హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఉద్యమకారుడనుకొని ఓ సర్పంచ్‌ను పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించిన ఘటన అసెంబ్లీ వద్ద నవ్వులు పూయించింది. నిరసనకారులతోపాటు వచ్చిన ఓ కాంగ్రెస్ సర్పంచ్‌ను పోలీసులు మడతపెట్టి వ్యాన్‌లో కుక్కేశారు. దీంతో ఆయన ‘నేను కాంగ్రెస్ సర్పంచ్నురా అయ్యా’ అని లబోదిబో నోరు కొట్టుకోవడం అక్కడున్న మీడియాను ఆకర్షించింది. విద్యార్థులకు సాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మంగళవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టింది.
ఇలా ముట్టడించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే సమయంలో అటువైపు వచ్చిన మానకొండూరులోని రేపాక గ్రామ సర్పంచ్ కాత మల్లేశంను కూడా బలవంతంగా వ్యాన్ ఎకించడంతో.. ‘మేం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లంరా అయ్యా. మమ్మల్ని రమ్మని మానకొండూరు ఎమ్మెల్యే పాస్‌లు ఇచ్చిండు. మేం కాంగ్రెస్ పార్టీ వాళ్లం’ అని ఆరవడంతో పోలీసులు కిందికి దించారు.