జియోతో ఇంటర్నెట్ చౌక
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా అందే నిధులను దాని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జీఐఎల్ లేదా జియో) అప్పులను తీర్చేందుకు వాడుతామని ఆ కంపెనీ ఎండీ ఆకాశ్ అంబానీ స్పష్టం చేశారు. బుధవారం జియో ప్లాట్‌ఫామ్స్ తమ ఐపీవో కోసం రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ లేదా ప్రాథమిక పత్రాలు) దాఖలు చేసిన నేపథ్యంలో గురువారం ఇక్కడ కంపెనీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
- జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ
- రుణ విముక్తి కోసమే ఈ పబ్లిక్ ఇష్యూ
- 10 కోట్ల హోమ్ బ్రాడ్‌బాండ్ కస్టమర్లే లక్ష్యం
- కంపెనీ ఐపీవో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం
ముంబై, అక్టోబర్ 15: జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా అందే నిధులను దాని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జీఐఎల్ లేదా జియో) అప్పులను తీర్చేందుకు వాడుతామని ఆ కంపెనీ ఎండీ ఆకాశ్ అంబానీ స్పష్టం చేశారు. బుధవారం జియో ప్లాట్‌ఫామ్స్ తమ ఐపీవో కోసం రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ లేదా ప్రాథమిక పత్రాలు) దాఖలు చేసిన నేపథ్యంలో గురువారం ఇక్కడ కంపెనీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. రూ.30,213 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూను తెస్తున్నామని, ఇందులో రూ.27,500 కోట్లదాకా జియోకున్న రుణాలను తీర్చేందుకే వినియోగిస్తామని వెల్లడించారు. తద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ నికర రుణ రహిత సంస్థగా ఆవిర్భవించనుందన్నారు. అలాగే ఒక్కో టెలికాం వినియోగదారుడి నుంచి లభించే ఆదాయ సగటు (ఏఆర్పీయూ), 5జీ కస్టమర్ల సంఖ్యను పెంచడంపై దృష్టి పెడుతున్నట్టు వివరించారు.
గత ఆర్థిక సంవత్సరం (2025-26) కంపెనీ స్థూల ఆదాయం సుమారు రూ.76,000 కోట్లుగా ఉన్నది. కాగా, ఈ నెల 21న మొదలై 23న ముగిసే జియో ఐపీవోలో షేర్ ధరల శ్రేణి రూ.1,065-1,119గా ఉన్నది. 27 కోట్ల షేర్ల ఫ్రెష్ ఇష్యూ జరుగుతున్నది. దీంతో ప్రస్తుతం దేశీయ ఐపీవో చరిత్రలో అగ్రస్థానంలో ఉన్న హ్యుందాయ్.. రెండో స్థానంలోకి వెళ్లనున్నది. షేర్ల లిస్టింగ్ ఈ నెల 28న ఉండే అవకాశాలుండగా.. సంస్థ విలువను దాదాపు రూ.10.3 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
జియో డాటానే చౌక..
ప్రపంచంలో మరే దేశంలోనూ.. ఏ సంస్థ కూడా జియో ఇస్తున్నట్టుగా ఇంటర్నెట్ను చౌకగా ఇవ్వడం లేదని ఆకాశ్ అంబానీ అన్నారు. ఒక్కో జీబీకి జియో వసూలు చేస్తున్న ధర చాలా తక్కువని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భారత్‌ను డిజిటల్ వైపునకు నడిపిస్తుండటంలో జియో కీలకపాత్ర పోషిస్తున్నదని గుర్తుచేశారు. అలాగే 2030-31నాటికి 1.4 ట్రిలియన్ డాలర్ల భారత డిజిటల్ ఎకానమీ లక్ష్యంలో జియోదే మెజారిటీ వాటా అని కూడా చెప్పారు. ప్రస్తుతం జియో.. దేశీయ వైర్లెస్ డాటా రద్దీలో 60 శాతానికిపైగా కలిగి ఉన్నదని, ఈ ఏడాది జూన్ చివరికల్లా 53.3 కోట్ల కస్టమర్లున్నారన్నారు. ఇందులో 28.5 కోట్ల మంది 5జీ వినియోగదారులని పేర్కొన్నారు. చైనా తర్వాత భారత్‌లోనే 5జీ కస్టమర్లు ఎక్కువని చెప్పారు. ఈ ఏప్రిల్-జూన్‌లో ఒక్కో కస్టమర్ నెలవారీ సగటు డాటా వినియోగం 43.7 జీబీ ఉన్నదని వివరించారు.
సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లతో 6జీ
జియో ప్లాట్‌ఫామ్స్.. కొత్తగా మళ్లీ మౌలిక వసతుల విస్తరణతో కాకుండా కేవలం సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లతోనే తమ కస్టమర్లకు 6జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆకాశ్ అంబానీ తెలిపారు. అలాగే 4 కోట్ల నుంచి 10 కోట్లకు హోమ్ బ్రాడ్‌బాండ్ కస్టమర్లను పెంచే దిశగా పరుగులు పెడుతున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా జియోకు బలమైన నెట్వర్క్ ఉన్నదన్న ఆయన.. 3.6 లక్షల టెలికాం టవర్లు, 10 లక్షలకుపైగా కిలోమీటర్ల రూట్లో ఫైబర్ నెట్వర్క్ ఉన్నదని చెప్పారు.
జియో.. అలా పుట్టింది

Isha Ambani
భారతీయ టెలికాం చరిత్రలో రిలయన్స్ జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. దేశీయ టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో డాటా ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ జియో ఆలోచన.. అసలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ముకేశ్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ ఆ వివరాలను గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలియజేసింది. ఆమె మాటల్లోనే.. ‘అది 2009-2010 అనుకుంటాను. ఆకాశ్ నేను విదేశాల్లోని ఓ కాలేజీలో చదువుకుంటున్నాం. సెలవుల్లో భాగంగా బాంబేకు వచ్చాం. అయితే ఆన్లైన్లో ఓ అసైన్మెంట్ను సమర్పించాల్సి ఉన్నది. ప్రయత్నించాను.. కానీ దురదృష్టవశాత్తు ఇంటర్నెట్ పనిచేయలేదు. దాంతో అసైన్మెంట్ను సమర్పించలేకపోయాను. అప్పుడనిపించింది పశ్చిమ దేశాల్లో సులభంగానే అందరికీ లభిస్తున్న ఇంటర్నెట్.. మన దేశంలో ఎందుకు దొరకడం లేదని. అప్పుడు ఓ డిజిటల్ టెక్నాలజీ కంపెనీని తీసుకురావడమే దీనికి సమాధానమని ఆకాశ్ బలంగా నమ్మాడు. అలా.. 2016లో జియో ఆవిర్భవించింది. అలాఅలా పదేండ్లు గడిచిపోయాయి.’ అన్నారు. ఈ మీడియా సమావేశంలో కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చైర్మన్ ఉదయ్ కొటక్ కూడా పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

