సురక్షిత పెట్టుబడులను, నిర్దిష్ట మొత్తాల్లో ఆదాయాన్ని ఆశించే మదుపర్ల కోసం పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అందుబాటులో ఉన్నది. తపాలా శాఖ ద్వారా ఈ స్కీమ్‌కు సంబంధించిన ఖాతాను నిర్వహించవచ్చు. ఆకర్షణీయ వడ్డీరేటుతో ఆదాయాన్ని అందుకోవచ్చు.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్
ఇది కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకం. మార్కెట్ ఆధారిత రిస్క్‌లకు దూరంగా నెలనెలా నిర్దిష్ట మొత్తాల్లో ఆదాయం కోసం చూసే మదుపర్లనుద్దేశించి రూపొందించినదే ఈ స్కీమ్. రిటైర్మెంట్ అయినవారు, స్థిరమైన రాబడులను ఆశించే సురక్షిత పెట్టుబడిదారులకు దీన్నో మంచి మదుపు వేదికగా చెప్పవచ్చు.
పెట్టుబడి పరిమితి.. వడ్డీరేటు
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. సింగిల్ అకౌంట్లో గరిష్ఠంగా రూ.9 లక్షలదాకా, జాయింట్ అకౌంట్లో గరిష్ఠంగా రూ.15 లక్షలదాకా పెట్టుబడి పెట్టుకోవచ్చు. కనిష్ఠంగా రూ.1,000 మదుపు చేసుకోవచ్చు. అయితే ఎంతైనా ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ స్కీమ్‌లో వార్షిక వడ్డీరేటు 7.4 శాతంగా ఉన్నది. 3 నెలలకోసారి వడ్డీరేట్లను ప్రభుత్వం సవరిస్తుంది.
నెలనెలా రూ.9,250
జాయింట్ పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో 5 ఏండ్లకుగాను రూ.15 లక్షలు పెట్టుబడిగా పెడితే.. ఇప్పుడున్న 7.4 శాతం వడ్డీరేటుతో నెలనెలా మదుపర్లకు రూ.9,250 అందుతుంది. మొత్తం 5 ఏండ్లలో రూ.5.55 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. సింగిల్ అకౌంట్లో రూ.9 లక్షలకు మంత్లీ ఇన్కమ్ రూ.5,550 వస్తుంది. మొత్తంగా రూ.3.33 లక్షలు ఇన్కమ్ వస్తుంది.
ముందస్తు ఉపసంహరణలపై..
ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో ఖాతా తెరిచి ఏడాదైతేగానీ ముందస్తు ఉపసంహరణలకు వీల్లేదు. ఒకవేళ ఏడాది, మూడేండ్ల మధ్య డిపాజిట్‌ను వెనుకకు తీసుకోవాలనుకుంటే.. సదరు మొత్తంలో 2 శాతాన్ని జరిమానాగా నష్టపోవాల్సి వస్తుంది. అలాగే మూడేండ్ల తర్వాత డిపాజిట్‌ను ఉపసంహరించుకుంటే 1 శాతం జరిమానా ఉంటుంది.
పన్నులు వర్తిస్తాయా?
డిపాజిటర్ వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబు ప్రకారం వడ్డీ ఆదాయంపై పన్నులు వర్తిస్తాయి. అయినప్పటికీ పోస్టాఫీస్ టీడీఎస్‌ను మినహాయించదు.