BOB | న్యూఢిల్లీ, మార్చి 7: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)..అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30లోగా బీవోబీ మహిళా శక్తి సేవింగ్స్ అకౌంట్ లేదా బీవోబీ వుమెన్ పవర్ కరెంట్ అకౌంట్ తీసుకున్నవారికి ఈ ఆఫర్లు వర్తించనున్నది.
అలాగే డిసెంబర్ 31, 2024 వరకు రుణాలు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. వీరు తీసుకునే రుణాలపై 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రాయితీ కల్పిస్తున్నది బ్యాంక్. వీటిలో ద్విచక్ర వాహన రుణాలపై పావు శాతం, విద్యా రుణాలపై 0.15 శాతం, వాహన రుణాలపై 10 బేసిస్ పాయింట్లు, గృహ, మార్ట్గేజ్ రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తున్నది. అలాగే రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను బ్యాంక్ ఎత్తివేసింది. లాకర్ల చార్జీలపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నది.