Foreign Exchange | ముంబై, జూలై 21: గత కొన్ని వారాలుగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 12.743 బిలియన్ డాలర్లు పెరిగి 609.022 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లోకి భారీగా నిధులు కుమ్మరించడం వల్లనే రిజర్వులు భారీగా పెరిగాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 1.23 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 2021లో విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం విధితమే. ఈ ఏడాది జనవరిలో ఒకేవారంలో 10 బిలియన్ డాలర్లు పెరిగాయి. మళ్లీ ఇప్పుడే అంతకంటే ఎక్కువగా పెరగడం ఇదే తొలిసారి. గతవారం విషయానికి వస్తే విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 11.198 బిలియన్ డాలర్లు పెరిగి 540.166 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అలాగే పసిడి రిజర్వులు 1.137 బిలియన్ డాలర్లు అధికమై 45,197 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.