అడ్డగోలు లీకులు.. అబద్ధాల రాతలు.. పదేండ్లు దాటినా తెలంగాణపై అదే కుట్ర
అడ్డగోలు లీకులు.. అబద్ధాల రాతలు. విచక్షణ మరిచి తాము నమ్మిందే నిజమని ప్రజలతో నమ్మించే యత్నం. పదేండ్లు దాటినా తెలంగాణపై అదే కుట్ర. ఒడవని కుట్రల ముచ్చట. ఛత్తీస్‌గఢ్‌తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు ఒప్పందంపై పచ్చ పత్రికలు అచ్చొత్తే అక్షరాలు ‘ఆంధ్ర’ అవశేషాలకు నిలువెత్తు సాక్ష్యాలు.
- ప్రభుత్వ వాట్సాప్ సందేశమే కొన్ని పత్రికలకు బ్యానర్
- ధ్రువీకరించుకునేది లేదు.. వాస్తవాలు చూసేది లేదు
- వండి వార్చిన అబద్ధాలే పతాక శీర్షికల్లో ప్రత్యక్షం
- ప్లాంటెడ్ న్యూస్‌కి వేదికగా మారిన తెలుగు జర్నలిజం
- సర్కారీ ప్రాపకం కోసం పణంగా విశ్వసనీయత
- ఏ వార్త ఎక్కడ పెట్టాలో దిశ చూపుతున్న వైనం
అడ్డగోలు లీకులు.. అబద్ధాల రాతలు. విచక్షణ మరిచి తాము నమ్మిందే నిజమని ప్రజలతో నమ్మించే యత్నం. పదేండ్లు దాటినా తెలంగాణపై అదే కుట్ర. ఒడవని కుట్రల ముచ్చట. ఛత్తీస్‌గఢ్‌తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు ఒప్పందంపై పచ్చ పత్రికలు అచ్చొత్తే అక్షరాలు ‘ఆంధ్ర’ అవశేషాలకు నిలువెత్తు సాక్ష్యాలు.
ఎక్కడున్నావ్ శనీ అంటే ఎనకే ఉన్నా అన్నాడట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమై దోపిడీదారులైన సమైక్యపాలకులను కరకట్టలకు తరిమేసిందిగానీ ఆ పాలకులు పెంచి పోషించిన శనిగ్రహాల్ని పదేండ్లు దాటినా వదిలించుకోలేకపోతున్నది. పచ్చ తోరణం కట్టిన నట్టింట్లో ఉప్పలం మొలిసి దాన్ని పనికి రాకుండా చేసినట్టు.. పచ్చపత్రికలు తెలంగాణను సర్వనాశనం చేసేదాక వదిలేలా లేవు.
తెలంగాణకు సంబంధించి గత పదేండ్లలో సాధించిన ఏ విజయాన్నీ ఏనాడూ అంగీకరించని పచ్చ మీడియా, ఇవాళ గాలివాటుగా అధికారం చేపట్టిన ప్రభుత్వం చేసే దుష్ప్రచారాలను నెత్తికెత్తుకొని శిగమూగుతున్నది. గత ప్రభుత్వ ఘనతలన్నింటి మీదా బురద చల్లడమే గాలివాటు ప్రభుత్వం విధానంగా పెట్టుకుంటే దాన్ని అచ్చోసి ప్రచారం చేయడమే కర్తవ్యంగా కొమ్ముకాస్తున్నది.
ఇక్కడ జర్నలిజం లేదు. నైతికత లేదు. మానవత కూడా లేదు. కేసీఆర్ మీద బురద చల్లడం, రాజకీయంగా ఆయన అడ్డు లేకుండా చూసుకోవడం ఏకైక లక్ష్యంగా పచ్చపత్రికలు రెచ్చిపోతున్నాయి.
