క్యాంపస్‌లో నడిపే రేడియో స్టేషన్లు సినిమాల్లో చూశాం. స్కూళ్లలోనూ రేడియోలు నడుపుతున్నారని విన్నాం. ఈ ‘స్కూల్ రేడియో’ ఆధ్వర్యంలో దేశంలో ఎంతోమంది పిల్లలు బ్రాడ్కాస్టర్లు అయ్యారు! ‘పెద్దలు మాట్లాడితే పిల్లలు వినడం కాదు,పిల్లల మాటలూ ఈ ప్రపంచం వినాలంటున్న డిజిటల్ స్కూల్ సహ వ్యవ స్థాపకురాలు అరుణ కాట్రగడ్డ స్కూల్ రేడియో అనుభవాలను జిందగీతో పంచుకున్నారిలా..
పిల్లలు మాట్లాడేందుకు ముందుకు వచ్చిన ప్రతిసారీ ‘మీకెందుకు? మీకేం తెలుసు? చిన్నవాళ్లు’ అంటూ వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతుంది. మాట్లాడేవాళ్లని మాట్లాడకుండా నోరు మూయిస్తారు. అలా పిల్లలు ఎప్పుడూ చర్చలో లేకపోవడం వల్లే పెద్దయ్యాక నలుగురిలో మాట్లాడాలంటే భయపడతారు. నలుగురిలోకి పిలిచి మాట్లాడమని పిలిస్తే చాలామంది బిడియం, భయంతో ఆగిపోతారు. వాళ్ల మనసులో చాలా ఆలోచనలుంటాయి. కానీ, వ్యక్తీకరించలేరు. జనాభాలో పిల్లలు, టీనేజర్లు యాభై శాతం ఉంటారు. ఈ సగం మంది తమ ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవడానికి చర్చలో పాల్గొనే అవకాశం సమాజంలో ఉండదు. కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలా పెరిగిన వాళ్లు ఉద్యోగంలో చేరాల్సినప్పుడు, వ్యాపారం మొదలుపెట్టాల్సినప్పుడు తప్పు మాట్లాడతామేమో, జడ్జ్ చేస్తారేమోనని భావాలను వ్యక్తీకరించరు. పిల్లలకు ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే వాళ్లని మాట్లాడనివ్వాలి. అందుకే వాళ్లతో మాట్లాడించాలని ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా 2015 ఫిబ్రవరి 13న ‘స్కూల్ రేడియో’ ప్రారంభించాం.
బడికో చానెల్
పాఠశాలలు, కళాశాలల కోసం మేము రేడియోలు నిర్వహించాం. విద్యార్థులకు నిర్వహించుకునే ప్రోత్సాహం అందిస్తాం. రేడియోని ఎలా ప్రారంభించాలి? దానికి ఏం కావాలి? వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పడం నుంచి పిల్లలకు రేడియోని నిర్వహించడం వరకు శిక్షణ ఇస్తాం. ఆగ్రా, ఉడుపిలో మా స్కూల్ రేడియో కార్యాలయాలు ఉన్నాయి. మా మొబైల్ రేడియో స్టూడియోని విద్యాసంస్థలకు తీసుకుపోతాం. పది సంవత్సరాల చిన్నారుల నుంచి 23 సంవత్సరాల యువత వరకు స్కూల్ రేడియోకి పనిచేస్తారు. పాఠశాలలు, కళాశాలల్లో స్కూల్ రేడియో ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో పిల్లలకు మూడు నుంచి అయిదు రోజులు శిక్షణ ఇస్తాం. కార్యక్రమాల రూపకల్పన, సమాచార సేకరణ, రికార్డింగ్, ఎడిటింగ్, బ్రాడ్ కాస్టింగ్‌లో పిల్లలకు శిక్షణ ఇస్తాం. ఆ తర్వాత కాలంలోనూ మా మెంటార్షిప్ ఉంటుంది. ఇక రేడియో నిర్వహణ అంతా పిల్లల బాధ్యతే! వాటికి మా సాంకేతిక సహకారం ఉంటుంది. రేడియోని ఎలా ప్రారంభించాలి? దానికి ఏమేమి కావాలో చెబుతాం. ఆ తర్వాత పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలే స్కూల్ రేడియోని నిర్వహిస్తారు. schoolradio.inలో ప్రతి స్కూల్‌కి ప్రత్యేకమైన చానెల్ క్రియేట్ చేస్తాం. ఏ స్కూల్ వాళ్లు ఆ స్కూల్ చానెల్‌ను నడిపిస్తారు. కొన్ని చానెల్స్ని రెండు, మూడు స్కూల్స్ కలిపి నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ రేడియో సర్వీస్‌ని ఉపయోగించుకుంటున్నాయి.
