Debit Card | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నారు. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు, ఏటీఎం మిషన్ల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి జారీ చేసిన డెబిట్ కార్డుతో పలు ఉపయోగాలున్నాయి. ఆన్ లైన్ లావాదేవీలు చేసినా, ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించినా డెబిట్ కార్డు కావాలి. ఈ డెబిట్ కార్డును మరింత సమర్థవంతంగా వాడుకోవడానికి కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే డెబిట్ కార్డుతో లభించే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుకోవచ్చు.
బ్యాంకు పొదుపు ఖాతాకు అనుసంధానమై ఉన్న డెబిట్ కార్డు.. క్యాష్కు ఎలక్ట్రానిక్ రూపం. వ్యాపార సంస్థలు, ఆన్ లైన్ లో కొనుగోళ్లు జరిపినప్పుడు పేమెంట్ చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తుందీ డెబిట్ కార్డు.
క్రెడిట్ కార్డులకు భిన్నంగా డెబిట్ కార్డులు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాతో అనుసంధానమై ఉంటాయి. డెబిట్ కార్డుతో మీ సేవింగ్స్ ఖాతాలో ఉన్న మొత్తం వరకు మాత్రమే వాడుకునేందుకు అనుమతి ఉంటుంది. క్రెడిట్ కార్డు కలిగి ఉండటం సంబంధిత బ్యాంకు ఖాతాదారులకు కల్పించే తాత్కాలిక లోన్ ఫెసిలిటీ అన్నమాట. కొనుగోలు శక్తిని పెంచడానికి క్రెడిట్ కార్డులు దోహద పడతాయి. వీటిని జాగ్రత్తగా వాడుకోవడంతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు, రాయితీలు లభిస్తాయి.
డెబిట్ కార్డులతో నగదు విత్ డ్రాయల్స్‌కు, కొనుగోళ్లకూ పరిమితులు ఉంటాయి. ఫ్రాడ్, సైబర్ మోసగాళ్ల నుంచి, మోసపూరిత ట్రాన్సాక్షన్స్ నుంచి కస్టమర్లకు రక్షణ సౌకర్యం కల్పిస్తాయి. కనుక వ్యాపార సంస్థల వద్ద కొనుగోళ్లు, ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా సమయంలో అసౌకర్యానికి గురి కాకుండా ముందుగానే ఈ లిమిట్స్ గురించి తెలుసుకోవాలి.
డెబిట్ కార్డుతో సంబంధిత బ్యాంకు ఏటీఎం కేంద్రం నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. సొంత బ్యాంకు ఏటీఎం వాడకానికి పరిమితులు ఉన్నాయి. ఆ లిమిట్ దాటితే చార్జీ పే చేయాలి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రాయల్స్ మీద రూల్స్‌కు అనుగుణంగా చార్జీ వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ రూల్స్ గురించి పూర్తిగా తెలుసుకుని అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే నష్టపోతాం. కొన్ని ప్రత్యేక డెబిట్ కార్డులు ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు కల్పిస్తాయి. ఖాతాలో క్యాష్ లేకపోయినా కొన్ని ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయడానికి పర్మిట్ చేస్తాయి. ఇలాంటి కార్డులపై వసూలు చేసే చార్జీలు, వడ్డీరేట్లపై పూర్తి సమాచారం ముందుగానే తెలుసుకోవాలి.
అనధికారిక/ మోసపూరిత కొనుగోళ్లు గుర్తించడానికి అనునిత్యం మీ అకౌంట్ వివరాలు చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్యాంకు నుంచి వచ్చే ఎస్ఎంఎస్లు కూడా చూసుకోవాలి. మీరు నిర్వహించని లావాదేవీల గురించి, వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి.
విదేశాలకు వెళ్లడానికి ముందు మీ విదేశీ యానం గురించి బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆయా దేశాల్లో మీ డెబిట్ కార్డు వాడకానికి అనుమతి ఉందా?. లేదా.. అనే సంగతి తెలసుకోవాలి. మామూలుగా అంతర్జాతీయ సేవలను బ్యాంకులు డిఫాల్ట్ గా నిలిపేస్తాయి. మోసాల నివారణకు ఈ జాగ్రత్తలు తీసుకుంటాయి బ్యాంకులు. ఖాతాదారులుచెబితేనే వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తాయి. బ్యాంక్ ఆన్ లైన్, మొబైల్ యాప్‌లోనూ దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి.
డెబిట్ కార్డు వివరాలు చాలా సీక్రేట్‌గా ఉంచుకోవాలి. కార్డు వివరాలు, ఏటీఎం పిన్ నంబర్ వివరాలు బయటపెట్టొద్దు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాల వద్ద మీ పిన్ ఎంటర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కార్డు వివరాల తస్కరణకు కాచుక్కూచున్న స్కిమ్మింగ్ పరికరాలు, వెబ్ సైట్ల పట్ల అలర్ట్ గా ఉండాలని బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.