చంటి పిల్లలకు దోబూచులాటంటే మహా సరదా. ముఖం మూసి తెరిస్తే చాలు బోసినవ్వులు ప్రత్యక్షం అవుతాయి. అయితే, ఇప్పుడు పాపాయి పొట్టలో ఉండగానే తొంగిచూసినట్టు కనిపించే గమ్మత్తయిన టీ షర్టులు వస్తున్నాయి. ఈ ‘ఫన్నీ ప్రింటెడ్ ప్రెగ్నెన్సీ టీ షర్ట్’ పొట్ట ప్రాంతంలో బుజ్జిపాప బొమ్మ ఉంటుంది.
జిప్ తీసుకుని బయటికి వస్తున్నట్టు, టీ షర్ట్ సందులోంచి తొంగి చూస్తున్నట్టు, లోపలున్నది నేనే అంటూ చెయ్యెత్తి చెబుతున్నట్టు.. రకరకాల ప్రింట్లతో వింతవింత టీ షర్ట్స్ తయారవుతున్నాయి. కాబోయే అమ్మలకు బహుమతిగా ఇచ్చేందుకు ఇవి ఒక సరదా ఎంపిక. అమెజాన్, ఆలీ బాబాలాంటి వెబ్సైట్లలో అమ్ముతున్నారు. దోబూచులాటలో పాపాయి నవ్వినట్టు… వీటిని చూడగానే ఎవరి ముఖం మీదఅయినా చిరునవ్వు విరబూయాల్సిందే!