సొంతింటి కలను నిజం చేసుకోవడానికి 15-20 ఏండ్ల కింద తీసుకున్న హోం లోన్‌ను తీర్చేశారా?.. ఏండ్లుగా మోస్తున్న ఈఎంఐ భారం నుంచి రిలీఫ్ పొందారా? అయితే మరి తదుపరి ప్రణాళిక ఏమిటి? మిగులుతున్న ఈఎంఐ మొత్తాన్ని ఎలా మదుపు చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సరైన మార్గాలేమిటో చూద్దాం.
రిటైర్మెంట్ ఫండ్
చాలామంది రియల్ ఎస్టేట్‌పై ఉన్న మక్కువతో రెండో ఇంటి కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండో ఇంటి మీద పెట్టుబడి, దానిపై ఆదాయం ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు. ఇంటిపై వస్తున్న అద్దె ఆదాయం మూడు శాతానికి మించి లేదు. పెట్టుబడి పెరుగుతుందన్న ఆశకొద్దీ రెండో ఇంటిని కొనుగోలు చేయాలనుకోవచ్చు. కానీ మొదటి హోం లోన్‌ను తీర్చి వేశారంటే మీ వయసు 45 ఏండ్ల పైబడే ఉంటుంది. ఈ వయసులో మీ ప్రాధాన్యత రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నత చదువులు. పిల్లలు ఎదిగి వచ్చినట్టయితే మీరు అనుకుంటున్న రెండో ఇంటిని మీ పిల్లలే కొంటారు. కనుక మీ ప్రథమ ప్రాధాన్యత రెండో ఇల్లు కానే కాదు.
ఎమర్జెన్సీ ఫండ్
మధ్య వయసులోనూ రిటైర్మెంట్కు సమీపిస్తున్న మీకు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అలాగే ఎదిగిన మీ పిల్లల పెండ్లిండ్లు చేయాల్సి రావచ్చు. ఈ ఖర్చుల కోసం మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ జమ చేసుకునే అవకాశానికి ఇదే మంచి సమయం. ఇప్పటిదాకా బాధ్యతల కోసం ఖర్చు చేసిన మీరు.. ఇక నుంచి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించండి. గతేడాది కాలంగా ఎదురవుతున్న అనుభవాల దృష్ట్యా ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. ఎప్పుడంటే అప్పుడు వెనక్కి తీసుకునే అవకాశం ఉన్న ఆర్థిక సాధనాల్లో మదుపు చేయండి. అవి ఫిక్సడ్ డిపాజిట్లు కావచ్చు లేదా హైబ్రిడ్ ఫండ్లు కావచ్చు. ఈఎంఐ మొత్తాన్ని ప్రతి నెలా వీటిలో మదుపు చేయండి.
వ్యక్తిగత జీవనం
నడి వయసులో కొన్ని సమయానుకూల పెట్టుబడులు అవసరమవుతాయి. రిటైర్మెంట్, పిల్లల ఉన్నత చదువు, పెండ్లిండ్లతోపాటు ఇన్నాళ్లూ తీర్చుకోలేని హాలిడేయింగ్ వంటి కొన్ని కోరికలనూ తీర్చుకోవడానికి కూడా స్వల్ప కాల మదుపు అవసరమవుతుంది. మీరు దూరంగా ఉన్న కొన్ని హాబీలను మొదలుపెట్టి మీదైన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించండి.
అధిక వడ్డీ రుణాలు వద్దు
క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, చేబదులు వంటి అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తీర్చివేయడానికి ఇంతకు మించిన సమయం మరొకటి లేదు. రుణ భారాలను తగ్గించుకోవడం వల్ల పోయే తలనొప్పులు అనేకం. మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. దానికితోడు మీరు ప్రతి నెలా చెల్లిస్తున్న వడ్డీ తగ్గిపోతుంది.
పెట్టుబడులు
ఇప్పటివరకు రుణ భారంతో చేయలేకపోయిన ఇన్వెస్ట్మెంట్లకు కూడా ఇదే మంచి సమయం. ఈక్విటీ మార్కెట్లతోపాటు ఇప్పుడు అనేక ఆర్థిక సాధనాల్లో రాబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా అధికంగా ఉన్నాయి. పీపీఎఫ్తోపాటే వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్ కేటాయింపులను పెంచండి. డెట్ ఫండ్లలో, అగ్రెసివ్ అడ్వాంటేజ్ ఫండ్లలో రాబడులు గత రెండేండ్లలో అత్యధికంగా ఉన్నాయి. వీటిలో నెలకు కొంత మొత్తాన్ని మదుపు చేయండి. పాత ఈఎంఐ మొత్తాన్ని వీటిలో మదుపు చేసినా మీరు మీ రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు.