ముందే వచ్చిన దీపావళి
వరుస లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి శోభ సంతరించుకున్నది. మదుపర్ల ముఖాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
- వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 2009 పాయింట్లు అప్
- 576 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ
- ఒక్కరోజే పెరిగిన రూ.8.28 లక్షల కోట్ల మదుపర్ల సంపద
- ట్రంప్ ఓటమితో ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహం
- గల్ఫ్ వార్ ముగిసి, ముడి చమురు ధరలు తగ్గవచ్చన్న అంచనాలు
ముంబయి, నవంబర్ 5: వరుస లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి శోభ సంతరించుకున్నది. మదుపర్ల ముఖాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురైన ప్రతికూల ఫలితాల తర్వాత పశ్చిమాసియా ఘర్షణలకు పరిష్కారం దొరుకవచ్చన్న ఆశలు, ముడిచమురు ధరలు తగ్గుతాయన్న అంచనాల నేపథ్యంలో గురువారం ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగారు. దీంతో సూచీలు పరుగులు పెట్టాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,009 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 576 పాయింట్లు ఎగబాకాయి. విదేశీ నిధుల నిరంతర ప్రవాహం, గ్లోబల్ మార్కెట్లలో భారీ ర్యాలీతోనూ పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెరుగుపడింది. అన్ని రంగాల్లో కొనుగోళ్లు పెరుగడంతో సెన్సెక్స్ 2,008.61 పాయింట్లు లేదా 2.60 శాతం పెరిగి 79,310.01 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2,168.63 పాయింట్లు లేదా 2.80 శాతం ఎగిసి 79,470.03కు చేరడం గమనార్హం. నిఫ్టీ 576 పాయింట్లు లేదా 2.40 శాతం వృద్ధి చెంది 24,536.60 వద్ద ముగిసింది. ఈ క్రమంలోనే మూడు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది.
షేర్ల వారీగా..
సెన్సెక్స్ నమోదిత కంపెనీల్లో బజాజ్ ఫైనాన్స్ 7.77 శాతం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 5.80 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 5.29 శాతం, మారుతి 5.28 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 5.15 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 4.66 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక గత ఆరు వరుస సెషన్లలో సెన్సెక్స్ 6,063.98 పాయింట్లు లేదా 8.27 శాతం, నిఫ్టీ 1,837.75 పాయింట్లు లేదా 8 శాతం పెరిగాయి. రంగాల వారీగా.. ఆటో 4.13 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.77 శాతం, ప్రైవేట్ బ్యాంకులు 3.64 శాతం, రియల్టీ 3.37 శాతం, ప్రభుత్వ బ్యాంకులు 3.15 శాతం, మిడ్‌స్మాల్ ప్రైవేట్ బ్యాంక్స్ 3.05 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.77 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సెలెక్ట్ సూచీ 1.79 శాతం పెరుగగా, స్మాల్ క్యాప్ సెలెక్ట్ సూచీ 0.22 శాతం లాభపడింది.
అంతర్జాతీయంగా..
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అయితే చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. ఇక యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అమెరికా ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి.
తొలిసారి రూ.500 లక్షల కోట్లకు..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో ముగుస్తుండటంతో మదుపర్ల సంపద భారీగా పెరుగుతున్నది. గత 6 రోజుల్లో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఏకంగా దాదాపు రూ.28 లక్షల కోట్లు ఎగబాకింది. గురువారం ఒక్కరోజే రూ.8.28 లక్షల కోట్లు పుంజుకోవడం గమనార్హం. కాగా, అక్టోబర్ 28న రూ.4,73,53,878.83 కోట్లుగా ఉన్న బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ వాల్యూ.. నవంబర్ 5న రూ.5,02,69, 871.22 కోట్లకు చేరినట్టు ఎక్సేంజ్ వర్గాలు తెలిపాయి. తొలిసారి రూ. 500 లక్షల కోట్లను దాటింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

