నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ప్రపంచం మాత్రం యోగా చుట్టూనే తిరుగుతున్నది. అమెరికాలాంటి దేశాలు సైతం యోగాలోని వైద్య గుణాలను ఆమోదిస్తున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్ర.. ప్రత్యామ్నాయ చికిత్సలో భాగంగా భావిస్తున్నాయి. యోగా థెరపీని సాధికారికంగా అమలుచేస్తున్నాయి. ఆధునిక జీవనశైలిలోని ప్రతి రుగ్మతకూ యోగాలో పరిష్కారం ఉంది.
యోగా అంటే.. జీవనయోగం!
యోగా.. భారతీయ వైద్య విధానాలలో ఒకటి. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదంతో పాటు యోగా కూడా ఎన్నో దీర్ఘకాలిక రుగ్మతలను నిలువరించగలదు. కానీ, మారుతున్న కాలంతో పాటు సంప్రదాయ జీవనశైలి మరుగున పడుతున్నది. ఫలితంగా, మనిషికి తన శరీరం మీద అదుపు లేకుండా పోయింది. మనసు మీదా నియంత్రణ కోల్పోతున్నాడు. దీంతో అధిక రక్తపోటు, ఊబకాయం, హృద్రోగాలు, ఒత్తిడి, మతిమరుపు మొదలైన శారీరక, మానసిక సమస్యలు అతని నెత్తినెక్కి కూర్చున్నాయి. మరోవైపు పరాయి వైద్య విధానాలు మంచికంటే చెడే ఎక్కువ చేస్తున్నాయి. దీంతో చాలామంది యోగ చికిత్సల వైపు అడుగులేస్తున్నారు. దినచర్యలో ఆసనాలను ఓ భాగం చేసుకుంటున్నారు. యోగా థెరపీ ప్రభావాలపై అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లోనూ పరి
శోధనలు జరుగుతున్నాయి. ఇటీవల, అల్లోపతి వైద్య విద్యలో సైతం యోగాను ఒక ముఖ్య పాఠ్యాంశంగా చేర్చారు. దాదాపు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ యోగా థెరపీకి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాయి.
శరీరం+మనసు
సమర్థుడైన రౌతు కళ్లెంతో అశ్వాలను నియంత్రించినట్టు.. యోగ సాధనతో మనిషి మనసు మీద పట్టు సాధించగలడు. శుభ్రమైన మనసే, ఆరోగ్యమంతమైన శరీరానికి ఆధారం. శారీరక, మానసిక స్వస్థతకు యోగాను మించిన మార్గం లేదు. శ్వాస, ధ్యాన, ఆసన.. ఈ మూడు వ్యవస్థల సమ్మేళనమే యోగ చికిత్స. వేల సంవత్సరాల క్రితం.. అప్పటికే ఆశ్రమాల్లో, తపో క్షేత్రాల్లో మహర్షులు సాధన చేస్తున్న యోగ ప్రక్రియను పతంజలి మహర్షి గ్రంథస్థం చేశారు. అక్కడొకటి ఇక్కడొకటిగా ఉన్న సూత్రాలను ఒక చోటుకు చేర్చారు. ఆయుర్వేద, వ్యాకరణ శాస్ర్తాల ఆవిష్కర్త కూడా పతంజలి మహర్షే అనే వాదన ఉంది. ‘యోగా ద్వారా మనసును, ఆయుర్వేదం ద్వారా శరీరాన్ని, వ్యాకరణం ద్వారా భాషను శుద్ధిచేసిన పతంజలి మహర్షికి ప్రణామాలు’ అంటాడు భోజ మార్తాండుడనే ప్రాచీన కవి. సంప్రదాయ యోగా అష్టాంగాల సమాహారం. అత్యున్నత యోగ స్థితికి ఎనిమిది సూత్రాలూ ఎనిమిది సోపానాలు. ‘యమ’.. సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది. ‘నియమం’ వ్యక్తిత్వ వికాస పాఠం. పరిశుభ్రత, అంతర్ దృష్టి, కర్తవ్య నిష్ఠ మొదలైన సూత్రాలు ఇందులో ఇమిడి