రాష్ట్ర సర్కారు చరిత్రలో ఎన్నడులేని విధంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. భారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తుండ డంతో కొలువులు సాధించడానికి నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ఉద్యోగార్థులకు వరంగా మారాయి. నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తుండడం, స్టడీ మెటీరియల్ అందిస్తుండడం, రోజూ వారీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుండడం, ఉపకార వేతనాలు అందజేస్తుండడం, వాట్సాప్‌ల ద్వారా విద్య, ఉద్యోగ సమాచారం చేరవే స్తుండడంతో ప్రిపేర్ అవుతున్నారు. విశాలమైన గదులు, గ్రంథాలయం ఉండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చదువుకుంటున్నారు. ఇప్పటివరకు 3200 మంది శిక్షణ తీసుకోగా.. పలువురు ఉద్యోగాలు సాధించారు.
– ఆదిలాబాద్, మే 25(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, మే 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సర్కారు రికార్డు స్థాయిలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఉద్యోగార్థులు కూడా పట్టుదలతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలు సాధించాలనే తపనతో ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి చదువుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జాబ్స్ సాధించడానికి శిక్షణ కోసం హైదరాబాద్, ఢిల్లీ వంటి మహానగరాలకు వెళ్లేవారు. ప్రైవేట్‌లో చేరి వేలాది రూపాయలు ఫీజులు కట్టి శిక్షణ తీసుకునే వారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఉద్యోగార్థులు కొలువులు సాధించడానికి తోడ్పాటునందిస్తున్నది. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో యువతీయువకులకు తర్ఫీదు ఇస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉద్యోగార్థులకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నది.
మెరుగైన శిక్షణ
ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉద్యోగార్థులకు ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నది. స్టడీ సర్కిల్లో విశాలమైన తరగతి గదులతోపాటు స్టడీ హాళ్లు, లైబ్రరీలు, నివాస గదులు, మెస్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్, ఉపకార వేతనం అందజేస్తారు. గ్రూప్-1,2,3,4, కానిస్టేబుల్, ఎస్సై, గురుకులం టీచర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ లాంటి ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు కొనసాగుతున్నాయి. నిష్ణాతులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహించడంతోపాటు రోజూ పరీక్షలు కండక్ట్ చేస్తున్నారు.
ఉద్యోగార్థులు చదువుకునేందుకు లైబ్రరీలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు యువత లైబ్రరీలో చదువుకునే అవకాశం ఉంది. ఇంగ్లిష్, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, రీజనింగ్, అర్థమెటిక్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ-కల్చర్, తెలంగాణ హిస్టరీ,-కల్చర్, సోషలజీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూమెంట్, కరెంట్ అఫైర్స్ లాంటి పుస్తకాలు ఉంటాయి. సర్కిల్ నిర్వాహకులు వాట్సాప్ గ్రూపుల్లో విద్య, ఉద్యోగ సమాచారం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు చెందిన 3,200 మందికి శిక్షణ ఇవ్వగా పలువురు సర్కారు ఉద్యోగాలు సాధించారు.
గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా..
నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. బీసీ స్టడీ సర్కిల్లో నిరుద్యోగులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తున్నారు. చదువుకునేందుకు స్టడీ హాళ్లు కూడా ఉన్నాయి. లైబ్రరీలో వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయి. నేను రోజు ఇక్కడికి వచ్చి గ్రూప్స్ ఉద్యోగాలు సాధించడానికి ప్రిపేర్ అవుతున్నా.
– పీ . దత్తు, ఆదిలాబాద్
రోజూ పది గంటలు చదువుతున్నా..
నేను ఆదిలాబాద్ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. రోజూ స్టడీ సర్కిల్‌కు వచ్చి చదువుకుంటున్నా. ఇక్కడ వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు ఉన్నాయి. తెలుగు అకాడమీ, జాగ్రఫీ, జనరల్ ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్ ఇతర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. రోజూ ఉదయం నిమిదింటికి వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటా. స్టడీ హాళ్లలో వంద మంది నిరుద్యోగులు వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు.
– జీ . నీలకంఠ, ఎందా, ఉట్నూర్ మండలం
వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ
ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత శిక్షణ ఇస్తున్నాం. నిపుణులైన అధ్యాపకులు వివిధ అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనం కూడా అందజేస్తున్నది. శిక్షణలో భాగంగా మెటీరియల్ పంపిణీ చేస్తాం. తాగునీరు, టీ, స్నాక్స్ అందజేస్తాం. జూన్ 1 నుంచి గురుకులం ఉపాధ్యాయ ఉద్యోగాల అభ్యర్థులకు శిక్షణ ప్రారంభిస్తాం. నిరుద్యోగులు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి.
– కే.రాజలింగు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి, ఆదిలాబాద్
కానిస్టేబుల్ ఉద్యోగానికి శిక్షణ తీసుకున్నా..
నేను బీసీ స్టడీ సర్కిల్లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడానికి శిక్షణ తీసుకున్నా. శిక్షణ బాగా ఇవ్వడంతో రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించా. ఈవెంట్స్ మిస్సయ్యా. ఇప్పుడు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. రోజు స్టడీ సర్కిల్‌కు వచ్చి లైబ్రరీ బుక్స్ చదువుతా. రోజూ ఎనిమిది గంటల పాటు వివిధ సబ్జెక్టుల మెటీరియల్ చదువుతా. లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఉద్యోగాలు సాధించడానికి చాలా ఉపయోగపడుతాయి.
– కృష్ణవేణి, శాంతాపూర్, గుడిహత్నూర్ మండలం