(ఎస్జీవీ శ్రీనివాస రావు) : కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఓ కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. దాని పేరు లీకు కథనాలు. ఎవరు చెప్పారు? అనేది ఉండదు. ఏ ఆధారం ఉంది? అనేది ఉండదు. ఎవరు బాధ్యత వహిస్తారు? అనేది కూడా ఉండదు. అవి ప్రభుత్వం ఇచ్చే అధికారిక ప్రకటనలు కాదు. పోనీ ఎంక్వైరీ సంస్థలు ఇచ్చే ప్రెస్ నోట్లు లేదా బ్రీఫింగ్‌లు కాదు. అజ్ఞాత వ్యక్తులు పొద్దంతా వండీవండీ రాత్రి వాట్సాప్ ద్వారా పంపే ఈ లీకు సందేశాలు తెల్లారి పచ్చపత్రికల పతాక శీర్షికల్లో వేలాడుతాయి. పెద్ద పెద్ద పత్రికలన్నీ ఎప్పుడైనా ఎవరికి వారు తమతమ బాణీలో పతాక శీర్షికలకు సొంతంగా కథనాలు సిద్ధం చేసుకుని వేసుకుంటాయి.
ఇందులో ఒకరితో ఒకరు పోటీ పడి మరీ తమ పత్రికే బాగా ఇచ్చిందని తపన పడతాయి. కానీ ఇపుడేమిటి? అన్ని పత్రికల్లో ఒకే కథనం. ఒకే డాటా. ఒకే ప్రయారిటీ. విచిత్రంగా లేదూ! భారతదేశం మొత్తం అన్ని భాషల్లో వెతికివెతికి చూసినా ఇలాంటి ధోరణి ఎక్కడా కనిపించదు. అన్నింటికన్నీ టార్గెట్ చేసేవి కేసీఆర్‌ను. ఆయన పదేండ్ల పాలనను. అవి కాళేశ్వరం కథలు కావచ్చు. ఫోన్‌ట్యాపింగ్ కథనాలు కావచ్చు. కొత్తగా వచ్చిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల కథనాలు కావచ్చు. గమ్మత్తుగా ఈ లీకు వార్తలు పచ్చ పత్రికలకు మాత్రమే అందుతాయి.
ఏమిటీ దౌర్భాగ్యం?
వాస్తవానికి టీడీపీ పుట్టాక చెడిపోయాయి గానీ ఇందులో ఒక్కో పత్రికకు దశాబ్దాల చరిత్ర ఉంది. రాజకీయాల చరిత్రను మలుపు తిప్పిన ఘనత ఉంది. ఉద్యమాలను ఉరికించిన అనుభవం ఉంది. నరమానవుడు అడుగే పెట్టలేని గాలి గనుల కుంభకోణాలను సైతం తవ్వి పోసిన అత్యంత సమర్థులైన జర్నలిస్టులున్నారు.
ఏ అంశాన్నైనా అద్భుతంగా విశ్లేషించగల మేధావులు సంపాదకులుగా ఉన్నారు. మరి ఈ లీకుల దరిద్రమేంటి? వాట్సాప్‌లో వచ్చే లీకుల మీద పతాకశీర్షికలు రాసుకునే గతి ఏంటి? పత్రికలన్నీ ఒకే కథనాన్ని ఒకే రోజు వేసి తరించిపోవడమేమిటి? నాలుగు ప్రకటనలకోసం ఎంగిలిమెతుకులు ఏరుకుని తినే దౌర్భాగ్యమేంటి? రానురాను రాజుగారి గుర్రం చందంగా మారిపోవడమేంటి? సిగ్గనిపించడం లేదూ! మన బుర్రలు పక్కన పెట్టి ఎవడో తలకుమాసిన వెధవ ఏదో వండి పంపితే అదేదో దేవుడి ప్రసాదంలా కళ్లకద్దుకుని వేసుకోవడమేమిటి? పోనీ వేసుకునే ముందు కనీసం బుర్ర పెట్టి అందులో లాజిక్ ఉందా? లేదా? అనేది కూడా చూడలేని దుస్థితి ఏమిటి? పోనీ అదేమన్నా ప్రభుత్వ అధికారిక ప్రకటనా అంటే అదీ కాదు. కమిషన్ నుంచి వచ్చిన సమాచారమా? అంటే అదీ కాదు.
