ఉల్లితో ఘాటెక్కిన ధరలు.. గత నెలలో రెండేండ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది. గత నెలలో ఏకంగా రెండేండ్ల గరిష్ఠాన్ని తాకింది. సెప్టెంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ప్రధాన ద్రవ్యోల్బణం 5.54 శాతానికి ఎగబాకింది. ఆహారోత్పత్తుల ధరలు, ముఖ్యంగా ఉల్లిగడ్డ రేటు ఎగదోసింది.
- సెప్టెంబర్‌లో 5.54 శాతంగా రిటైల్ ధరల సూచీ
- 7.74 శాతానికి ఎగిసిన ఆహార ద్రవ్యోల్బణం
- అధిక రేట్లున్న టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 12 : రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది. గత నెలలో ఏకంగా రెండేండ్ల గరిష్ఠాన్ని తాకింది. సెప్టెంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ప్రధాన ద్రవ్యోల్బణం 5.54 శాతానికి ఎగబాకింది. ఆహారోత్పత్తుల ధరలు, ముఖ్యంగా ఉల్లిగడ్డ రేటు ఎగదోసింది. ఈసారి ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతంగా నమోదైనట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం విడుదల చేసిన డాటాలో తెలిపింది. అంతకుముందు నెల ఆగస్టులో ఇది 5.97 శాతంగానే ఉన్నట్టు పేర్కొన్నది. అలాగే నాడు రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతంగా ఉన్నదని ఎన్ఎస్వో ఈ సందర్భంగా వివరించింది. ఇక తాజా గణాంకాలు 2024 అక్టోబర్ తర్వాత అత్యధికం కావడం గమనార్హం. అప్పుడు 6.21 శాతంగా నమోదైయ్యాయి. మళ్లీ ఆ స్థాయిలో నమోదైంది ఇప్పుడే. కాగా, 2024 బేస్ ఇయర్‌తో ఈ ఏడాది జనవరి నుంచి ఈ అఖిల భారత వినియోగదారుల ధరల సూచీని లెక్కిస్తుండగా.. కొత్త సిరీస్‌లో గత నెలలోనే ద్రవ్యోల్బణం గణాంకాలు గరిష్ఠంగా నమోదయ్యాయి.
మున్ముందు మరింత పైకి..
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో ఏర్పడిన పశ్చిమాసియా సంక్షోభం, ఎల్ నినో కారణంగా తలెత్తిన వర్షాభావ పరిస్థితులు.. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం గణాంకాలను మరింత ఎగదోసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని మెజారిటీ వ్యవసాయ ఆధారిత రాష్ర్టాల్లో సాగునీరు కొరత పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న సంగతి విదితమే. ఈసారి మార్కెట్‌కు డిమాండ్‌కు తగ్గ ఆహారోత్పత్తుల సరఫరా ఉండబోదని తెలుస్తున్నది. ఇదే జరిగితే ధరలు ఇంకా భగ్గుమనడం ఖాయమని అంటున్నారంతా. మరోవైపు దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అయితే గల్ఫ్ వార్, హొర్ముజ్ జలసంధిలో రవాణాకు అడ్డంకులు.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఫలితంగా భారతీయ మార్కెట్లోనూ పెట్రోల్, డీజిల్ రేట్లు గరిష్ఠ స్థాయిల్లో లేదా మరింత పెరిగేలా ఉన్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. భారమయ్యే రవాణా చార్జీలను ఉత్పత్తిదారులు, వ్యాపారులు చివరికి వినియోగదారులపైనే వేస్తారంటూ ద్రవ్యోల్బణం విజృంభణ సంకేతాలనిస్తున్నారు.
ధరల్లో తెలంగాణే టాప్
దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పరుగులు పెడుతున్నాయి. అధిక ధరలతో సామాన్య, మధ్యతరగతి వర్గాల వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత నెలలో 6.64 శాతంగా నమోదైంది. అంతకుముందు రెండు నెలలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ సెప్టెంబర్‌లో పెరిగింది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా ఇదే గరిష్ఠ స్థాయి. కాగా, ఆహారోత్పత్తుల ధరలు మండిపోతున్నాయి. వంటింటి బడ్జెట్ తలకిందులయ్యేలా.. కూరగాయల రేట్లు కిలో రూ.60-120 స్థాయిలో పలుకుతున్నాయి. ఇక పప్పు ధాన్యాలు, వంట నూనెలు, తదితరాల రేట్లు సరేసరి. మొత్తానికి ధరల అదుపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయిప్పుడు.
‘వడ్డి’ంపులు ఆగవ్
ద్రవ్యోల్బణం పోకడను చూస్తుంటే.. రాబోయే ద్రవ్య సమీక్షల్లోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు కీలక వడ్డీరేట్ల తగ్గింపునకున్న అవకాశాలను దూరం చేసేలా ఉన్నది. ధరలకు కళ్లెం వేసేందుకు ఇటీవలి ద్రవ్య సమీక్షలో రెపోరేటును ఆర్బీఐ దాదాపు నాలుగేండ్ల తర్వాత పావు శాతం పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్, ఫిబ్రవరి ద్రవ్య సమీక్షల్లోనూ మరో పావు శాతం చొప్పున పెంచేందుకే వీలున్నదని ఆర్థిక నిపుణుల అంచనా. దీంతో రెపోరేటు (ప్రస్తుతం 5.50 శాతం) 6 శాతానికి చేరనుండగా.. బ్యాంకులూ ఆ మేరకు రుణాలపై తమ వడ్డీరేట్లను పెంచనున్నాయి. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాల ఈఎంఐలు పెరిగి.. ఆయా రంగాల్లో అమ్మకాలు పడిపోయే వీలుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా నమోదు కావచ్చని ఆర్బీఐ అంచనా వేస్తున్నది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండగా.. మరో 2 శాతం అప్పర్ లిమిట్ పెట్టింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్బణం 6 శాతం దాటకూడదన్నది లక్ష్యం. ఇప్పటికైతే దీనికి దిగువనే ఉన్నప్పటికీ.. ఆ లక్ష్యానికి ద్రవ్యోల్బణ గణాంకాలు సమీపిస్తుండటం అటు ఆర్బీఐని, ఇటు మోదీ సర్కార్‌ను కలవరపెడుతున్నది.

- సెప్టెంబర్‌లో వినియోగదారులను ఠారెత్తించిన ఉల్లిగడ్డ (108.09 శాతం), వెండి నగలు (87.80 శాతం), అల్లం (62.85 శాతం), వెల్లుల్లి (54.62 శాతం), నిమ్మకాయ (36.41 శాతం)ల ధరలు.
- గత నెలలో తక్కువగానే ఆలుగడ్డ, టమాట, మోటార్ కార్లు-జీపులు, బెండకాయలు, కొబ్బరికాయల రేట్లు.
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేట్లు వరుసగా 6.08 శాతం, 4.88 శాతంగా నమోదు.
- దేశవ్యాప్తంగా అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉన్న టాప్-5 రాష్ర్టాల్లో తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా మిజోరామ్ ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

