తెల్లకాగితం లాంటిది బాల్యం. దానిమీద కన్నవాళ్లు ఏం రాస్తే అదే పిల్లల స్వభావం అవుతుంది. బాల్యంలో ఎదురయ్యే చిన్నచిన్న సంఘటనలే చిన్నారుల మనస్తత్వాన్ని నిర్ణయిస్తాయని అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా అమ్మ, అత్త, తాత.. అంటూ తేలికైన పదాలను నొక్కినొక్కి పిల్లలకు నేర్పుతారు పెద్దలు. అయితే పిల్లల మాటతీరు, శబ్దాలను గ్రహించే శక్తి అమ్మల మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు మాక్స్ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ కాగ్నిటివ్ అండ్ బ్రెయిన్ శాస్త్రవేత్తలు.
ప్రసవం తర్వాత వేరువేరు మానసిక స్థితులను కలిగిన 46 మంది మహిళలపై చేసిన పరిశోధనలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడి అయ్యాయి. పుట్టిన రెండు నుంచి ఆరు నెలలలోపే తల్లి చేసే శబ్దాలను గ్రహిస్తారు పసిబిడ్డలు. తల్లులు మానసికంగా చైతన్యవంతంగా ఉంటే.. ఆ పిల్లల భాషా నైపుణ్యమూ మెరుగ్గా ఉంటుంది. కొంత ఎదిగాక మాతృభాషనూ ఇట్టే నేర్చుకుంటారు. పెద్దయ్యాక మానసికంగా కూడా దృఢంగా ఉంటారని ఈ అధ్యయన సారాంశం. ఏమాత్రం చురుకుదనం లేని అమ్మల మాటలను మాత్రం బిడ్డలు అస్సలు గ్రహించలేరు. ఎదిగేకొద్దీ స్పీచ్ డిజార్డర్ వంటి సమస్యలు ఇబ్బందిపెట్టే ప్రమాదం ఉంది. ఇలాంటి వారిలో ఆత్మన్యూనత, డిప్రెషన్ తదితర లక్షణాలూ కనిపించవచ్చు.