హైదరాబాద్, మార్చి 11(బిజినెస్ బ్యూరో) : విమాన పరికరాల అడ్డాగా మారిపోతున్నది హైదరాబాద్ నగరం. ఇప్పటికే హెలిక్యాప్టర్ల క్యాబిన్లు, ఇతర విడిభాగాలు ఇక్కడ తయారవుతుండగా.. తాజాగా యుద్ధ విమానాలకు సంబంధించిన రెక్కలు కూడా ఇక్కడే తయారుకాబోతున్నాయి. వీటిని టాటా-లాక్‌హీడ్ జాయింట్ వెంచర్లో హైదరాబాద్‌లో ఏర్పాటైన టాటా లఖీద్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్(టీఎల్ఎంఏఎల్) యూనిట్లోనే తయారు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి శనివారం అధికారికంగా ఒప్పందం జరిగింది. భారత వైమానిక దళాల కోసం తయారు చేస్తున్న ఈ రెక్కలను ఎఫ్-16 బ్లాక్ 70 ఫైటర్ జెట్‌లో వినియోగించనున్నారు. అక్టోబర్ 2021 నుంచే ఫైటర్ వింగ్స్‌ను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న టీఎల్ఎంఏఎల్.. తాజాగా పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది.
రెండేండ్ల తర్వాత తొలి ఉత్పత్తి..
ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం టీఎల్ఎంఏఎల్..29 ఫైటర్ వింగ్ షిప్సెట్లను తయారు చేయబోతున్నది. రెండేండ్ల తర్వాత ఈ జెట్ రెక్కల ఉత్పత్తిని ప్రారంభించనున్న టీఎల్ఎంఏఎల్..ఆ తర్వాతి ఏడాదిలో భారత వైమానిక దళాలకు సరఫరా చేయనున్నది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎలా డిజైన్ చేసేదానిపై చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అమెరికా యూనిట్లోనే ఎఫ్-16 బ్లాక్ 70/72 జెట్ వింగ్స్‌ను తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో వీటిని భారత్‌లో తయారు చేయాలనుకుంటున్నామని లఖీద్ మార్టిన్, టాటా వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో లాక్‌హీడ్ మార్టిన్‌తో టాటా గ్రూపు భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉన్నది. సాంకేతిక సంక్లిష్టతలు ఉన్నప్పటికీ యుద్ధ విభాగాన్ని విజయవంతంగా పారిశ్రామికీకరించడం, అర్హత సాధించినందుకుగాను టీఎల్ఎంఏఎల్ బృందాన్ని అభినందిస్తున్నాను. దేశంలో ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ రంగం మరింత బలోపేతం కానున్నది.
– ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్