Signature Bank | ఎస్వీబీ దెబ్బ.. మరో అమెరికా బ్యాంక్ మూసివేత
Signature Bank | ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థకు వణుకుపుట్టించిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) పతనం మరో అమెరికా బ్యాంక్ మూసివేతకు కారణమయ్యింది. ఎస్వీబీ సంక్షోభం నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిగ్నేచర్ బ్యాంక్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసేందుకు డిపాజిటర్లు మూకుమ్మడిగా పరుగులు తీయడంతో ఈ బ్యాంక్‌ను న్యూయార్క్ స్టేట్ రెగ్యులేటర్లు ఆదివారం మూసివేశారు.
Signature Bank | న్యూయార్క్, మార్చి 13: ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థకు వణుకుపుట్టించిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ( Silicon Valley Bank – ఎస్వీబీ) పతనం మరో అమెరికా బ్యాంక్ మూసివేతకు కారణమయ్యింది. ఎస్వీబీ సంక్షోభం నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిగ్నేచర్ బ్యాంక్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసేందుకు డిపాజిటర్లు మూకుమ్మడిగా పరుగులు తీయడంతో ఈ బ్యాంక్‌ను న్యూయార్క్ స్టేట్ రెగ్యులేటర్లు ఆదివారం మూసివేశారు. 110.36 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఆస్తులు (బ్యాంక్ ఇచ్చిన రుణాలు) ఉన్న సిగ్నేచర్ బ్యాంక్ వద్ద 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. ఎస్వీబీ ఉదంతం నేపథ్యంలో అమెరికాలో పలు చిన్న, ప్రాంతీయ బ్యాంక్‌లపై ఒత్తిడి ఏర్పడుతుందన్న విశ్లేషకుల అంచనాల్ని వాస్తవం చేస్తూ కేవలం రెండురోజుల వ్యవధిలోనే మరో బ్యాంక్ మూతపడింది. సిలికాన్ వ్యాలీ తరహాలోనే సిగ్నేచర్‌లో కూడా బిజినెస్ ఖాతాదారులు ఎక్కువ. అధిక శాతం ఖాతాల్లో 2,50,000 లక్షల డాలర్లకు మించి నిల్వ ఉంటుంది. కేవలం 2.50 లక్షల డాలర్ల విలువ గల డిపాజిట్లకు మాత్రమే ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బీమా రక్షణ ఉంటుంది.
క్రిప్టో స్పెషలిస్ట్
సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ స్టార్టప్‌లకు నిధులు అందించడంలో ప్రత్యేకత కలిగిన బ్యాంక్ కాగా, సిగ్నేచర్ బ్యాంక్ క్రిప్టోకరెన్సీ ఆస్తుల్ని , క్రిప్టో ఎక్సేంజీల నగదు నిల్వల్ని డిపాజిట్లుగా స్వీకరించే అతికొద్ది అమెరికా బ్యాంక్‌ల్లో ఒకటి. డిజిటల్ సంబంధిత క్లయింట్ డిపాజిట్లు ఈ బ్యాంక్‌లో 16.52 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. క్రిప్టో ఎక్సేంజ్ కాయిన్‌బేస్ గ్లోబల్‌కు చెందిన 240 మిలియన్ డాలర్ల నగదు బ్యాలెన్స్ సిగ్నేచర్ బ్యాంక్ ఉన్నట్టు తాజా ట్వీట్లో తెలిపింది. అలాగే క్రిప్టోకరెన్సీ యూఎస్డీసీ స్టేబుల్‌కాయిన్‌ను జారీచేసే సంస్థ సర్కిల్ ఇంటర్నెట్ ఫైనాన్షియల్ సైతం తమ ట్రాన్సాక్షన్, సెటిల్మెంట్ ఖాతాలు సిగ్నేచర్ వద్ద ఉన్నాయని తెలిపింది. క్రిప్టో ఎక్సేంజ్ ఎఫ్‌టీఎక్స్ గత డిసెంబర్లో హఠాత్తుగా పతనమైనప్పటి నుంచి సిగ్నేచర్ బ్యాంక్ పట్ల ఖాతాదారులు ఉత్కంఠతోనే ఉన్నారు. అయితే తమ మొత్తం డిపాజిట్లలో క్రిప్టో ఎక్సేంజ్ ఎఫ్‌టీఎక్స్ డిపాజిట్లు 0.1 శాతంలోపేనంటూ సిగ్నేచర్ బ్యాంక్ ప్రకటించడంతో ఆందోళన క్రమేపీ తగ్గింది. డిజిటల్ క్లయింట్ల మొత్తం డిపాజిట్లలో 10 బిలియన్ డాలర్ల డిపాజిట్లను వదిలించుకునే ప్రయత్నాల్ని సైతం మొదలుపెట్టినట్టు ఈ బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ లోపు మార్చి 8న మరో క్రిప్టో స్పెషలైజ్డ్ బ్యాంక్ సిల్వర్‌గేట్ బ్యాంక్ మూసివేతకు గురైంది. అటుతర్వాత నెలకొన్న ఎస్వీబీ సంక్షోభంతో సిగ్నేచర్ బ్యాంక్ డిపాజిటర్లు క్యూకట్టారు. దాంతో రెగ్యులేటర్లు ఈ బ్యాంక్‌ను మూసివేయక తప్పలేదు.
