టెక్నాలజీతోపాటు క్లాసీ లుక్ కోరుకునే సాహసికుల కోసం.. గార్మిన్ సంస్థ అదిరిపోయే స్మార్ట్‌వాచ్ తీసుకొచ్చింది. ఆధునాతన ఫీచర్లతో, అత్యంత శక్తిమంతంగా ఈ ప్రీమియం వాచీని తీర్చిదిద్దింది. ‘గార్మిన్ డీ2 మాక్2 ప్రో’ పేరుతో ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలోని ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 1.43 అంగుళాల, ప్రకాశవంతమైన AMOLED డిస్ప్లేను ఏర్పాటుచేశారు. ఇది మిట్ట మధ్యాహ్నం కూడా రంగుల్ని చాలా ప్రకాశవంతంగా చూపిస్తుంది. బ్రాండ్ పేరును నిలబెట్టేలా.. ప్రీమియం లుక్‌తో తీసుకొస్తున్నారు. ఇందులో ఇన్‌బిల్ట్ ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ ఉంటుంది. ఇది వైట్, రెడ్‌లైట్ ఆప్షన్లతో వస్తుంది. రాత్రి వేళల్లో పనులు చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ప్రత్యేక రెడ్ షిఫ్ట్ మోడ్‌తో డిస్ప్లే మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. రాత్రిపూట కళ్లకు ఇబ్బంది కలగకుండా, చూపు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ వాచీలోని మరో అద్భుతమైన ఫీచర్.. దీని బ్యాటరీ.
ఒక్కసారి చార్జ్ చేస్తే.. స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 25 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుంది. విమానయాన రంగంలో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని ఇందులో ప్రత్యేక ఏవియేషన్ ఫీచర్లను పొందుపరిచారు. డైరెక్ట్-టు నావిగేషన్ ద్వారా.. ఫోన్ అవసరం లేకుండానే ప్రపంచవ్యాప్త ఏరోనాటికల్ డేటాబేస్ ఉపయోగించి సమీపంలోని విమానాశ్రయాలకు నావిగేషన్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుంచే విమానయాన వాతావరణ సమాచారాన్ని చూసుకోవచ్చు. విమానం టేకాఫ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్లయిట్ వివరాలను ట్రాక్ చేస్తుంది. వినియోగదారుల ఫ్లైగార్మిన్ ఖాతాకు డాటాను పంపుతుంది. వీటితోపాటు 24/7 హార్ట్ రేట్ మానిటర్, ఆక్సిజన్, స్లీప్ మానిటర్, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ట్రాకింగ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఫిట్నెస్ ప్రియుల అవసరాలు తీర్చేలా.. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ లాంటి వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తుంది. మణికట్టుపై అద్భుతంగా కనిపిస్తూనే.. చాంపియన్‌లా పనిచేస్తుంది! దీని ధర రూ.1,17,000. ప్రముఖ స్టోర్లలో అందుబాటులో ఉన్నది.