బచ్చన్నపేట, ఫిబ్రవరి 13 : ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ స్వయంభు సిద్దులగుట్ట సిద్దేశ్వర ఆలయ శివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. స్వాగత తోరణాలు, ఆలయ గోపురం, కొండపైన విరజిమ్మే విద్యుత్ దీపాలంకరణ కాంతుల మధ్య సిద్ధుల గుట్ట ఆలయం శోభాయమానంగా మారింది. హర హర శంభో శంకర హర్ష ధ్వనాలతో మార్మోగుతోంది.
మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు..
స్వయంభూ సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు పాత పాలక మండలి పదవీ బాధ్యతలు లేకున్నా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం గంగపూజ రిత్వికరణం, ఆవాహన దేవత పూజలు, పంచామృత శత రుద్రాభిషేకం, మంగళ హారతి మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిగాయి. శనివారం మహన్యాస పూర్వ క రుద్రాభిషేకం, బిల్వార్చన, మంగళ హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, రుద్ర హోమం, శత రుద్రాభిషేకం,మంగళహారతి, మంత్రపుష్పం, తీర్చప్రసాద విని యోగ కార్యక్రమాలు జరగనున్నాయి.
15 న ఆదివారం మహాశివ రాత్రి ప్రాంత కాలం మహన్యాస రుద్రా భిషేకం, సామూహిక రుద్రాభిషేకం దిష్టి కుంభం భద్రకాళి వీరభద్ర స్వామి ఆహ్వానం, బియ్యం సుంకు, శివ కళ్యాణం. లింగోద్భవ పూజ అగ్ని గుండం ప్ర జ్వలన చేపడుతారు. 16న సోమవారం అష్టదిక్పాలక పూజ, బలిహరణ, అగ్ని పూజ, అగ్నిగుండ ప్రవేశం, గెలుపు ఆశీర్వాదం పూజలు జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు..
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న భక్తులకు క్యూ పద్ధతిన శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నేరుగా దర్శనం చేసుకోవడానికి వీలుగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు మండల వైద్యాధికారులు తెలిపారు. ఇక విద్యుత్ తాగునీరు ప్రత్యేక గదులు స్నానపు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ తెలిపారు.