న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఎగుమతిదారులు, పరిశ్రమ సంఘాలు.. పశ్చిమాది దేశాల నుంచి తగ్గుతున్న డిమాండ్పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో జరిగిన సమావేశంలో ఆర్థిక, ఆర్థికేతర సాయాన్ని కోరారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అయిన గోయల్.. దేశీయ ఎగుమతుల తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలకు పతనమైనా.. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక ప్రతికూల పరిస్థితులు భారతీయ ఎగుమతులకు అవరోధంగా నిలుస్తున్నాయని, దీంతో నష్టపోతున్నామని ఈ సందర్భంగా ఎక్స్‌పోర్టర్స్, ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన వెలిబుచ్చినట్టు తెలుస్తున్నది. రూపాయి పతనం దేశీయ ఎగుమతిదారులకు లాభిస్తే.. దిగుమతిదారులకు నష్టమన్న విషయం తెలిసిందే.
దేశీయ ఎగుమతులకు అతిపెద్ద మార్కైట్లెన అమెరికా, ఐరోపా దేశాల్లో మాంద్యం ఛాయలు కనిపిస్తుండటం ఇప్పుడు భారతీయ ఎగుమతిదారులను తీవ్రంగా కలవరపెడుతున్నది. వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం సైతం ఇదే అంటున్నారు. ఇప్పటికే గత నెల జూలైలో దేశీయ ఎగుమతులు 5 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 35.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య లోటు సైతం 31 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) మొద లు వాణిజ్య లోటు పెరుగుతూనే ఉండ గా.. ఏప్రిల్-జూలైలో ఇది 100 బిలియన్ డాలర్లను దాటేసింది. ఈ నేపథ్యంలో భారత్‌కు ప్రధాన ఎగుమతి మార్కైట్లెన అమెరికా, ఐరోపాలను మాం ద్యం పరిస్థితులు చుట్టుముడుతుండటం.. మున్ముం దు దేశ వాణిజ్య లోటును మరింత పెంచడం ఖాయమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. నవంబర్‌లో ఎగుమతులు ఇంకా పడిపోయే వీలుందంటున్నారు.
దేశీయ ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా ఆయా దేశాలతో డాలర్లకు బదులు రూపాయిల్లో వాణిజ్యాన్ని జరుపుకొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నిస్తున్నది. దీంతో రష్యా, శ్రీలంకలతో వాణిజ్యానికి ఇది కలిసొస్తుందన్న విశ్వాసం ట్రేడర్లలో వ్యక్తమవుతున్నది. మరోవైపు కొత్తగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాలతోనూ వాణిజ్యానికి ఒప్పందాలు జరగడాన్ని పరిశ్రమ స్వాగతిస్తున్నది. అమెరికా, ఐరోపాలతో వాణిజ్య లోటు ఈ రకంగా భర్తీ కాగలదన్న ఆశాభావాన్ని ఇండస్ట్రీ కనబరుస్తున్నది. ఇక టాప్-10 ఎగుమతుల్లో ఏడింటి వాటానే మొత్తం దేశ ఎగుమతుల్లో 80 శాతానికి సమానం కావడం గమనార్హం. వీటిలో ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు-ఆభరణాలు, ఔషధాలు, రెడిమేడ్ దుస్తులు, నూలు దారం, ప్లాస్టిక్ ఉన్నాయి.