ఉంటాయి. ‘ఆసనం’.. యోగాసనాల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. ‘ప్రాణాయామం’.. ప్రాణశక్తిని పెంచుకునే విద్య. ‘ప్రత్యాహారం’ మనసును ప్రాపంచిక విషయాలకు దూరంగా తీసుకెళ్లే మార్గం. ‘ధారణ’ ఏకాగ్రతనిస్తుంది. ‘ధ్యానం’ మనసు మీద నియంత్రణ ప్రసాదిస్తుంది. సమాధి.. ఇదే అత్యున్నత యోగ సోపానం! ఇదే అద్వైత సిద్ధి. సుఖదుఃఖాలు, జయాపజయాలు.. సమానంగా స్వీకరించే మహోన్నత స్థాయి. ఇక్కడికి చేరుకోగానే మనిషి పరిపూర్ణుడు అవుతాడు. శరీరం వజ్రసమానమై శోభిల్లుతుంది. అనారోగ్యం ఆమడదూరంలోనే ఆగిపోతుంది. సంప్రదాయ యోగాను ఎనిమిదేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సాధన చేయవచ్చు. అయితే, గురు ముఖంగానే నేర్చుకోవాలి. ఆ తరువాత స్వయంగా సాధన చేసుకోవచ్చు. అంతేకానీ యూ ట్యూబ్ చూస్తూనో, వాట్సాప్ సందేశాలను అనుసరిస్తూనో.. ఆసనాలు వేయడం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకమూ కావచ్చు.
శతమానం భవతి
మనలోని రుగ్మతకు కారణం.. సూక్ష్మజీవులో, క్రిమికీటకాలో కాదు. సాక్షాత్తు మనమే, మన అపసవ్య జీవన విధానమే. కూర్చోవాల్సిన పద్ధతిలో కూర్చోం కాబట్టి, వెన్నునొప్పి వస్తుంది, తినాల్సినవేవీ తినం కాబట్టి, పోషక విలువలు లోపిస్తాయి. తినకూడనివి తింటాం కాబట్టి, ఊబకాయం వెంటాడుతుంది. వేళాపాళా లేకుండా పొట్ట నింపేసుకుంటాం కాబట్టి, ఎసిడిటీ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనల మీద నియంత్రణ కోల్పోతాం కాబట్టి, రక్తపోటులో హెచ్చుతగ్గులు బాధిస్తాయి. రోగి వయసు, లింగం, వృత్తి, ఆరోగ్య సమస్య తదితర అంశాల ఆధారంగా యోగ చికిత్సను నిర్ధారిస్తారు నిపుణులు. యోగా థెరపీ ద్వారా 70 శాతం వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వంశపారంపర్యంగా, జీవనశైలి లోపాల కారణంగా వచ్చే క్యాన్సర్, హృద్రోగాలు, అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలనూ యోగ చికిత్స ద్వారా నియంత్రించవచ్చు. ముద్రలు, బంధాలు, ప్రాణాయామం, షట్ క్రియలు (గజకర్ణి, శంఖు ప్రక్షాళన, జలనేతి, కపాలభాతి, నౌళి, త్రాటక -ఈ క్రియలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి) జన్యుపరమైన వ్యాధులను సైతం అడ్డుకుంటాయని నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ రోగులు చికిత్సలో భాగంగా శక్తిమంతమైన గుళికల్ని మింగాల్సి ఉంటుంది. కీమో థెరపీని తట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో యోగా సాధన తగిన మనోబలాన్ని ఇస్తుందని యేల్ యూనివర్సిటీ నిపుణులు నిర్ధారించారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే యోగ సాధకుల్లో డీఎన్ఏ చాలా చైతన్య స్థితిలో ఉంటుందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అధ్యయనంలో తేలింది.
