మా బాబు వయసు మూడు నెలలు. ఒడిలో నుంచి జారి కిందపడిపోయాడు. ఐదు నిమిషాలు ఏడ్చిన తర్వాత, ఒక్కసారి వాంతి చేసుకొని పడుకున్నాడు. మా బాబును డాక్టర్‌కు చూపించాల్సిన అవసరం ఉందా? ఇలా చిన్నపిల్లలు పెద్దవాళ్ల చేతుల్లోంచి, ఊయలలోంచి కిందపడిపోతే ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లో డాక్టర్‌ను సంప్రదించాలి? సరైన సలహా ఇవ్వగలరు.
చిన్నపిల్లలు మంచం మీదినుంచి, తల్లిదండ్రుల చేతుల్లోంచి జారి పడిపోవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. నడక నేర్చుకునే సమయంలో కింద పడిపోవడం, సోఫాలు, మెట్లమీద ఆడుకుంటూ పడిపోవడం.. ఇలా, పిల్లలు ఎదిగే క్రమంలో చిన్నచిన్న దెబ్బలు తగలడం సర్వసాధారణం. ఎప్పుడైతే పిల్లలు ఆపకుండా ఏడవడం, తలనొప్పి, ఫిట్స్లాంటివి రావడం, కాళ్లూ-చేతులు కదల్చకపోవడం, ముక్కు, చెవుల నుంచి రక్తం కారడం తదితర లక్షణాలు కనిపిస్తే.. తలకు తీవ్రమైన గాయమైనట్లు పరిగణిస్తాం. ఇక పిల్లల తలకు పెద్ద గాయమైనప్పుడు కనిపించే మరో సాధారణ లక్షణం.. వాంతులు కావడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం. లక్షణాలను బట్టి వైద్యులు తక్షణమే సీటీ స్కాన్ తీస్తారు. తలలో రక్తం గడ్డకట్టడం, బ్లీడింగ్ అవ్వడం, ఏదైనా బోన్ విరిగి తలలోకి చొచ్చుకుని పోయిందా? అనే విషయాలు స్కాన్‌లో స్పష్టంగా తెలుస్తాయి. స్కానింగ్ రిపోర్టులతోపాటు పిల్లవాడి పరిస్థితి చూసిన తర్వాత.. బ్రెయిన్ సర్జరీ చేయాలా? వద్దా? అనేది న్యూరోసర్జన్లు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ పెద్ద గాయమై.. ఆపరేషన్ అవసరమైతే అత్యవసరంగా చేసేస్తారు.
నేటి ఆధునిక ప్రపంచంలో మనం 30-40 అంతస్తుల ఇళ్లలో ఉంటున్నాం. షాపింగ్ మాల్స్‌లో ఎత్తయిన ఎస్కలేటర్లు చూస్తున్నాం. ఇలాంటి చోట్ల పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎత్తయిన భవనాల్లో నివాసం ఉండేవారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లల సేఫ్టీ కోసం బాల్కనీల్లో నెట్స్, గ్రిల్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. కుర్చీలు, స్టూల్స్ ఉంచకూడదు. ఎత్తయిన ప్రదేశాల్లో పిల్లలను ఒంటరిగా ఆడుకోనివ్వకూడదు. చిన్నపిల్లలు రెండుమూడు అంతస్తుల కన్నా మీదినుంచి కిందపడితే.. తలకు తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. నిజానికి తలకు గాయం అనేది పూర్తిగా నివారించదగిన సమస్య. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా, పిల్లలు బోర్లాపడుతున్నప్పుడు, నడక నేర్చుకుంటున్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. మంచాలను తీసేసి, వారిని కింద పడుకోబెడితే.. కిందపడే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ ప్రమాదవశాత్తూ కిందపడినప్పుడు.. పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇక తలకు తీవ్రమైన గాయమైతే.. భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మాటలు రాకపోవడం, కంటి చూపు తగ్గడం, కొందరిలో నడకలోనూ లోపం కనిపించవచ్చు. కొన్నిసార్లు దెబ్బలు చిన్నగా తగిలినా.. సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
-డాక్టర్ కొక్కుల ప్రణీత్
పిడియాట్రిక్ న్యూరో సర్జన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్