H-1 B Visa | కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. ఐటీ సంస్థల్లో నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్1-బీ వీసాతోపాటు ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేయడానికి వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ జాబితాలో ఎల్-1, ఓ-1, ఉన్నాయి. వీసా దరఖాస్తుదారులు భారత్ లోని స్థానిక కాన్సులేట్లలో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది.
ఇప్పటికే అమలులో ఉన్న ఈ ఫెసిలిటీని వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కనుక ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా వీసా పొందొచ్చు. వీసా జారీ చేయడానికి ముందు సంబంధిత వ్యక్తిని కాన్సులేట్, ఎంబసీ అధికారులు ఇంటర్వ్యూ చేస్తారు. తాత్కాలిక వర్క్ వీసాదారులపై ఉండే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని నాన్ ఇమిగ్రెంట్ పర్యాటక వీసాల జారీకి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది.
ప్రత్యేక వృత్తి పరమైన వీసాల క్యాటగిరీలో హెచ్-1బీ, ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి హెచ్-3 వీసా, అసాధారణ సామర్థ్యాలు కల వారికి ఓ-వీసా, అథ్లెట్లు, ఆర్టిస్ట్లు, వినోద రంగ ప్రముఖులకు పీ-వీసా, ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్చేంజ్ కార్యక్రమాలకు క్యూ-వీసాలు తీసుకునే వారికి ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.