నిర్మల్‌కు కరువు ఎందుకొచ్చింది?
గోదావరి ఒర్సుకొని పారే నిర్మల్ జిల్లాలో తొమ్మిది మండలాలు కరువు మండలాలు ఎట్లయితయ్.
- గోదావరి ఒర్సుకొని పారే జిల్లాలో తొమ్మిది కరువు మండలాలు ఎట్లయితయ్..
- కాళేశ్వరం పంపులు ఆన్‌చేస్తే.. ఎస్సారెస్సీ నిండి సరస్వతీ కాలువతో కడెం, సదర్మాట్లకు నీళ్లు వచ్చేవి కాదా?
- కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను వాడుకోవడం చేతనైతలేదు ..
- బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపిస్తే ఏం లాభమొచ్చింది?
- నిర్మల్ ‘రైతు గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మంచిర్యాల, నవంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదావరి ఒర్సుకొని పారే నిర్మల్ జిల్లాలో తొమ్మిది మండలాలు కరువు మండలాలు ఎట్లయితయ్. అసలు నిర్మల్ జిల్లాకు కరువు ఎట్లా వస్తది. జిల్లాలో కడెం, సదర్మాట్, సుద్దవాగు, స్వర్ణ ఇన్నీ ప్రాజెక్టులు పెట్టుకొని, గోదావరి నదిని పక్కన పెట్టుకొని, పంపులు ఆన్‌చేస్తే నీళ్లు నిండే సౌలత్ పెట్టుకొని.. ఎందుకు వచ్చింది కరువు నిర్మల్ రైతులు ఆలోచించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ రైతు గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జూలైలోనే కాళేశ్వరం ఎత్తిపోయమని మేము అడిగితే పట్టించుకోలేదని.. ఆ నీళ్లు కనక ఎత్తిపోసి ఉంటే ఇవాళ ఎస్సారెస్పీలో నూరు టీఎంసీల నీరు ఉండేదని, అక్కడి నుంచి సరస్వతీ కెనాల్‌తో మీ సదర్మాట్ బ్యారేజీ, కడెం ప్రాజెక్టులకు బ్రహ్మాండంగా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. అందుకే నీను నిర్మల్ వేదికగా అడుగుతున్నా రేవంత్‌రెడ్డిని మన ఎస్సారెస్పీ ఎందుకు ఎండింది? ఆంధ్రా ప్రాజెక్టులు ఎందుకు నిండినయ్ సమాధానం చెప్పు. ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కడెం ప్రాజెక్టు కింద నీళ్లు బంద్ పెట్టడంతో పంటలు ఆగమైతున్నాయని రైతులు ధర్నాలు చేస్తున్నారని.. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్లోకి నీళ్లు లిఫ్ట్ చేస్తే.. ఇవాళ బ్రహ్మాండంగా నీళ్ల జాతర జరుగుతుండేదన్నారు.
రైతులు ఇబ్బందులు పడొద్దని కేసీఆర్ సదర్మాట్ బ్యారేజీ కడితే దాన్ని వాడుకోవడం కూడా ఈ కాంగ్రెస్ సన్నాసులకు చేతకావడం లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నేనే దిలావర్పూర్ మండలంలో 27వ ప్యాకేజీ కింద గుండ్లపల్లి లక్ష్మీనరసింహాస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించానని, కాళేశ్వరం నీళ్లకు ఎస్సారెస్పీకి తీసుకొచ్చే సౌలత్ ఏదైతే ఉందో.. దాన్ని వాడుకుంటే, రివర్స్ పంపింగ్ చేసి ఉంటే శ్రీరాంసాగర్ బ్రహ్మాండంగా నీళ్లతో కళకళలాడి, ఈ సరస్వతీ కాలువతో చిన్నచిన్న లింక్‌లు అన్నింటినీ నీళ్లు రాకపోతుండేనా రైతులు ఆలోచించాలన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగం

కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారని, రైతుల ఇంటి ముందు సాగు డప్పు మోగుతుందని కేటీఆర్ అన్నారు. పంటలు కొనరు, విత్తనాలు ఇయ్యరు, యూరియా సరఫరా చేయరు.. అని మండిపడ్డారు. క్యూలైన్లలో యూరియా బస్తాల కోసం తల్లాడి తల్లాడి చచ్చిపోయే పరిస్థితి, రుణమాఫీ చేయకపోతే బ్యాంకులకు పోయి పురుగుల మందు తాగి సచ్చిపోయిన పరిస్థితులు ఇదే ఆదిలాబాద్‌లో చూశామన్నారు. ఇదే నిర్మల్ నుంచి బోథ్ నియోజకవర్గానికి పోతుంటే ఆలూరు చెరువు మూడున్నర, నాలుగు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే చెరువును సైతం మిషన్ కాకతీయలో బాగు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. గోదావరి, కృష్ణ నదుల్లో ఒక్కో నీటి బొట్టును ఒడిసిపట్టింది కేసీఆర్ అటు కాళేశ్వరమైనా.. ఇటు సదర్మాట్ బ్యారేజీ అయిన కట్టిన నాయకుడు కేసీఆర్ అన్నారు. నేను చెప్పిన మాటలన్నీ వాస్తవమా కాదా.. బీఆర్ఎస్ హయాంలో ఎట్లుండే పరిస్థితి ఇప్పుడు ఎలా మారిందో నిర్మల్ జిల్లా రైతన్నలు ఆలోచించాలన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపిస్తే ఏం లాభం జరిగింది
నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించారు. ఆ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తా, నిర్మల్‌ను స్మార్ట్ సిటీ చేస్తా, వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెస్తా, రైల్వే లైన్ తెస్తా, ఉపాధి కల్పన చేస్తా, పేదలకు పట్టా భూములిస్తా, ఉన్నత విద్యాసంస్థలు తెస్తా అని చెప్పిండు. మరి మూడేళ్లలో ఒక్క పనైనా అయ్యిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే ఏమన్న పని చేసిండా.. ఆలోచించాలన్నారు. నన్ను అడిగితే బీఆర్ఎస్ ఏం చేసిందంటే నిర్మల్‌ను జిల్లా చేసినం, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తెచ్చినం, నిర్మల్‌కు కలెక్టర్‌ను, ఎస్పీని తెచ్చి కూసబెట్టినం, నిర్మల్‌లో సదర్మాట్ బ్యారేజీ కట్టినం, ఇలా చెప్పమంటే వెయ్యి పనులు ఉన్నాయన్నారు. కానీ.. నేను అడుగుతున్నా బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపిస్తే ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఏం లాభం జరిగింది.
ఆదిలాబాద్‌లో సీసీఐ ప్రాజెక్ట్ ఉంటది దాన్ని ఇవాళ తుక్కు కింద అమ్మేస్తున్నంటే.. ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడడం లేదన్నారు. నిర్మల్ జిల్లాకు చట్ట ప్రకారం రావాల్సిన నవోదయ పాఠశాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదన్నారు. మీ ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ లీడర్.. మమ్ములను ప్రధాన ప్రతిపక్ష పార్టీని రోడ్డు మీద ఆపితే ఆయన ఏం మాట్లాడరు అన్నారు. మా మహిళ ఎమ్మెల్యేల జుట్టుపట్టి గుంజినా, చీర పట్టి గుంజినా మీ ఎమ్మెల్యే నోరు మెదపడం లేదన్నారు.
కాంగ్రెస్ మీద మాట్లాడానికి మీ ఎమ్మెల్యేకు నోరు వస్తలేదన్నారు ఎంతసేపు రేవంత్‌రెడ్డికి డప్పు కొట్టడం తప్ప మీ ఎమ్మెల్యే వేరే పని ఏం చేస్తలేడన్నారు. నిర్మల్ కోసం మాట్లాడడు. ఆదిలాబాద్ కోసం అడగడు.. రేవంత్‌రెడ్డి మీద మాట్లాడే దమ్ము లేదు. మోదీ దగ్గర కొట్లాడే దమ్ము లేదన్నారు. అలాంటప్పుడు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో మా నిర్మల్ అన్నదమ్ములు ఆలోచించాలన్నారు. ఇదే నిర్మల్ జిల్లాలో బీడీలు చుట్టే అక్కా చెల్లుల్లున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో వాళ్లకు పింఛన్ ఇస్తలేరని, కానీ మన కేసీఆర్ ఒక్క నిర్మల్ జిల్లాలోనే 63 వేల మంది బీడీ కార్మిక అక్కాచెల్లల్లకు పింఛన్ ఇచ్చాన్నారు.