స్టూడెంట్ కంటెంట్
స్కూల్ రేడియో కోసం ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం దేశంలోని 150 స్కూల్స్‌కి మా రేడియో చేరింది. ఈ పాఠశాలల్లో విద్యార్థులే కార్యక్రమాల రూపకల్పన చేస్తారు. రేడియోని ఏ సమయాల్లో ప్రసారం చేయాలన్నది వాళ్ల చాయిస్. ఇరవై నాలుగు గంటలు ప్రసారం చేయాలా? కొన్ని గంటలా అన్నది వాళ్ల ఇష్టం. కొంతమంది వీకెండ్స్‌లో నడుపుతారు. కొంతమంది రోజులో కొంత సమయం మాత్రమే నడుపుతారు. వాళ్లకు ఇష్టమైనదే చేయాలని చెబుతాం. కాబట్టి నచ్చింది బ్రాడ్కాస్ట్ చేస్తారు. వీటిలో ఎక్కువగా వాళ్ల చుట్టూ ఉన్న సమస్యలే ఉంటాయి. నచ్చిన పాటలు ఎలాగూ పాడుకుంటారు. అడిగిన కథలు వినిపిస్తారు. అలాగే కొన్ని సామాజికాంశాలను ఎంచుకుంటారు. వీటిలో వాళ్ల జీవితాలపై ప్రభావం చూపే అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం, పర్యావరణం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, కాలుష్యం ఇలా వాళ్లు వింటున్నవి, చూస్తున్నవి చర్చిస్తారు. కార్యక్రమాల రూపకల్పన పిల్లలదే కాబట్టి సమాచార సేకరణ కోసం తల్లిదండ్రులు, టీచర్లతో మాట్లాడతారు. వాళ్లల్లో వాళ్లు చర్చించుకుంటారు. ఇంటర్నెట్, పుస్తకాల నుంచి సమాచారం సేకరిస్తారు. వాళ్ల దృష్టికి వచ్చిన సమస్యలకు పిల్లలు సామాజిక పరిష్కారం కనుగొంటారు. తనవంతుగా ఏం చేయాలో చెబుతారు. ఇలా నేర్చుకున్న అంశాన్ని జీవితంలోకి అన్వయించుకుంటారు. కంటెంట్ క్రియేటర్స్‌గా, బ్రాడ్ కాస్టర్స్గా మారిన పిల్లలు తర్వాతి కాలంలో చేంజ్ మేకర్స్‌గా ఎదిగే అవకాశాలు ఉంటాయి.