పోనీ జెన్కో అధికారి, ఈఆర్సీ అధికారి లేదా విద్యుత్తు సంస్థ బాధ్యుడు ఇచ్చిన ప్రకటనా కాదు. అయినా సరే.. కేసీఆర్‌ను తిడితే చాలు అచ్చొత్తేయడమే. వచ్చిన సమాచారంలోని వాస్తవాలేమిటనే వెరిఫికేషన్ ఉండదు. బుర్రలను టేబుల్ డ్రాలో పెట్టేస్తున్నారా? లేక పక్కన చెత్తబుట్టలో పారేస్తున్నారా? అర్థం కాదు. మంది బుర్రలతో ఆలోచించే ఈ ఖర్మ ఏంటి? మేమే వీరులం శూరులం అంటారు. దేశంలోనే నంబర్ వన్లు అంటారు. అవార్డులు వస్తే పళ్లికిలిస్తూ అందుకుంటారు. దమ్ము దుమ్మూ అంటారు. ఆచరణకొస్తే చేసేది వాట్సాప్ జర్నలిజమా? లీకులిచ్చి రాయించే వార్తలను ఇదివరకు ప్లాంటెడ్ న్యూస్‌గా పరిగణించేవారు. ఇలాంటివి వేసే ముందు జర్నలిస్టులు, సంపాదకులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునేవారు. ప్లాంటెడ్ న్యూస్ వేస్తే పత్రిక విశ్వసనీయతకు భంగం వాటిల్లి ప్రతిష్ఠ దెబ్బ తింటుందేమో అన్న వెరపు వారిలో ఉండేది. ఒకవేళ తప్పనిసరై వేయాల్సి వచ్చినా ఆ ప్లాంటెడ్ న్యూస్ ప్రతివాదుల ప్రతిస్పందనను కూడా తీసుకొని ‘నిష్పాక్షికంగా’ ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేసేవారు. న్యూస్ పేపర్లు వ్యూస్ పేపర్లయ్యాయి కనుక బట్టలిప్పి బరివాతల ఊరేగడానికి సిగ్గెందుకన్నట్టున్నది వ్యవహారం.
వాటీజ్ యువర్ బ్యానర్?
ఏ పాత్రికేయుడైనా రాత్రివేళ పక్క పత్రికకు చెందిన జర్నలిస్టుతో మాట్లాడితే అడిగే మొదటి మాట ఇదే. వాళ్లేం పెడుతున్నారో? అనే ఆసక్తి. మనం ఏమైనా వెనుకబడుతున్నామా? అనే అనుమానం. ఇదీ వాస్తవంగా జర్నలిస్టుల సమూహం ఆలోచించే.. ఆలోచించాల్సిన తీరు. జర్నలిజం జర్నలిజంగా నిండుగా వర్ధిల్లే చోట జరగాల్సిన సంభాషణ. కానీ ఇవాళ మీ పత్రికలకు ఆ పరిస్థితి ఉందా? అదిపోయి ‘వాట్సాప్ వచ్చిందా? మీరెన్ని కాలమ్‌లు పెడుతున్నారు?’ అనే మాట్లాడుకోవాల్సిన దరిద్రం. బ్యానర్ రాయాల్సిన జర్నలిస్టు మెటీరియల్ అంతా సిద్ధంగా ఉన్నా…‘వాట్సాప్‌లో ఏమైనా వస్తుందేమో?’ అనుకునే
డోలాయమాన స్థితి! ఎక్కడికి
దిగజారిపోయారు?! కాకి లెక్కలు.. లేకి కథనాలు!!
