ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, ఏప్రిల్ 11 : హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జ్యోతిబాఫూలే జయంతి వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.
బెజ్జూర్, ఏప్రిల్ 11 : సంఘ సంస్కర్త, ఫూలే దంపతుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన జ్యోతిబాఫూలే జయంతిలో మాలీ సంఘ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోయం చిన్నయ్య, సామల రాజన్న, చిప్పకుర్తి దేవాజీ, రౌతు లచ్చన్న, మేర్గు రమేశ్, మాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.