అమెజాన్ ప్రైమ్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: భూమి పెడ్నేకర్, ఆదిత్య రావల్, సమర తిజోరి, గీతా అగర్వాల్ శర్మ తదితరులు
దర్శకత్వం: అమృత్‌రాజ్ గుప్తా
ఓటీటీని ‘థ్రిల్లర్ జోనర్’ కథలే ఏలుతున్నాయి. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ ఈ తరహా స్టోరీలే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, సస్పెన్స్, స్పై.. ఇలా ప్రతివారం ఏదో ఒక థ్రిల్లర్ సినిమా గానీ, వెబ్ సిరీస్ గానీ స్ట్రీమింగ్కు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే.. ‘దల్దాల్’ పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా.. హిందీతోపాటు తెలుగులోనూ అందుబాటులో ఉన్నది.
కథలోకి వెళ్తే.. ముంబయిలో వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. చేతి మణికట్టును కోసి, దొరికిన వస్తువులను నోట్లో కుక్కి.. అత్యంత దారుణంగా హత్య చేస్తుంటారు. ఈ క్రమంలో డీసీపీ రీటా ఫెరీరా (భూమి పెడ్నేకర్).. ఈ కేసును టేకోవర్ చేస్తుంది. మరో పోలీస్ అధికారిణి ఇందుమాత్రే (గీతా అగర్వాల్).. ఆమెకు అసిస్టెంట్‌గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారికి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సమాజానికి ఏదో ఒక సహాయం చేస్తున్నవారే.. ఇలా హత్యకు గురవుతున్నట్లు వారు గుర్తిస్తారు.
పేదలకు అన్నదానం, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, మూగ జీవాల పట్ల కరుణతో మెలిగే వారే.. ఇలా హత్యకు గురవుతుంటారు. మీడియా కూడా హత్య కేసులపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటుంది. ఈ విషయంలో పోలీసుల వైఖరిపై జర్నలిస్ట్ అనిత (సమర తిజోరి) అసహనం వ్యక్తం చేస్తుంటుంది. తనదైన దూకుడుతో పోలీసులను కూడా కంగారుపెడుతుంది. మరోవైపు ఆడపిల్లల తరలింపు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లాంటివీ రీటాకు కొత్త సవాళ్లు విసురుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో.. రీటా ఇన్వెస్టిగేషన్
ఎలా సాగుతుంది? బయటి ప్రపంచానికి జర్నలిస్ట్‌గా కనిపిస్తున్న అనిత నిజస్వరూపం ఏమిటి? ఆమెకూ, ఆమె స్నేహితుడు సాజీద్ (ఆదిత్య రావల్)కు.. ఈ హత్యలకు ఏం సంబంధం? అసలు సాజీద్ ఎవరు? హంతకులను పట్టుకునే విషయంలో పోలీసులకు ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? తెలుసుకోవాలంటే.. సిరీస్‌ను వీక్షించాల్సిందే!