హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి వివిధ ఉత్పత్తుల ఎగుమతులకు ది ఎక్స్పోర్ట్ గైడెన్స్ అండ్ గ్లోబల్ డేటాబేస్ సెంటర్ (ఈజీడీసీ) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఎగుమతిదారులకు అవసరమైన సమాచారాన్ని, సహకారాన్ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఎగుమతులకు గల అవకాశాలను తెలుసుకునేందుకు ఈజీడీసీని లేదా దాని అధికారిక వెబ్‌సైట్‌ను ఔత్సాహికులు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈజీడీసీ.. రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశమున్న ఉత్పత్తుల గుర్తింపు, భారత విదేశీ ఎగుమతుల విధానం, విదేశీ వాణిజ్య ఒప్పందాలు, ఎగుమతిదారులకు కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వివిధ రాష్ర్టాలు అమలు చేస్తున్న ఎగుమతి విధానాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాజిస్టిక్స్, ఎయిర్‌కార్గో కాంప్లెక్స్‌లు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాకేజింగ్ యూనిట్లు, గిడ్డంగులు, పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్, ఎగుమతులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు-కంటైనర్ టెర్మినళ్లు, ఎయిర్‌పోర్టులు తదితర సమాచారాన్ని అందిస్తుంది.
అంతేగాక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్‌తో సమన్వయం, ప్రభుత్వ శాఖలు/ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అవసరమైన సహకారం, మార్కెట్ వ్యూహాలనూ ఈ కేంద్రం అందిస్తుంది. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న టాప్-10 ఉత్పత్తుల్లో ఇంజినీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, ముత్యాలు-వజ్రాభరణాలు, కెమికల్స్, ఔషధాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్ర్తాలు-చేనేత ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్ ఉత్పత్తులున్నాయి. అమెరికా, చైనా, యుఏఈ, హాంకాంగ్, బంగ్లాదేశ్, సింగపూర్, బ్రిటన్, జర్మనీ, నేపాల్, నెదర్లాండ్స్ తదితర దేశాలు మన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న టాప్-10 దేశాలు. ఇక ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, ముత్యాలు-వజ్రాభరణాలు, కెమికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటం విశేషం.