న్యూఢిల్లీ, జనవరి 12 : రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది. గత నెలలో 3 నెలల గరిష్ఠాన్ని తాకింది. డిసెంబర్లో 1.33 శాతంగా నమోదైంది. ఎగిసిన ఆహారోత్పత్తుల ధరలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కాగా, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఈ ప్రధాన ద్రవ్యోల్బణం అంతకుముందు నెల నవంబర్‌లో 0.71 శాతంగానే ఉన్నది. కేవలం నెల రోజుల వ్యవధిలో దాదాపు రెట్టింపవడం గమనార్హం. సెప్టెంబర్‌లో 1.44 శాతంగా ఉండగా.. మళ్లీ ఆ తర్వాత డిసెంబర్లోనే ఆ స్థాయి దరిదాపుల్లోకి వెళ్లింది. కూరగాయలు, మాంసం, గుడ్లు, చేపలు, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఇతరత్రా ఉత్పత్తుల ధరలు పెరిగాయని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేస్తూ తెలియజేసింది.
దేశంలోని గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లోనే ద్రవ్యోల్బణం ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. గత నెలలలో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2.03 శాతంగా ఉన్నది. ఇదే సమయంలో గ్రామాల్లో 0.76 శాతంగానే ఉన్నట్టు తేలింది. కాగా, ఎన్ఎస్వో లెక్కల ప్రకారం.. గత నెల ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న రాష్ర్టాల్లో కేరళ (9.49 శాతం), కర్ణాటక (2.99 శాతం), ఆంధ్రప్రదేశ్ (2.71 శాతం), తమిళనాడు (2.67 శాతం), జమ్ముకశ్మీర్ (2.26 శాతం) ముందు వరుసలో ఉన్నాయి. అస్సోం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్‌లలో ధరల సెగ తక్కువగా ఉన్నది.
పెరుగుతూపోతున్న నేపథ్యంలో.. ఇంకా పెరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ రంగంలోకి దిగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్.. ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికే కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించిన సంగతి విదితమే. సుదీర్ఘకాలం కీలక వడ్డీరేట్లను అధిక స్థాయిల్లోనే ఉంచారు. అయితే ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా వచ్చిన దగ్గర్నుంచి రెపోరేటును తగ్గిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ధరల సూచీ తిరిగి పరుగులు పెడితే వడ్డీరేట్ల పెంపు తప్పకపోవచ్చు. నిజానికి ఇప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయిలోనే ఉన్నది. 4 శాతాన్ని దాటకుండా చూడాలన్నదే రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం. అయితే పెరుగుతున్న ధరల దృష్ట్యా ఆర్బీఐ అప్రమత్తమైతే రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల కోతలకు అవకాశాలు అంతంతమాత్రమే. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఈఎంఐల భారం తగ్గదు. పైగా నిర్మాణ, బ్యాంకింగ్, ఆటో సంస్థలకూ దెబ్బేనని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.