న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూసీ3 పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ధర రూ.1.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 3 కిలోవాట్ల ఫిక్స్డ్ బ్యాటరీతో తయారైన ఈ వాహనం సింగిల్ చార్జింగ్‌తో 145 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
80 శాతం వరకు బ్యాటరీ 2.40 గంటల్లో పూర్తి కానుండగా, మొత్తం చార్జింగ్ 4 గంటలు పట్టనున్నది. ఐదు అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్, బ్లూటూత్, నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్, 32 లీటర్ల కెపాసిటీ, స్మార్ట్ కీ, ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్కూటర్‌ను ముందస్తుగా రూ.5 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలని కంపెనీ వర్గాలు సూచించాయి.