పార్టీని కాపాడుకున్న నాయకులకు ధన్యవాదాలు..

నిర్మల్‌లో ఉన్న మా గులాబీ దండు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలకు ఒక్కటే మనవి చేస్తున్నా.. పార్టీని విడిచి నాయకులు పోయినా.. మీరందరూ పార్టీని కాపాడుకున్నందుకు మీ అందరికీ చేతులు జోడించి అభివాదం చేస్తున్నానని కేటీఆర్ అన్నారు. నాయకులు వస్తరు పోతరు.. కానీ కార్యకర్తలే ఏ పార్టీకైనా ప్రాణవాయువు అని, ఇవాళ తమ్ముడు వినయ్‌రెడ్డి వచ్చిండు.. తప్పకుండా కొత్త ఉత్సాహం వస్తుందన్నారు. ఆయనతోపాటు పార్టీలో చేరిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలన్నారు.
నిర్మల్ జిల్లా ప్రజలు నిర్మలమైన మనసుతో ఆలోచించండి.. పదేళ్ల కేసీఆర్ పాలన చూసిండ్రు.. మూడేళ్ల ఈ ముదనష్టపు పాలన చూస్తా ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. లేకుంటే మోసపోతే గోసపడుతామని కేసీఆర్ చెప్పినట్లే.. మోసపోతున్నాం. గోస పడుతున్నామన్నారు. రానున్న రోజుల్లో నిర్మల్ గడ్డపై గులాబీ జెండా మళ్లీ ఎగరాలని, కేసీఆర్ సీఎం కావాలని, తెలంగాణ ప్రగతి రథ చక్రం మళ్లీ పట్టాలెక్కాలని పిలుపునిచ్చారు.
సభలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, గంప గోవర్దన్, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, హన్మంత్ షిండే, నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఇన్చార్జులు రాంకిషన్‌రెడ్డి, జాన్సన్ నాయక్, రమాదేవి, శ్యాంసుందర్, విలాస్ గాదేవార్, కిరణ్ కొమ్రేవార్, వినయ్‌రెడ్డి పాల్గొన్నారు.
నాలుగున్నర లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చింది కేసీఆర్..

ఇది మాములు జిల్లా కాదని.. కుమ్రం భీం పుట్టిన పూర్వ ఆదిలాబాద్ జిల్లా మీ నిర్మల్ అని కేటీఆర్ అన్నారు. భీం స్ఫూర్తితో గిరిజన, ఆదివాసీ ఆవాసాలు, గూడేలు, తాండా లు అన్నింటిని గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. ఒకటి కాదు, రెండు కాదు నాలున్నర లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చారన్నారు. గిరిజనుల రిజర్వేషన్‌ను ఆరు శాతం నుంచి పది శాతం పెంచింది కేసీఆర్ అని గుర్తు చేశారు. ఒకనాడు ఇదే ఆదిలాబాద్ జిల్లాలో మంచం పట్టిన మన్నెం అని వార్తలు వస్తుండో.. వానకాలంలో విషజ్వరాలు వస్తుండే.. ఇవాళ అవన్నీ మాయం చేసింది, మిషన్ భగీరథ పెట్టి నీళ్లతో వచ్చే జబ్బులను దూరం చేసింది కేసీఆర్ అన్నారు.
గిరిజన ఆదివాసుల కోసం కేసీఆర్ నాలుగున్నర లక్షల ఎకరాలకు పోడు పట్టాలిస్తే, ఆ గిరిజనులను ఇవాళ అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటు న్నారంటూ మండిపడ్డారు. ఇదే నిర్మల్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రారంభిస్తే దాన్ని కాంగ్రెస్ ఆపు చేసిందన్నారు. బీఆర్ఎస్ నిర్మల్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు నిధులు ఇస్తే వాటిని రద్దు చేసింది. ఎస్పీ ఆఫీస్ కడుతుంటే ఆపేసింది ఈ సర్కార్ అన్నారు. ఈ మూడేళ్లలో ఏం ఉద్దరించావు అంటే రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు అందరిని మోసం చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు.
