సంక్రాంతి వచ్చిందంటే పల్లె మురుస్తుంది. పెద్ద పండుగకు పట్నమూ సంబురపడుతుంది. పల్లె అల్లరి కన్నా, పట్నం ఆనందం కన్నా.. మిన్నగా ఖుషీ అయ్యేది మాత్రం సినీ జనమే! అన్ని సీజన్లలో సంక్రాంతి ఈజ్ ద బెస్ట్ అని భావిస్తారు. పెద్ద హీరోలు,యువ హీరోలు అందరికీ ఈ పండుగ సెంటిమెంటే! అందుకే, విడుదలకు రెడీగా ఉన్నా… ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నెలలు వేచి ఉంటారు దర్శక నిర్మాతలు. ప్రేక్షకులు సకుటుంబ సమేతంగా థియేటర్‌కు వచ్చేలా పసందైన కథతో పొంగల్ దంగల్‌కు సిద్ధమవుతారు. పందెం కోళ్లు కాలు దువ్వినట్టు… సంక్రాంతి బరిలో నలుగురైదుగురు హీరోలు కాలర్ ఎగరేస్తుంటారు. ఆయా సినిమాలు హిట్టో, ఫట్టో తేలేలోపు.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలైపోవడమే సంక్రాంతి స్పెషల్. ఇప్పుడు కూడా నాలుగు పెద్ద సినిమాలు సంక్రాంతి సంధిలో సందడి చేస్తున్నాయి. ఆ చిత్రాల సంగతులు ఇవి..
Sankranti Cinemalu | ఏటా సంక్రాంతి సీజన్లో భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయి. గతేడాది పొంగల్ ఫెస్ట్‌లో ఐదు సినిమాలు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ హీరోగా చేసిన ‘వీరసింహారెడ్డి’, అజిత్ ‘తెగింపు’, విజయ్ ‘వారసుడు’, సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వసూళ్ల పరంగా దాదాపు అన్నీ విజయం సాధించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పోటాపోటీగా వసూళ్లు రాబట్టాయి. సంక్రాంతి బరిలో ఇద్దరు పెద్ద హీరోలు నిలవడంతో 2023 సంక్రాంతి సీజన్ ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ పండుగకు ఆ బాధ్యతను మరో ఇద్దరు అగ్రహీరోలు నాగార్జున, వెంకటేశ్ భుజానికెత్తుకున్నారు. వీరికి మహేష్‌బాబు కూడా జతకలవడంతో ఈ సంక్రాంతి సినిమాలకు కొత్త కళ వచ్చినట్టయింది.
ఈ సంక్రాంతికి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన ఈ సెమీ ఫాంటసీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని చాలా రోజులైంది. రకరకాల కారణాలతో విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు సంక్రాంతి ఫెస్ట్‌లో ఫస్ట్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాగా పేరు తెచ్చుకుంది. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటించిన ‘హను-మాన్’కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అతీంద్రియ శక్తులతో లోకాన్ని జయించాలనుకునే ప్రతినాయకుణ్ని హనుమంతుడి అనుగ్రహం పొందిన హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నది కథ. కథనం కూడా ఆసక్తికరంగా మలచడం, గ్రాఫిక్స్ జతకలవడంతో మొదటి ఆటతోనే ‘హను-మాన్’కు ప్రేక్షకులు జై కొట్టారు. హనుమంతుడి సెంటిమెంట్ బలంగా వర్కవుట్ కావడంతో సంక్రాంతి రేసులో తేజ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడని ఇండస్ట్రీ టాక్.