టాలెంట్ హంట్
పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు? టీచర్లు ఎలా నేర్పుతున్నారో పరిశీలిస్తాం. దానిని బట్టి స్కూల్ రేడియో ప్రోగ్రామ్ వర్క్ ఉంటుంది. అన్ని స్కూల్స్ ఒకేలా కార్యక్రమాలు ప్రసారం చేయవు. కొందరు పిల్లలు అంతగా చదవరు. అలాంటివారిని నేర్చుకోవడానికి బద్ధకం అని టీచర్లు, పేరెంట్స్ తిడుతుంటారు. పిల్లలకు ఇష్టమైనవి ఎక్స్ప్లోర్ చేయట్లేదు కాబట్టే వాళ్లకు చదువు మీద ఆసక్తి కలగట్లేదు. పిల్లలకు అనేక రంగాలపట్ల పరిచయం, అనేక విషయాలపట్ల అవగాహన కల్పిస్తే వాళ్లకు ఇష్టమైనదేదో బాగా చేస్తారు. వాళ్లకు ఏది ఇష్టమో మనకూ తెలుస్తుంది. స్కూల్ రేడియో కోసం పని చేస్తున్న సందర్భంలో పిల్లలకు కథలు, పాటలు, నాటకాలు, సంగీతం, కళలు, రాకెట్లు, కంప్యూటర్ నాలెడ్జ్, సైన్స్ విశేషాల పట్ల వాళ్లకు ఉన్న ఆసక్తిని బయటపడుతుంది. ఆర్ట్, క్రాఫ్ట్, ఆటపాటలు అవసరంలేదని పేరెంట్స్, టీచర్స్ భావిస్తున్నారు. కానీ, ఏఐ జనరేషన్‌కి కూడా అన్నీ అవసరమే. ప్రతి రంగంలో ఇమాజినేషన్, ఇన్నోవేషన్ ఏఐ కాలంలోనూ అందరికీ అవసరమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. కాబట్టి పిల్లల్ని ఇంకా ప్రోత్సాహించాలి. చాలామంది పిల్లలు ఉన్నత విద్య, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎదుర్కోవాలి. ప్రాజెక్ట్‌లలో పని చేయాలి. నలుగురితో కలిసి పని చేయడం తెలియని అమాయకత్వం ఉంటుంది. అది పోగొట్టేందుకు డిగ్రీ ఫైనల్ విద్యార్థుల కోసం స్కూల్ రేడియో ఉచితంగా ఒక ఆఫీస్‌లో ఎలా పని చేయాలని 45 రోజుల ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తున్నది.
ట్రాన్స్ఫామ్ జర్నీ
స్కూల్ రేడియో ద్వారా ఎంతోమంది పిల్లలు మాట్లాడేందుకు చొరవ చూపుతున్నారు. ‘స్లో లెర్నర్స్’ అని ముద్రపడ్డ వాళ్లు మా స్కూల్ రేడియో పరిచయం అయ్యాక చురుగ్గా ఉంటున్నారు. కొంతమంది వాళ్ల స్కూల్లో జరిగే ఈవెంట్స్‌కి యాంకర్స్‌గా పని చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదివిన విద్యార్థి స్కూల్ రేడియో కార్యక్రమాలు రూపొందించేవాడు. పెద్దయ్యాక.. ప్రభుత్వం నడిపే హ్యామ్ రేడియోలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. విజయవాడలో నేషనల్ ఉమెన్ పార్లమెంట్ సందర్భంలో స్కూల్ రేడియో పిల్లలు అయిదుగురు రిపోర్ట్ చేశారు. అనంత్ ఆకార్ అనే విద్యార్థి స్కూల్ రేడియో కోసం వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలు రూపొందించాడు. దాని కోసం కొంతకాలం అధ్యయనం చేశాడు. ఫీల్డ్ వర్క్ చేశాడు. స్కూల్ రేడియో ప్రజాస్వామిక విలువలు, చట్టాలకు లోబడి మాత్రమే పని చేస్తుంది. స్కూల్ రేడియో కోసం పనిచేయడం వల్ల అనంత్ సామాజిక అంశాలపట్ల అవగాహన పెంచుకున్నాడు. తన సొంత అభిప్రాయాలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రపంచానికి చెబుతున్నాడు. ఇలాంటి మార్పులెన్నో స్కూల్ రేడియోతో సాధ్యమయ్యాయి. మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను.
బెస్ట్ లెర్నింగ్
రేడియో కోసం పనిచేయడమూ చదువే. స్కూల్ రేడియో కార్యక్రమాల రూపకల్పన, సమాచార సేకరణ, ప్రసారం కోసం పిల్లలు కలిసికట్టుగా పని చేస్తారు. కార్యక్రమాల్లో ఏం మార్పులు చేయాలో అందరూ చర్చిస్తారు. ఇలా వాళ్ల ఆలోచనను రేడియో విస్తృతం చేస్తుంది. క్రియేటివిటీ బేస్డ్ లెర్నింగ్ పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. స్వయంగా చేయడం ద్వారా నేర్చుకున్నది ఎప్పుడూ మర్చిపోరు. ఎప్పుడూ మర్చిపోనిది ఉత్తమమైన విద్య. కాబట్టే చాలా పాఠశాలలు, కళాశాలలు ఈ రేడియోల నిర్వహణను ప్రోత్సాహిస్తున్నాయి….? నాగవర్ధన్ రాయల