Personal Finance | తలపండిన ఆర్థిక మేధావులకూ అర్థం కాని బ్రహ్మపదార్థం ఇన్వెస్ట్మెంట్! అంచనాలకు అందని లాభాలు వస్తాయని ఆశించి పెట్టిన పెట్టుబడులన్నీ రాత్రికి రాత్రి ఆవిరైపోతాయి. బంధుగణం, మిత్రబృందం సలహాలు సరేసరి! వాళ్ల అనుభవాలకు అతిశయోక్తి అలంకారాలు జోడించి పెట్టుబడికి దారులు వేస్తారు. వారి విషయంలో గోరంత ఇన్వెస్ట్‌మెంట్‌కు కొండంత లాభం ఇచ్చిన రంగం.. మీ విషయంలో కొండంత పెట్టుబడిని రవ్వంత చేస్తుంది. ఫైనాన్షియల్ ఈక్వేషన్స్‌తో సంబంధం లేకుండా మీ పెట్టుబడి పదికాలాల్లో పదిలంగా పెరగాలంటే ఇలా చేయండి..
పెట్టుబడి ప్రధాన ఉద్దేశం డబ్బును ఇబ్బడిముబ్బడిగా పెంచడం కాదు. అత్యవసరాల్లో అక్షయ‘పాత్ర’ పోషించాలి. భవిష్యత్తులో ఉన్నపళంగా ఎదిగేందుకు పెద్ద నిచ్చెన అవ్వాలి. అంతేకానీ, ‘ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు టైమ్ రిస్క్..’ అనిపించొద్దు. అర్థం కాలేదా..! ప్రభాకరం కథ చదివితే.. ఏది మంచి పెట్టుబడో ఇట్టే తెలిసిపోతుంది. ప్రభాకరానికి ఒక్కగానొక్క కూతురు. తన పెండ్లి కోసం నగర శివారులో ఎప్పుడో మూడు వందల గజాల స్థలం కూడా తీసుకున్నాడు. అనుకోకుండా మంచి సంబంధం దొరికింది. ముహూర్తమూ కుదిరింది. ఆ ఒక్క ప్లాట్ అమ్మితే వచ్చే డబ్బులతో కట్నకానుకలు, పెండ్లి ఖర్చులన్నీ వెళ్లిపోతాయని భావించాడు. మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. ఒకరిద్దరు ఇన్వెస్టర్లూ వచ్చారు. ఇంతలో ఎన్నికల కోడ్ కూసింది. తెల్లారేసరికి ప్రభాకరం ఇంటి నుంచి ప్రధాన రహదారికి వెళ్లే మార్గంలో రెండు చెక్‌పోస్టులు వెలిశాయి. ప్లాట్ ధరంతా వైట్‌లో చెల్లించడానికి కొనుగోలుదారులు సిద్ధంగా లేరు. బ్లాక్‌లో ఇచ్చిన డబ్బును ఇంటిదాకా తీసుకెళ్లే ధైర్యం ప్రభాకరానికీ లేదు. ముహూర్తం ముంచుకొచ్చే కొద్దీ ఆయనలో ఒత్తిడి పెరిగింది. అతని అత్యవసరం గుర్తించిన ఇన్వెస్టర్లు సగం ధరకు బేరాలు ఆడటం మొదలుపెట్టారు. ఒకవైపు పెండ్లి పనులు, మరోవైపు తనిఖీల ఒత్తిడి.. ప్లాట్ అమ్మకం అటకెక్కించి.. అందినచోటల్లా అప్పులు చేసి బరువుగా బాధ్యత తీర్చుకున్నాడు.