తెలంగాణలో ఏం జరుగుతోంది? బురద చల్లడం అనే బ్లేమ్ గేమ్ ఒక్కటే నడుస్తున్నది. కొత్త ప్రభుత్వం వచ్చి అర్ధ సంవత్సరం పూర్తయింది. ఆరు గ్యారెంటీల జాడ లేదు. అమలు చేస్తారని ప్రజలూ నమ్ముతున్నట్టూ లేరు. ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఒక విధానం, ఒక శైలి ఉన్నట్టు లేదు. తమ పాలనతీరు ఇదీ అనిపించే మార్కు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఒక్క సంస్కరణా లేదు. గొప్పగా చేస్తున్నారు అనిపించుకున్న మంత్రీ ఒక్కరూ లేరు. ఒక్కటంటే ఒక్కటైనా కొత్త పథకం అమల్లోకి రాలేదు. రాజకీయ స్థిరత్వం ఉందో లేదో ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. కాలంతో పాటు కదిలినట్టు ఏదో ధర్మం మీద పాలన నడుస్తున్నది.
ఇసుక నుంచి బూడిద దాకా
కుంభకోణాలు లంబకోణాలు ఒక్కటొక్కటిగా ఇపుడిపుడే బయటకు వస్తున్నాయి. చెప్పుకునేది ఏమీ లేనపుడు ఎదుటి వాడిని చెరపడమే తక్షణ కర్తవ్యం అనేది రాజకీయ నానుడి. అదే ఇపుడు తెలంగాణలో నడుస్తున్నది. ఇందులో భాగంగా బ్లేమ్‌గేమ్ అనే బండిని పచ్చపత్రికలు అనే ఎద్దులు భుజాన వేసుకొని లాగుతున్నవి.
నకల్ కొట్టడానికైనా అకల్ ఉండాలనేది తెలంగాణ సామెత. బురద చల్లాలనుకుంటే సరిపోదు. వర్తమాన సమాజపు ఆలోచనా స్థాయి, విశ్లేషణాస్థాయి కూడా తెలిసి ఉండాలి. అవి లోపిస్తే చల్లాలనుకున్న బురద మనమీదే వచ్చిపడుతుంది. కాళేశ్వరంతో మొదలైన లీకుల పరంపర ఆ తర్వాత కొంతకాలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ లాక్కొచ్చారు. అవీ బోర్ కొట్టిందేమో ఈసారి విద్యుత్తు ఒప్పందాల మీద పడ్డారు. ఏమైంది? కాళేశ్వరంలో ఎంత గొంతు చించుకున్నా.. ఎన్ని వేల టన్నుల న్యూస్ ప్రింట్ తగలెట్టుకున్నా చివరికి అంతా తేలిపోయింది.
పిల్లర్ల మరమ్మతులు, డ్రౌటింగ్ పనులతో శుభం కార్డు పడింది. తర్వాత కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్‌లు అంటూ కథనాల సీరియల్ నడిపారు. మరీ ఎక్కువవుతుందేమో అని డౌట్ వచ్చిందేమో. మళ్లీ కొత్త కథ వెతుక్కుని విద్యుత్ కొనుగోళ్ల మీద పడ్డారు. కేసీఆర్ జైలుకే అన్నారు. అవినీతి జరిగిందని బట్టలు చింపుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ విడుదల చేసిన 12 పేజీల బహిరంగ లేఖతో సీన్ రివర్సయింది. లీకు వీరులు, బోకు వీరులు చేసిన ప్రతి ఆరోపణను పూర్తి వివరాలతో తిప్పికొడుతూ ఇచ్చిన ఆ సమాధానంతో అందరి గొంతులు ఎండుకుపోయి నోళ్లూ మూతపడ్డాయి. ‘అన్న వస్ర్తాలకు పోతే ఉన్న వస్ర్తాలు ఊడిన చందంగా’ మారడంతో ఇక గోచీ సంరక్షణార్థం మరో వాట్సాప్ కథనం వదిలారు. ఆకుకు పోకకు అందని ఆ కథనాన్ని పచ్చ పత్రికలు యథావిధిగా తలదాల్చి అచ్చేశాయి.
బర్రలా.. తాంబుర్రలా?
అందులో ఏమున్నది? కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌నుంచి యూనిట్‌కు రూ.3.90 చొప్పున 17,966 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలు చేసి రూ.7,719 కోట్లు చెల్లించింది. కానీ ట్రాన్స్మిషన్ చార్జీలు కలుపుకొంటే యూనిట్ రూ. 5.64 అయింది. దానివల్ల డిస్కమ్‌లు రూ. 6 వేల కోట్లు నష్టపోయాయి అన్నది సారాంశం. చాలా విచిత్రం. యూనిట్‌కు రూ.3.90 ఎక్కువ కాదు, న్యాయమే అంటారు. అందుకు చెల్లించింది రూ.7,719 కోట్లు. ట్రాన్స్మిషన్ చార్జీలతో కలిపి మొత్తం ఖర్చు రూ.9 వేల కోట్లు అయినపుడు, అందులోంచి న్యాయబద్ధమైన రూ.7,719 కోట్లు తీసేస్తే రూ. 6వేల కోట్ల నష్టం ఎలా వచ్చింది? ఏ లెక్కతో దాన్ని నిర్ధారించారు? అదే సమయంలో తెలంగాణకు 24 గంటల కరెంటు ఎలా వచ్చినట్టు? మరి దండుగమారి ఒప్పందమే అయితే, అది నష్టదాయకమే అయితే ఈ కరెంటు ఇంత పుష్కలంగా ఎక్కడినుంచి వచ్చినట్టు?
గాల్లోంచి వస్తదా?
ఇక వీలింగ్ చార్జీల అంశం. ఇది మరీ విచిత్రం. 2003 కేంద్ర విద్యుత్తు చట్టం ప్రకారం దేశంలో ఎక్కడ ఏ అంతర్రాష్ట్ర విద్యుత్తు ఒప్పందం జరిగినా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అనుమతి తప్పనిసరి. ఈ విధానం నాటి ఎన్డీఏ ప్రభుత్వమే తెచ్చింది. అలాగే ఏ రాష్ట్రంనుంచి అయినా విద్యుత్తును తెచ్చుకోవడానికి పీజీసీఐఎల్‌ను బుక్ చేసుకోవాలంటే ట్రాన్స్మిషన్ లైన్ చార్జీలు చెల్లించాల్సిందే. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇది తప్పనిసరి. ఈ ట్రాన్స్మిషన్ ఖర్చులను ఒప్పందం ఖర్చుల్లో చూపడం మూర్ఖత్వం. పోనీ దేశంలో ఏ రాష్ట్రమైనా పక్క రాష్ట్రంనుంచి ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా కాకుండా గాల్లోంచి కరెంటు అందుకుంటున్నదా? బుర్ర ఉన్నవాడెవడైనా దాన్ని కరెంటు కొనుగోలు ఖర్చులో కలుపుతాడా? ఇంకా నయం వార్ధా-డిచ్పల్లి లైన్ ఖర్చు, రాష్ట్రమంతా కొత్తగా వేసిన లైన్లు, ఏర్పాటు చేసిన వేలాది సబ్స్టేషన్ల ఖర్చు, ఉద్యోగుల జీతాలు కూడా ఇందులో కలపలేదు. బతికిపోయాం!
అవసరమైతే ఎంతకైనా?
