హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): టీ-హబ్, అపోలో టైర్స్ జట్టు కట్టాయి. ఇరు సంస్థలు కలిసి ఓపెన్ ఇన్నోవేషన్‌పై పనిచేయనున్నాయి. అపోలో టైర్స్ నాయకత్వం ఇటీవల టీ-హబ్‌ను సందర్శించిందని, ఇక్కడి స్టార్టప్ కార్యకలాపాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసిందని టీ-హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. ఈ క్రమంలోనే స్టార్టప్‌లకు తమ వంతు సాయం చేయడానికి కంపెనీ ముందుకు వచ్చిందన్నారు. కాగా, ఇప్పటికే టీ-హబ్‌లో అపోలో టైర్స్.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని సుమారు 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది.
టీ-హబ్ ల్యాబ్ 32కు కంపెనీల మద్దతు
స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ-హబ్ ఏర్పాటుచేసిన ల్యాబ్ 32 యాక్సిలరేటర్‌కు కంపెనీల నుంచి మద్దతు లభిస్తున్నది. కనీస ఆచరణీయ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న స్టార్టప్‌లకు అవసరమైన సీడ్ ఫండ్‌ను సమకూర్చడంతోపాటు మార్కెటింగ్, నెట్వర్కింగ్ కార్యకలాపాలకు వివిధ సంస్థలు దన్ను నిస్తున్నాయి. 10వ విడుత కార్యక్రమానికి టెల్ ఏబుల్, రెడ్ మ్యాటర్, డిజిటల్ ఫ్యాబ్రిక్ కంపెనీలు మద్దతు ప్రకటించాయని టీ-హబ్ ప్రతినిధి తెలిపారు.