Education Loan | దేశీయ విద్యా సంస్థల కంటే విదేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్ కోర్సులు చదవాలని భారతీయ విద్యార్థులు కల కంటుంటారు. ఈ కల కొంచెం ఖర్చుతో కూడిందైనా బ్యాంకులు విదేశీ విద్యాభ్యాసానికి లోన్లు ఇస్తుంటాయి. విదేశాల్లో తమ పిల్లల విద్యాభ్యాసం కోసం పేరెంట్స్ కొంత సొమ్ము దాచి పెడతారు. ఆ పెట్టుబడులతోపాటు బ్యాంకు రుణాలు తీసుకుని పిల్లలకు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, తీసుకున్న విద్యా రుణం త్వరితగతిన చెల్లించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటో ఓ లుక్కేద్దాం..
గతంతో పోలిస్తే ప్రస్తుతం విదేశీ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులు గణనీయంగా పెరిగారు. మున్ముందు విదేశాల్లో ఉన్నత విద్యా కోర్సుల ఖర్చు తడిసిమోపెడయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి భారతీయ విద్యార్థులు 28 బిలియన్ల డాలర్ల మేర ఇప్పుడు ఖర్చు చేస్తున్నారు. వచ్చే రెండేండ్లలో అది 80 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఉన్నత విద్యా కోర్సుల్లో చదవడానికి విదేశీ యూనివర్సిటీలు, సంస్థల్లో చేరిన వారికి కొన్ని స్కాలర్షిప్లు వస్తున్నాయి. ప్రభుత్వాలు.. కొన్ని దాతృత్వ సంస్థలు గ్రాంట్లు, స్కాలర్‌షిప్‌ల రూపేణా చేయూతనిస్తాయి. కానీ చాలా మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్లు పొందడానికి అనర్హులు. కనుక కొన్ని సందర్భాల్లో వారంతా బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం తప్పనిసరిగా మారుతున్నది.
దేశంలో గానీ, విదేశాల్లో గానీ ప్రొఫెషనల్, హయ్యర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు తగిన ఆర్థిక సాయం అందించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఆర్బీఐతో కలిసి కేంద్ర ప్రభుత్వం సమగ్ర రుణ పథకం రూపొందించింది. తద్వారా కళాశాల, హాస్టల్, పరీక్ష, ల్యాబొరేటరీ ఫీజు, పుస్తకాల ఖర్చు , పరికరాలు, కాషన్ డిపాజిట్లతో పాటు అనుమతించిన మేరకు బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్ తదితర అవసరాలకు రుణం తీసుకోవచ్చు .
దేశీయ విద్యా సంస్థల్లో మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ తీసుకున్న వారికి ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకుతోపాటు కొన్ని బ్యాంకులు విద్యా రుణాలిస్తున్నాయి. అయితే, క్యాపిటేషన్ ఫీజు, డొనేషన్ ఖర్చు చెల్లించడానికి మాత్రం రుణాలివ్వవు బ్యాంకులు. ఇప్పుడైతే క్రెడిట్ గ్యారంటీ నిధుల కింద ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.7.50 లక్షల వరకు లోన్ పొందొచ్చు. త్వరలోనే ఈ లిమిట్‌ను రూ.10 లక్షలకు పెంచే యోచనలో ఉన్నారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంపిక చేసిన కళాశాలలు, విద్యా సంస్థల్లో చేరే విద్యార్థులకు రూ.40 నుంచి 50 లక్షల వరకు గ్యారంటీ లేకుండానే రుణాలు ఇస్తున్నాయి.
దేశీయ, విదేశీ విద్యా సంస్థల్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకునేవారు తమ విద్యాభ్యాసం సర్టిఫికెట్లు, ప్రవేశ పరీక్ష ఫలితాలు, అడ్మిషన్ లెటర్, విదేశాల్లో చదువుకోవాలంటే ‘ఐ 20’, కాలేజీ నుంచి వచ్చిన ఫీజు వివరాలు సమర్పించాలి. బ్యాంకు ఖాతా గల శాఖలో కేవైసీ పత్రాలు అప్డేట్ చేసుకోవాలి. కో-అప్లికెంట్, గ్యారంటర్ కూడా కేవైసీ సబ్మిట్ చేయాలి. విద్యార్థుల పాన్ కార్డు కూడా సమర్పించాలి. ఆ విద్యార్థులు మైనర్లైనా సరే పాన్ కార్డు తప్పనిసరి. గ్యారంటర్ ఆదాయం పన్ను రిటర్న్స్‌కు సంబంధించిన పత్రాలు, ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం వర్తించేవారికి ఆధార్ సమర్పించాల్సి ఉంటుంది.
కొన్ని సార్లు.. బ్యాంకుకు సమర్పించిన పత్రాల ఆధారంగా ఎడ్యుకేషన్ లోన్ రాకపోవచ్చు. ఈ సందర్భాల్లో తాకట్టు రుణాల కోసం ప్రయత్నించాలి. గ్యారంటీగా చూపే ఆస్తి మార్కెట్ వలువ, రుణం చెల్లింపు గడువును బట్టి రుణం మొత్తం ఆధార పడి ఉంటుంది. విద్యా రుణంతో పోలిస్తే తాకట్టు లోన్ సేఫ్టీ కనుక తక్కువ ఇంటరెస్ట్ రేట్‌పై ఎక్కువ లోన్ తీసుకోవచ్చు.
ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వారు దాని చెల్లింపు విషయంలోనూ డిసిప్లిన్‌గా ఉండాలి. లోన్ ఆఫర్ లెటర్లో ఎంత రుణం వస్తుందో చెబుతుంది. పంపిణీ చేసిన రుణం మీద మాత్రమే వడ్డీ వసూలు చేస్తుంది. కనుక ఫీజు చెల్లించాలనుకున్నప్పుడే రుణం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ఎడ్యుకేషన్ పూర్తయి ఉద్యోగం రాగానే రుణం తిరిగి చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదనపు నగదు, బోనస్ వంటి వాటిని కూడా రుణ బకాయిలు చెల్లించడానికి ఉపయోగించాలి.
సకాలంలో లోన్ చెల్లించకపోతే గ్యారంటర్లకు బ్యాంకులు నోటీసులు ఇస్తాయి. అదే జరిగితే క్రెడిట్ స్కోర్ తగ్గిపోయి ఫ్యూచర్లో లోన్లు రావడం కష్టంగా మారుతుంది. బ్యాంకులు తమ లోన్ వసూలు చేసుకోవడానికి రుణ గ్రహీతలపై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి ముందుకు రావచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80ఈ సెక్షన్ ప్రకారం రుణంపై వడ్డీ చెల్లింపునకు గరిష్టంగా ఎనిమిదేండ్ల పాటు మినహాయింపు ఇస్తారు. .
కనుక లోన్ తీసుకోవాలనుకునే ముందు సరైన రీసెర్చ్ చేయాలి. సెలెక్టెడ్ కోర్సు, దానికి అయ్యే ఖర్చు, ఇతర ఖర్చులు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రముఖ యూనివర్సిటీల్లో చేరే వారికి తేలిగ్గానే రుణాలు లభిస్తాయి. విస్తృత పరిశోధనలు జరిపాకే రుణాలు తీసుకోవాలి. కనుక మీరు ఎంత వరకు రుణానికి అర్హులో చెక్ చేసుకోవాలని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. సరిగ్గా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. బ్లాక్ లిస్ట్‌ల్లో ఉన్న కాలేజీల్లో చేరే వారికి రుణాలు లభించవు.