మహేశ్‌బాబు సినిమా అంటేనే ప్రేక్షకులకు ఒక ఊపొస్తుంది. ఆయనకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తోడవ్వడంతో అంచనాలు పదింతలు పెరిగాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఖలేజా’ వసూళ్ల పరంగా నిరాశ పరిచినా.. డిఫరెంట్ మహేశ్‌ను చూశామని అభిమానులు పండుగ చేసుకున్నారు. మళ్లీ వీరిద్దరూ జత కట్టడంతో ‘గుంటూరు కారం’ ఘాటు నషాళానికి ఎక్కుతుందని ఆశించారు. మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, ఈశ్వరీరావు ఇలా భారీ తారాగణంతో మ్యాజిక్ జరుగుతుందని భావించారు. అందుకు తగ్గట్టుగా సినిమా చూశాక మహేశ్ మేనరిజమ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమంటున్నారు. రివ్యూలు ఎలా ఉన్నా… పండుగ వేళ సకినాల్లాంటి త్రివిక్రమ్ పంచ్‌లు, అరిసెల్లాంటి తియ్యని పాటలు వెరసి ‘గుంటూరు కారం’పై మమకారం పెంచేలా చేస్తున్నాయి. ఓ పక్క సోషల్ మీడియాలో యావరేజ్ రివ్యూలు వైరల్ అవుతున్నా… మరోవైపు టికెట్లు తెగ అమ్ముడవుతున్నాయి.
సంక్రాంతి సీజన్లో నాగార్జున సినిమాలు పెద్ద సంఖ్యలో రాకపోయినా.. వచ్చిందంటే బొమ్మ హిట్టవ్వడం ఖాయం. కెరీర్ మొదట్లో వచ్చిన ‘మజ్ను’ నాగ్ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది. ఈవీవీ, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ‘ఆవిడ మా ఆవిడే’ కూడా సంక్రాంతి బొమ్మే! 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తర్వాత ఆరేండ్లకు 2022 సంక్రాంతి సీజన్లో కొడుకు నాగ చైతన్యతో కలిసి ‘బంగార్రాజు’గా పలకరించి మరోసారి సంక్రాంతికి వచ్చానంటే హిట్టు పక్కా అని నిరూపించుకున్నాడు. ఏడాది గ్యాప్ తర్వాత ఈ సంక్రాంతికి అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌తో కలిసి అల్లరి చేయడానికి నాగార్జున సిద్ధమవుతున్నాడు. విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళే విడుదల కానుంది. స్నేహం, ప్రేమ, ద్వేషం ఇలా మానవ భావోద్వేగాలను మిళితం చేసిన ‘నా సామిరంగ’ పండుగ వేళ విందు భోజనం చేసిన అనుభూతి కలిగిస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నది. కీరవాణి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది.
విక్టరీ వెంకటేశ్, సంక్రాంతిది విడదీయరాని బంధం. ఆయన కెరీర్లో దాదాపు డజన్ చిత్రాల వరకు పొంగల్‌కు సందడి చేశాయి. 1989 సంక్రాంతికి విడుదలైన ‘ప్రేమ’ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. వెంకటేశ్ సినీయానంలో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గ సినిమాలు రక్త తిలకం, చంటి, ధర్మచక్రం, కలిసుందాం.. రా!, లక్ష్మీ, నమో వెంకటేశ, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్2 ఈ సినిమాలన్నీ సంక్రాంతికి విడుదలై రికార్డు వసూళ్లు సాధించినవే! పోకిరి రాజా, చిన్నబ్బాయి చిత్రాలు సంక్రాంతికే విడుదలైనా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. మొత్తంగా సంక్రాంతి సీజన్ వెంకటేశ్‌కు కలిసొచ్చేదే అనిపించుకుంది. అందుకే తన కెరీర్లో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 75వ సినిమా విడుదలకు సంక్రాంతినే ఎంచుకున్నాడు అనిపిస్తుంది. ‘సైంధవ్’గా పలకరిస్తున్నాడు ఆయన. శైలేశ్ కొలను దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్‌తోపాటు సెంటిమెంట్ కూడా బాగా వర్కవుట్ కావడంతో ఈ సంక్రాంతికి వెంకీ విక్టరీ పక్కా అనిపిస్తుంది.