ఒకే క్షేత్రంలో నాలుగైదు రకాల వాటర్ మెలన్ (పుచ్చకాయ) సాగు చేస్తూ, అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఓ రైతు. సీజన్‌కు తగ్గ పంటలు పండిస్తూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నాడు. ప్రస్తుత
వేసవిలో చేతికి వచ్చేలా పుచ్చకాయ తోట వేశాడు. స్థానిక రకాలతోపాటు తైవాన్‌కు చెందిన పలు వాటర్ మెలన్ రకాలను విజయవంతంగా పండిస్తున్నాడు. సమయం, డిమాండ్‌ను బట్టి పంటలు వేస్తే భారీగా లాభాలు పొందవచ్చని చెబుతున్నాడు కరీంనగర్ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన రైతు మంద తిరుపతి.
ఎల్లో వాటర్ మెలన్
తైవాన్ ఫార్ములాతో ‘నోనియో’ కంపెనీ ‘విశాల్ ఎఫ్1’ హైబ్రిడ్ పేరుతో మార్కెట్లోకి తెచ్చిన వాటర్ మెలన్ రకం ఇది. ఈ రకం కాయలు పసుపు రంగులో ఉంటాయి. ఒక్కోటి మూడు నుంచి ఐదు కిలోల దాకా బరువు పెరుగుతుంది. ఈ రకాన్ని 20 గుంటల్లో సాగు చేశాడు తిరుపతి. వరంగల్ నుంచి విత్తనాలు తెప్పించాడు. 75 రోజుల్లో కాతకు రాగా, 20 గుంటల్లో 8 టన్నుల దిగుబడి వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు రైతు తిరుపతి. ఇప్పటికే 2 టన్నుల దిగుబడి చేతికిరాగా, స్థానికులతోపాటు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులకు వీటిని టోకుగా అమ్ముతున్నాడు.
హ్యాప్పీ ఫ్యామిలీ!
తైవాన్‌కే చెందిన ఈ గింజలు లేని రకం పేరు హ్యాప్పీ ఫ్యామిలీ. ఎంతో రుచిగా ఉండే ఈ రకాన్ని తిరుపతి ఎకరంలో సాగు చేశాడు. 75 రోజుల్లోనే కాతకు వచ్చే హ్యాప్పీ ఫ్యామిలీ.. ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడిని ఇస్తుంది. హైదరాబాద్‌లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉండటంతో అక్కడికి తీసుకెళ్లి హోల్‌సేల్‌గా అమ్ముతున్నాడు. దీని విత్తనం ధర చాలా ఎక్కువ. వెయ్యి గింజలు ఉండే ప్యాకెట్‌కు రూ. 5,500 దాకా ఉంటుంది. అయినప్పటికీ ఏమాత్రం వెనకాడకుండా, ‘సింజెంట కంపెనీ’ సూచన మేరకు సాగు చేశాడు. తెలంగాణలో ఈ రకాన్ని సాగు చేసిన మొదటి రైతుగా తిరుపతి గుర్తింపు పొందాడు. కొంచెం రిస్క్ తీసుకుంటే ఈ రకం రైతును లాభాల బాట పట్టిస్తుందని చెబుతున్నాడు.
రుచికి మారుపేరు జన్నత్!
‘నోనియో’ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన మరో తైవాన్ రకం జన్నత్. ఇది చాలా రుచిగా ఉంటుంది. పంట కాలం 65 రోజులు మాత్రమే. 20 గుంటల్లో సాగు చేయగా, ఇప్పటికే మొదటి దిగుబడి అందుకున్నాడు. ఎకరానికి 15-20 టన్నుల దిగుబడి వస్తుందని, వాతావరణం అనుకూలిస్తే మరింత పెరుగుతుందని అంటున్నాడు. కాయ గుండ్రంగా ఉండి కొనుగోలుదారులను ఇట్టే ఆకట్టుకుంటుందనీ, ఈ రకానికి మంచి డిమాండ్ ఉందనీ చెబుతున్నాడు.
అనుగుణంగా పంటలు..
సీజన్‌కు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేయాలి. నేను ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తున్న మూడు రకాల తైవాన్ వాటర్ మెలన్ సాగు చేశాను. దిగుబడి బాగానే వచ్చింది. హ్యాప్పీ ఫ్యామిలీ అనే రకాన్ని తెలంగాణలో ఇప్పటివరకు ఎవరూ సాగు చేయలేదు. నేను సాహసించి, ఈ పంట వేశాను. అక్టోబర్, నవంబర్ నుంచి వీటిని సాగు చేసుకుంటే సరిగ్గా వేసవికి చేతికి వస్తాయి. తైవాన్ రకాలు కూడా మన నేలలకు అనుకూలంగా ఉన్నాయి. ప్రయత్నిస్తే ఎవ్వరైనా సరే మంచి లాభాలు సాధించవచ్చు.
మంద తిరుపతి, గోపాల్పూర్ రైతు
-దొంత వెంకటస్వామి