదు.
అయితే, సోమవారం గ్లోబల్ ఫైనాన్సియల్ మార్కెట్లు తెరుచుకునే లోపే 167 ఏండ్ల పాత కాలం నాటి బ్యాంక్ ‘క్రెడిట్ సూయిజ్’ను గట్టెక్కించేందుకు స్విస్ సర్కార్, అధికారులు కృషి చేస్తున్నారు. ఆల్ షేర్ డీల్‌పై క్రెడిట్ సూయిజ్, యూబీఎస్ ఏజీ ప్రతినిధులు ఆదివారం సంతకాలు చేస్తారని ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొన్నది
ప్రపంచవ్యాప్త స్టార్టప్ సంస్థలకు పెన్నిధిగా నిలిచిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), దాని వెంటే సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలాయి. ఆ వెంటనే స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూయిజ్ సంక్షోభం అంచున ఉన్నదంటూ వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్లలో కలవరం మొదలైంది. ఈ పరిస్థితుల్లో క్రెడిట్ సూయిజ్‌ను టేకోవర్ చేయాలని యూబీఎస్ ఏజీ గ్రూప్‌పై స్విట్జర్లాండ్ సర్కార్ ఒత్తిడి పెంచినట్లు రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
క్రెడిట్ సూయిజ్ బ్యాంకును కొనుగోలు చేయాల్సి వస్తే 600 కోట్ల డాలర్లు ఇవ్వాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని యూబీఎస్ ఏజీ అధికారులు కోరినట్లు సమాచారం. క్రెడిట్ సూయిజ్ టేకోవర్‌తో తలెత్తే న్యాయ పరమైన చార్జీలకు హామీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని యూబీఎస్ కోరుతున్నట్లు తెలియవచ్చింది. ఒకవేళ రెండు బ్యాంకులు కలిస్తే పది వేల మంది ఉద్యోగుల జీవితాలు త్రిశంకు స్వర్గంలో చిక్కుకుంటాయని ఆయా బ్యాంకుల అధికార వర్గాల కథనం. ఈ సంక్షోభంలో ఉద్వాసన ముప్పు గల ఉద్యోగులకు పరిష్కార మార్గం చూపేందుకు తక్షణం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్విస్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది.
క్రెడిట్ సూయిజ్‌ను టేకోవర్ చేయాల్సి వస్తే దాని వ్యాపారాన్ని విభజించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై యూబీఎస్, స్విస్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ఫిన్మా స్పందించడానికి నిరాకరించాయి. యూబీఎస్ ఏజీలో క్రెడిట్ సూయిజ్ విలీనంపై రెండు బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.