కొత్త ‘బ్రిడ్జ్ బ్యాంక్’లోకి ఎస్వీబీ డిపాజిట్లు
డిపాజిటర్లను పరిరక్షించేక్రమంలో ఎస్వీబీ డిపాజిట్లు అన్నింటినీ కొత్తగా ఏర్పాటుచేసిన ‘బ్రిడ్జ్ బ్యాంక్’లోకి యూఎస్ ఫెడరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) బదిలీ చేసింది. ఎఫ్‌డీఐసీ నిర్వహించే ఈ బ్యాంక్‌కు ఇన్సూర్ అయినవి, ఇన్సూర్కానివి..అన్ని డిపాజిట్లను బదిలీ చేశారు. కొత్తగా నెలకొల్పిన బ్రిడ్స్ బ్యాంక్ ఎస్వీబీ డిపాజిట్లతో పాటు కొన్ని అప్పులను తీసుకుంటుంది. మరికొన్ని బ్యాంక్ ఆప్పులను కొనుగోలు చేస్తుంది. ఎస్వీబీ విక్రయ ప్రక్రియ జరిగేవరకూ తాత్కాలికంగా ఈ బ్రిడ్జ్ బ్యాంక్ పనిచేస్తుంది. సోమవారం నుంచి డిపాజిటర్లు వారి డబ్బును ఆన్లైన్ బ్యాంకింగ్‌తో సహా బ్యాంక్ శాఖల్లో సాధారణ పనిగంటల్లో తీసుకోవచ్చని ఎఫ్‌డీఐసీ తెలిపింది. ఎస్వీబీ కస్టమర్లు ఆటోమాటిక్‌గా కొత్త బ్యాంక్ ఖాతాదారులవుతారని, ఏటీఎంలో ద్వారా నగదు తీసుకోవచ్చని, గతంలోలానే చెక్కులు రాయవచ్చన్నది.
మన బ్యాంకులు భద్రమే: బైడెన్
సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌ల వైఫల్యం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతినుద్దేశించి మాట్లాడారు. ‘మీ డిపాజిట్లు భద్రంగా ఉంటాయి. అవసరానికి అందుతాయి’ అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘బ్యాంకులపై విశ్వాసాన్ని కోల్పోవద్దని, ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లబోదని, ఏం జరిగినా మేమున్నాం’ అంటూ వైట్‌హౌజ్ నుంచి దేశ ప్రజలనుద్దేశించి బైడెన్ మాట్లాడారు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగానే ఉందన్నారు.
చౌక బేరం
- ఎస్వీబీ యూకే సబ్సిడరీని రూ.100కే కొన్న హెచ్ఎస్బీసీ
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూకే సబ్సిడరీని మరో అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి స్వంతం చేసుకుంది. ఎస్వీబీ సంక్షోభం బ్రిటన్‌లో టెక్నాలజీ, లైఫ్ సైన్స్స్ రంగాల కస్టమర్లను ప్రభావితం చేయడంతో ఎస్వీబీ (యూకే) లిమిటెడ్‌ను 1 పౌండ్ (రూ.99.58) ధరకు హెచ్ఎస్బీసీకి విక్రయించినట్టు బ్రిటన్ ప్రభుత్వ ప్రకటన తెలిపింది. యూకే ప్రధాని రిషి సునక్ నేతృత్వంలో బ్రిటన్ ఆర్థిక శాఖ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లు సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ లావాదేవీని పూర్తిచేశాయి. ఈ యూకే సబ్సిడరీ బ్యాంక్‌లో కస్టమర్ల డిపాజిట్లన్నీ సురక్షితమని, లావాదేవీలో ప్రభుత్వం ఎటువంటి నగదు సహాయం చేయలేదని బ్రిటన్ ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ తెలిపారు. ఎస్వీబీ యూకే వ్యాపారానికి కేవలం 1 పౌండ్ చెల్లించినట్టు హెచ్ఎస్బీసీ వేరొక ప్రకటనలో తెలిపింది. ఎస్వీబీ యూకేకు 5.5 బిలియన్ పౌండ్ల లోన్ బుక్, 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

