అనన్య బిర్లా.. వయసు ఇరవై ఎనిమిది. హోదా.. డైరెక్టర్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటెయిల్ లిమిటెడ్. ఈ సరికొత్త నియామకం కార్పొరేట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బిర్లాల ప్రధాన వ్యాపారమంతా సిమెంట్, అల్యూమినియం చుట్టే తిరుగుతుంది. ఆ కీలక రంగాల్ని వదిలిపెట్టి ఫ్యాషన్ విభాగానికి సరికొత్త సారథిని ప్రకటించడం ఓ రకంగా అసాధారణ నిర్ణయమే. వ్యూహాత్మకం కూడా. ‘అనన్య నేటితరం అమ్మాయి. కొత్తతరం బిజినెస్ మోడల్స్ తనకు కొట్టినపిండి.
తన ఐడియాస్తో బిర్లా గ్రూప్లో కొత్త ఉత్సాహం తీసుకొస్తుంది’ అంటారు ఆమె తండ్రి, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా. పదిహేడేండ్ల వయసులోనే అనన్య ‘స్వతంత్ర మైక్రో ఫైనాన్స్’ను స్థాపించి తనదైన ఆంత్రప్రెన్యూర్షిప్ యాత్రకు మార్గం సిద్ధం చేసుకుంది. తను మంచి గాయకురాలు, గేయ రచయిత్రి. గిటార్, పియానో, సంతూర్ వాద్యకారిణి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంది. ‘వ్యాపారం అంటే.. లాభాలు, బ్యాలెన్స్ షీట్ మాత్రమే కాదు. సమాజంలో మార్పునకు ఇదో మార్గం. ఒక బాధ్యత కూడా’ అంటారామె.