నిర్మల్ పుణ్యభూమి.. ధన్యభూమి..
నిర్మల్ మాములు జిల్లా కాదు.. చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువున్న పుణ్యభూమి.. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన నిర్మల్ పేయింటింగ్స్, బొమ్మలను తయారు చేసే కళాకారులు వర్ధిల్లే ధన్యభూమి అన్నారు. సరిగ్గా 30 ఏళ్ల కిందట 1996లో ఆనాడు ఇదే నిర్మల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చినప్పుడు.. కేసీఆర్ మంత్రిగా ఉండి ఇన్చార్జిగా ఇక్కడికి వచ్చారన్నారు. ఆ సమయంలో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ను సందర్శిస్తే.. ఆ గేట్లకు గ్రీస్ లేదు, ఆయిలింగ్ లేదు, సిలుముపట్టిపోయి ఎప్పుడో కట్టిన ప్రాజెక్ట్ అనాథగా మారిపోయి కనిపించిందన్నారు. ఏదో ఒక్కరోజు మన ప్రాజెక్టుకు మంచిరోజులు రావాలంటే తెలంగాణకు నీళ్లు రావాలంటే.. నాకు భగవంతుడు శక్తిని ఇస్తే నేనే ఉద్యమానికి శ్రీకారం చుడుతానని, తెలంగాణ తీసుకొస్తానని మొట్టమొదటి సరి ప్రకటించిన గడ్డ నిర్మల్ అన్నారు.
కాంగ్రెస్ రైతులను అగాధంలోకి నెట్టింది

నిర్మల్, నవంబర్ 11(నమస్తే తెలంగా ణ) : “ఇది రాజకీయ సభ కాదు.. ఓట్ల కోసం ఏర్పాటు చేసిన సభ అంతకంటే కాదు.. రైతుల హక్కుల సాధన, సమస్య లపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిర్వహి స్తున్న సభ..” అని బోథ్ ఎమ్మె ల్యే అనిల్ జాదవ్ అన్నారు. కేసీఆర్ పాలనలో రాజు ల్లా బతికిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో అగాధంలోకి నెట్టిం దని విమర్శించారు.
బుధవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా నిర్వహించిన రైతు గర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లు వదలకపోవడంతోనే తెలంగాణలో రైతుల పొలాలు బీడు భూములుగా మారుతున్నాయన్నారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఉత్సవాలు, వేడుకల్లోనూ ‘సారే రావాలి.. కారే గెలవాలి..’ అంటూ కేసీఆర్‌పై రూపొందించిన పాటలు మార్మోగుతున్నాయని అన్నారు. ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న అభిమానానికి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విజయానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు.
పదవులు అనుభవించి పార్టీ మారిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక పదవులు అనుభవించి, రాజకీయంగా లబ్ధి పొంది ప్రస్తుతం పార్టీలు మారిన నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం మారిన వెంటనే చాలా మంది నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్పటికీ, పార్టీ కార్యకర్తలు మాత్రం గులాబీ జెండా వెంటే నిలిచారన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లి, వారి పక్షాన పోరాడేందుకే రైతు గర్జన సభను ఏ ర్పాటు చేశామని అన్నారు. గత మూడేళ్లుగా తనపై ఎంతో విశ్వాసం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, కేటీఆర్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజాసేవకు చాన్సిచ్చారు

కేసీఆర్, కేటీఆర్‌ల వెంట జెండా పట్టుకొ ని నడిస్తే చాలనుకున్న తనకు వారు అక్కు న చేర్చుకొని ప్రజాసే వకు పంపారని ఖా నాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. 30 ఏళ్ల తన ప్రస్థానంలో కాలేజీ రోజుల నుం చి కాలిఫోర్నియా వరకు, అక్కడి నుంచి ఖానాపూర్ నియోజకవర్గం వరకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయన్నారు. ఈ ప్రయాణంలో కేసీఆర్, కేటీఆర్‌లు తనపై నమ్మకం ఉంచి ప్రజాసేవకు అవకాశం కల్పించారని చెప్పారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లభించని సమయంలో ఇక్కడికి వచ్చి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్‌ను మరోసారి సీఎంగా చేసుకోవాలని జాన్సన్ నాయక్ పేర్కొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