ప్రభాకరానికి ఆ క్షణంలో అండగా నిలిచిన స్నేహితుడి పేరు విశాల్. ఇతను కూడా భూమ్మీద పెట్టుబడి పెట్టినవాడే! అలాగని ఉన్నదంతా దానిమీదే కుమ్మరించలేదు!! తెలివిగా బంగారం మీద పెట్టుబడి పెడుతూ పోయాడు. అధికారిక గోల్డ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసి నలభై తులాల వరకూ బంగారం కూడబెట్టగలిగాడు. కూతురు పెండ్లి ఎలా జరుగుతుందో అని కంగారుపడుతున్న స్నేహితుడికి అవసరంలో అధికారికంగా సాయం చేశాడు. ముప్పయ్ తులాల బంగారం బ్యాంకులో కుదువపెట్టి పదిహేను లక్షల రూపాయలు సాయం చేసి పేరుకు తగ్గట్టే తన మనసూ విశాలమని నిరూపించుకున్నాడు. ఈ ఆపత్కాలంలో ఆదుకున్న మరో స్నేహితుడు లక్ష్మీపతి. ఏ గత్యంతరం లేక.. పెండ్లికి పది రోజుల ముందు మిత్రుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ప్రభాకరం. ‘మై హూఁ నా’ అన్నాడు లక్ష్మీపతి. నాలుగు రోజుల్లో రూ.25 లక్షలు ప్రభాకరం బ్యాంకు ఖాతాలో జమచేశాడు. తావీజు మహిమేం లేదు ఇక్కడ. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏండ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్న లక్ష్మీపతికి పాతిక లక్షలు పెద్ద మ్యాటర్ అనిపించలేదు. అదృష్టవశాత్తు మార్కెట్ కూడా బాగా ఉండటంతో తన ఫండ్స్లోంచి పాతిక లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు. మూడు రోజుల్లో డబ్బులు అతని ఖాతాలో పడ్డాయి. మరుసటి రోజు స్నేహితుడికి అందాయి.
ముగ్గురు స్నేహితులూ మంచి ఇన్వెస్టర్లే! ఒకరు భూమి మీద పెట్టారు. ఇంకొకరు బంగారాన్ని నమ్ముకున్నారు. వేరొకరు మ్యూచువల్ఫండ్స్ను ఎంచుకున్నారు. వీరి అవసరానికి ఆదుకున్నది మాత్రం బంగారం, మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే! అలాగని భూమి మీద పెట్టుబడి పెట్టొద్దు అనుకోవద్దు. స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం. మీ అవసరానికి కనీసం ఆరు నెలల ముందునుంచే అమ్మకానికి సంబంధించిన వ్యవహారం మొదలుపెట్టాలి. అయితే, కొన్నిసార్లు ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో వాళ్లకు శస్త్రచికిత్స అవసరం పడొచ్చు! అనుకోకుండా కూతురును విదేశాలకు పంపించాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో.. బంగారాన్ని మించిన కొంగుబంగారం లేదు! మ్యూచువల్ ఫండ్స్‌ను మించిన ఫండ్స్ లేవు. నేల మీద పెట్టుబడి ఎల్లవేళలా మంచిదే! కానీ, అక్కరకు రాని చుట్టమే కాదు, పెట్టుబడిని కూడా గ్రక్కున విడువంగ వలయు సుమతి!! చివరిగా, మార్కెట్ లెక్కల ప్రకారం దీర్ఘకాలంలో బంగారంపై 8-11 శాతం రిటర్న్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్‌లో ఇది 12 శాతం వరకు ఉంది. మ్యూచువల్ ఫండ్స్ 14 శాతం వరకు రిటర్న్స్ ఇస్తున్నాయి. ఎందులో ఇన్వెస్ట్ చేసినా లాభమే! కానీ, అవసరానికి ఏది త్వరగా లాభిస్తుందో అందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఉత్తమ పెట్టుబడి అనిపించుకుంటుంది.
మార్కెట్ క్రాష్ అయితే మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏమిటి? అనొచ్చు! ముప్పయ్ శాతం క్రాష్ అయినా.. 70 శాతం పదిలంగా ఉంటుంది. ఏడాదిలో మళ్లీ కుదురుకుంటుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ భారీగా పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మీ స్థిరాస్తిని మార్కెట్ ధరకు కొనుగోలు చేసే పెట్టుబడిదారులు కూడా అంత తేలిగ్గా దొరకరని గుర్తుంచుకోండి.
ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in