EPFO Glitches | ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వెబ్సైట్లో సాంకేతిక లోపాలు కొనసాగుతున్నాయి. యూజర్లు వెబ్సైట్లోకి వెళ్లడానికి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తున్నది. అయితే రెండు రోజుల్లో వెబ్సైట్ మాడ్యూల్ సరి చేస్తామని కార్మికశాఖ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఈపీఎఫ్‌వోలో ఈ-నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. వారు ఈ-నామినేషన్ ప్రక్రియ చేపట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా ఎర్రర్ మెసేజ్‌లు యూజర్లకు స్వాగతం పలుకుతున్నాయి.
ఈపీఎఫ్‌వో ట్విట్టర్ హ్యాండిల్‌కు ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. నెలల తరబడి ప్రయత్నిస్తున్నా ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడం లేదని పలువురు యూజర్లు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. యూజర్ల ఫిర్యాదులపై స్పందించిన ఈపీఎఫ్‌వో.. తన ట్విట్టర్ హ్యాండిల్‌పై సమాధానమిచ్చింది. ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్ చేయడంతోపాటు.. తమతో యూజర్లు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ అంశాన్ని సంస్థ ఐటీ డెస్క్ దృష్టికి తీసుకెళ్తామని ట్వీట్ చేసింది.