అడినాయిడ్ గ్రంథులు గొంతుకు, ముక్కుకు మధ్య ఉంటాయి. ఇవి గొంతు తెరిస్తే కనిపిస్తాయని అనుకుంటారు. కానీ, కనిపించవు. పిల్లల్లో తరచుగా అడినాయిడ్ గ్రంథుల వాపు కనిపిస్తుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు నొప్పి కూడా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారినపడతారు. దీనినే అడినాయిడిటిస్ అంటారు. వైరస్ వల్ల, కొన్నిసార్లు యాసిడ్ ప్రభావం వల్ల, కొన్నిసార్లు అలర్జీ వల్ల కూడా పిల్లలు అడినాయిడిటిస్ బారినపడతారు. పిల్లల్లో ఈ సమస్య వస్తే ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడం కష్టమవడం, దగ్గు, గొంతు నొప్పి, నోటి నుంచి ఊపిరి పీల్చుకోవడం, జ్వరం లక్షణాలు ఉంటాయి.
సాధారణంగా ఏడేళ్ల వయసు వచ్చేసరికి అడినాయిడ్లన్నీ పోతాయి. కానీ, కొంతమందిలో ఆ సమస్యలు ఏడేళ్లు పైబడినా ఉంటాయి. ముక్కు నుంచి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. వాళ్లు నోటితో ఊపిరి తీసుకుంటారు. గురక వస్తుంది. వాళ్ల దంత వరుస క్రమం సరిగా ఉండదు. దానిని మిస్ అలైన్డ్ బైట్ అంటారు. రాత్రి వేళ సరిగా నిద్రపోకపోవడం వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సమస్య రావొచ్చు. అడినాయిడిటిస్ (అడినాయిడ్ గ్రంథుల వాపు) ఉంటే చాలామంది తల్లిదండ్రులు భయపడతారు. పిల్లలు తరచుగా ఈ సమస్య బారినపడితే మందులు వాడాల్సి రావడం, ఎదగడంలో సమస్య వస్తుంది. కాబట్టి దీనికి అవసరాన్ని బట్టి చికిత్స మందులతో లేదా సర్జరీతో చేయాలా? అనేది వైద్యులు నిర్ణయిస్తారు. దీనికి ముందుగా పిల్లలు చల్లని పానీయాలు తాగకుండా, అలర్జీ బారినపడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది.