న్యూఢిల్లీ, నవంబర్ 2: ద్విచక్ర వాహన విక్రయాల్లో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్ అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,007.04 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.682.28 కోట్ల కంటే ఇది 47.6 శాతం అధికం. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.9,158.23 కోట్ల నుంచి రూ.9,533.07 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది. గత త్రైమాసికంలో సంస్థ 14.16 లక్షల మోటార్‌సైకిళ్లను, స్కూటర్లను విక్రయించింది. అలాగే నిర్వహణ ఖర్చులు రూ.8,292.25 కోట్ల నుంచి రూ.8,385.5 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత పండుగ సీజన్లో వాహనాలకు డిమాండ్ పెరగడం కలిసొచ్చిందని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. ఇటీవల కాలంలో మార్కెట్లోకి విడుదల చేసిన ప్రీమియం ఉత్పత్తులకు కూడా కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నదన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు దేశీయ ఆటోమొబైల్ రంగంపై స్వల్పంగా ప్రభావం చూపనున్నాయని చెప్పారు.