విలేజ్ రాక్‌స్టార్స్.. ఈ సినిమా పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆస్కార్ అవార్డు కోసం మన దేశం తరఫున అధికారిక ఎంట్రీ పొందిన చిత్రం ఇది. ఆ హోదాను సాధించిన తొలి అస్సామీ సినిమ కూడా. ఆస్కార్ తప్పినా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఈ సినిమాకు కథ, దర్శకత్వం, నిర్మాణం, ఎడిటింగ్, ఛాయాగ్రహణం.. ఒకటేమిటి సకల బాధ్యతలూ నిర్వర్తించారు రీమాదాస్. తన బహుముఖ ప్రజ్ఞ వెండితెరకే పరిమితం కాలేదు. చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని సమాజం దృష్టికి తీసుకెళ్లడంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు రీమా.
అసోంకు చెందిన రీమా ఓసారి హైవే మీద ప్రయాణిస్తుండగా.. అటూ ఇటూ పెద్దపెద్ద పురాతన వృక్షాలు కనిపించాయి. వాటికి వేసిన గుర్తుల్ని చూడగానే.. కొట్టేయబోతున్నారేమో అనే అనుమానం కలిగింది. వెంటనే సామాజిక మాధ్యమాల్లో తన ఆందోళన పంచుకున్నారు. రీమా అనుమానం నిజమే అయ్యింది. జాతీయ రహదారి విస్తరణ కోసం సర్కారు వాటిని కూల్చేయడం మొదలుపెట్టింది. దీంతో రీమా మరింత దూకుడుగా వ్యవహరించారు. ఆ గొంతుకకు మరిన్ని స్వరాలు తోడయ్యాయి. ఆందోళన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వరకూ చేరింది. ఆ సంస్థ విచారణ మొదలుపెట్టింది. వృక్షాలకు గండం తప్పింది. రీమా కృషికి ఫలితం దక్కింది.