న్యూఢిల్లీ, మే 28: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.173 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.234 కోట్ల లాభంతో పోలిస్తే 26 శాతం తగ్గినట్లు పేర్కొంది.
కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.2,860 కోట్ల నుంచి రూ.3,019 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.2.5 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారస్ చేసింది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా శనివారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. 2021-22 ఏడాదికిగాను రూ.12,305 కోట్ల ఆదాయంపై రూ.994 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది.