మానవ శరీరానికి రక్షణ కవచం చర్మం. రక్తమాంసాలతో నిర్మితమైన శరీరాన్ని రక్షించడమే కాకుండా అందంగా కనిపించేలా వన్నె తెచ్చేదే చర్మం. అయితే శరీరంలోని ఇతర భాగాలకు వచ్చినట్లే చర్మానికి కూడా కొన్ని రకాల వ్యాధులు రావడం సహజం. అందులో కొన్ని చర్మవ్యాధులను వివిధ రకాల చికిత్సలతో శాశ్వతంగా నయం చేయగలం. కానీ, కొన్నిటిని మాత్రం శాశ్వతంగా నయం చేయలేం. ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధి మరింత విస్తరించకుండా నియంత్రించగలం. అలాంటి వాటిలో ఒకటి బొల్లి వ్యాధి. దీనినే వైద్య పరిభాషలో ‘విటిలిగో’ అంటారు.
విటిలిగో బాధితుల్లో చర్మంపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. అయితే చాలామంది ఇది అంటువ్యాధి అని భ్రమపడతారు. ఇది జీవితాంతం తగ్గదని, దీనివల్ల తమను ఎవరూ పెండ్లి చేసుకోరని.. మానసిక ఒత్తిడికి లోనవుతారు. కానీ, సకాలంలో చికిత్స అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అసలు ఈ బొల్లి వ్యాధి అంటే ఏంటి? ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధా…? వ్యాధి లక్షణాలు, వ్యాధికి గల కారణాలు, అందుబాటులో ఉన్న చికిత్స తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
మన చర్మానికి, వెంట్రుకలకు, కళ్లకు రంగును ఇచ్చే ‘మెలనోసైట్స్’ అనే కణాలు మెలనిన్ను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఈ కణాలపైనే దాడి చేస్తుంది. అంటే ఆటోఇమ్యూన్ వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి, చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 0.5 నుంచి 2 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాధారణంగా విటిలిగో నాలుగు రకాలు.

1. సెగ్మెంటల్ విటిలిగో
శరీరంలోని ఒక వైపు మాత్రమే మచ్చలు రావడాన్ని సెగ్మెంటల్ విటిలిగో అంటారు. ఇది చిన్న వయసులో ఎకువగా కనిపిస్తుంది.
2. నాన్ సెగ్మెంటల్ విటిలిగో
నాన్ సెగ్మెంటల్ విటిలిగో అనేది అత్యంత సాధారణ రూపం. శరీరానికి రెండు వైపులా సమానంగా మచ్చలు వస్తాయి.
3. ఫోకల్ విటిలిగో
ఫోకల్ విటిలిగో ఉన్నవారిలో సమస్య ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మాత్రమే పరిమిత మవుతుంది.
4. యూనివర్సల్ విటిలిగో
శరీరంలో ఎకువ భాగం రంగు కోల్పోయే అరుదైన పరిస్థితి. అంటే దాదాపు చర్మం మొత్తం తెల్లటి మచ్చ వ్యాపిస్తుంది.
విటిలిగో వ్యాధి రావడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. అనేక అంశాలు కలిసి ఈ వ్యాధికి దారితీస్తాయి. అందులో ప్రధాన కారణాలు..

విటిలిగో ప్రధాన లక్షణం చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడటం. శరీరంలోని ఈ కింది భాగాలపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.
విటిలిగో (బొల్లి వ్యాధి) అంటు వ్యాధి కాదు. అంటే ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. వ్యాధి ఉన్న వారితో చేతులు కలిపినంత మాత్రాన ఇతరులకు వ్యాధి రాదు. ఒకే పాత్రలో తిన్నా, కౌగిలించుకున్నా, రక్తం ద్వారా వ్యాపించదు. బొల్లి వ్యాధిని అంటు వ్యాధిగా భావించడం కేవలం అపోహ మాత్రమే.
విటిలిగో వల్ల శారీరకంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినా, మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రధానంగా
వివాహం కాకపోవడం, ఉద్యోగాల్లో వివక్ష వంటి మానసిక, సామాజిక సమస్యలకు గురవుతారు. అందుకని బొల్లి వ్యాధి బాధితులకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, వ్యాధి పట్ల సమాజంలో అవగాహన ఎంతో అవసరం.
ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధుల పరీక్షలు అందుబాటులో ఆధునిక చికిత్స విటిలిగోకు ప్రస్తుతం అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గతంలో స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు వాటిని తగ్గించి జాక్ ఇంజిబిటర్స్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించకుండా నియంత్రించవచ్చు. అయితే, ముఖంపైన మచ్చలు వస్తే సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకుంటే సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. అదే చేతులు, కాళ్లపై వస్తే ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అరికట్టవచ్చు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం 5 శాతం కంటే తక్కువ.
సూర్యరశ్మి నుంచి రక్షణ పొందేలా జాగ్రత్తపడాలి. తెల్ల మచ్చల ప్రాంతాల్లో మెలనిన్ లేకపోవడం వల్ల సన్బర్న్ వచ్చే ప్రమాదం ఎకువ. అందుకని ఎస్పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎకువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్రీన్ లోషన్ వాడటం మంచిది. టోపి, ఫుల్ హాండ్ షర్ట్స్ లాంటివి ధరించాలి. శరీరంపై కొత్తగా తెల్ల మచ్చలు కనిపించినా, మచ్చలు వేగంగా పెరుగుతున్నా, వెంట్రుకలు తెల్లబడినా, కుటుంబంలో విటిలిగో చరిత్ర ఉండి ఈ లక్షణాలు కనిపించిన వారు వెంటనే చర్మ వైద్యులను సంప్రదించడం ఉత్తమం. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.