ప్రసూతి సమస్యలకు
స్త్రీ జీవితానికి మాతృత్వం ఓ వరం. గర్భధారణ సమయం నుంచి ప్రసూతి వరకు.. ఆరోగ్యకర జీవనశైలిని పాటిస్తూ నిపుణుల పర్యవేక్షణలో యోగా సాధన చేయడం ద్వారా సుఖ ప్రసవం సాధ్యం అవుతుంది. సిజేరియన్ వంటి కృత్రిమ పద్ధతులను నిరోధించవచ్చు. కన్నతల్లి సాధన ప్రభావం కడుపులోని బిడ్డ వికాసాన్ని కూడా ప్రభావితం చేస్తుందనడానికి ఎన్నో ఆధారాలు. గర్భధారణ సమయంలో వివిధ హార్మోన్లు తల్లి ఆలోచనలను నెగెటివ్‌గా ప్రభావితం చేస్తాయి. ఆ వ్యతిరేక భావనలకు యోగా, ప్రాణాయామంతో అడ్డుకట్ట వేయవచ్చు. యోగ నిద్ర, ధ్యానం తదితర విధానాలు.. తల్లీబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతాయి. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వెంటాడే అనేకానేక చెడు ప్రభావాలను యోగా సాయంతో అడ్డుకోవచ్చు. వయసుతో పాటు వచ్చే వార్ధక్య సమస్యలను యోగా నామ మాత్రం చేస్తుంది. దీంతో పరిపూర్ణ జీవితాన్ని గడపవచ్చు, జీవన మాధుర్యాన్ని నిండుగా ఆస్వాదించవచ్చు.
ఒత్తిడి, డిప్రెషన్, మధుమేహం, వెన్నెముక సమస్యలు, హైపర్ టెన్షన్, ఊబకాయం, సంతాన లేమి, హైపో థైరాయిడిజం ..తదితర రుగ్మతలకు యోగా థెరపీని ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నది. పాఠకుల అవగాహన కోసం వివిధ ఆరోగ్య సమస్యలు, వాటి నియంత్రణకు ఉపకరించే ఆసనాల వివరాలు..
మధుమేహం
సూర్య నమస్కారాలు, పశ్చిమోత్థానాసనం, గోముఖాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, సుప్త వజ్రాసనం, సూర్య-చంద్రభేద ప్రాణాయామం, కపాలభాతి.
హైపర్ టెన్షన్
నాడీ శుద్ధి ప్రాణాయామం, శవాసనం, పశ్చిమోత్థానాసనం, వజ్రాసనం, సుప్త వజ్రాసనం, శిథిలాసనం, శశాంకాసనం.
హృద్రోగ సమస్యలు
సుఖ-నాడీశుద్ధి ప్రాణాయామాలు, యోగనిద్ర, త్రికోణాసనం, గోముఖాసనం, ఉష్ర్టాసనం, భుజంగాసనం, శలభాసనం.
నెలసరి సమస్యలు
యోగనిద్ర, గర్భాసనం, భుజంగాసనం, నాడీశుద్ధి ప్రాణాయామం.
ఉబ్బసం
సూర్య నమస్కారాలు, గోముఖాసనం, వజ్రాసనం, ఉష్ర్టాసనం.
ఆర్థరైటిస్
త్రికోణాసనం, తాడాసనం, అర్ధచంద్రాసనం, నావాసనం, ప్రాణాయామం.
నడుంనొప్పి
భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, కోణాసనం, చక్రాసనం.
అజీర్ణం-వాయు సమస్య
పశ్చిమోత్థానాసనం, వజ్రాసనం, మయూరాసనం, సర్వాంగాసనం, మత్స్యాసనం, ప్రాణాయామం. ఊబకాయ సమస్య ధనురాసనం, సూర్యనమస్కారాలు, కటిచక్రాసనం, పశ్చిమోత్థానాసనం, సర్పాసనం, షట్ క్రియలు, ప్రాణాయామం.
– వి.సాయిరామ్
వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయం, హైదరాబాద్
— మహేశ్వరరావు బండారి