పచ్చ పత్రికలు చాలా తెలివిగా కొన్ని విషయాలు మరుగున పెడతాయి కానీ 2014 వానాకాలంలో దేశంలో ఎక్కడా విద్యుత్ అందుబాటులో లేనపుడు ఈ తెలంగాణ రాష్ట్రమే తమిళనాడు నుంచి రూ. 5.14కు యూనిట్ చొప్పున విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఏపీలో సర్కారుకు ఇంతకన్నా ఎక్కువ రేటుకు విద్యుత్ కొనాల్సి వచ్చింది. దానితో పోలిస్తే ఛత్తీస్‌గఢ్ ఒప్పందం ఎంత చవక? ఎంత లాభదాయకం? అయినా విద్యుత్తు అనేది ఒక సామాజికావసరం. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
నాడు రాక్షసానందం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు రాష్ట్రంలో కరెంటు లేక పంటలు ఎండి రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నపుడు ఒక్కో ఆత్మహత్యకు ఒక్కోనంబర్ వేసి పచ్చపత్రికలు రాక్షసానందం పొందాయి. అనారోగ్యం వల్ల చనిపోయిన రైతు మరణాన్ని కూడా కరెంటు కోతలతో పంటలెండిన మరణాలకు అంటగట్టి వరుస కథనాలతో కసి తీర్చుకున్నాయి. ఆ రాక్షసానంద చర్యలే.. ‘తెలంగాణకు కావలిసినంత కరెంటు కాదు.. 24 గంటల కరెంటు కావాలని’ తెలంగాణ ప్రభుత్వం ఒక శపథాన్ని తీసుకునేందుకు ప్రేరేపించాయి. ఆరు నెలల కాలంలో పచ్చమూక తెల్లముఖం వేసేలా విద్యుత్తు విజయాన్ని సాధించి చూపేలా చేశాయి. ఇందుకోసం నాడు కేసీఆర్ చేసిన కృషి మామూలు విషయం కాదు.
ఆనాడు తెలంగాణకు నేషనల్ గ్రిడ్‌తో విద్యుత్తు కనెక్టివిటీ లేదు. నాడు కేంద్రంతో ఉన్న సఖ్యతను వినియోగించుకొని వార్ధా- డిచ్పల్లి లైన్ నిర్మాణ పనులను వేగిరం చేశారు. తెలంగాణలో దానికి కావలసిన భూసేకరణ, ఇతర అనుమతులు, నిర్మాణ పనులను ఉరికించారు. అయితే మహారాష్ట్రలో మనం ఏం చేయలేని స్థితి. నాడు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌రావుతో ఉన్న అనుబంధాన్ని వినియోగించుకొని అక్కడ భూసేకరణ, నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు.
ఆ లైన్ సాధనలో విద్యాసాగర్‌రావు అందించిన సహకారం కూడా ఎన్నదగింది. అంతేకాదు ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు ఒప్పందం ఆషామాషీగా జరగలేదు. అనేకసార్లు మంతనాలు జరిగిన తర్వాత కుదిరింది. విద్యుత్తు చార్జీల తగ్గింపు విషయంలో కూడా కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారు. ఆ తర్వాతే యూనిట్ చార్జీలపై ఒప్పందం కుదిరింది. ఇక వాట్సాప్ కథనంలో మరో ఆరోపణ అదనంగా మరో వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ బుక్ చేయడం వల్ల నష్టం వచ్చిందన్నది. వాస్తవానికి ఆ కథనంలో దానికి సమాధానం కూడా ఉంది.
ఓవైపు మరో వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ దండగ అన్న వారే.. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం ప్రకారం ఎప్పుడూ వెయ్యి మెగావాట్లు ఇవ్వలేదని రాశారు. అదే నిజం. తెలంగాణలో ఆనాటి అవసరాలకు వెయ్యి మెగావాట్లు సరిపోవు. పైగా తక్కువ రేటుకే ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు దొరుకుతుంది కాబట్టి ఇంకో వెయ్యి మెగావాట్లకు ట్రాన్స్మిషన్ కోసం ముందు జాగ్రత్తగా బుక్ చేసుకున్నారు. అయితే వాట్సాప్ కథనకారుడు చెప్పినట్టు ఛత్తీస్‌గఢ్ ఒప్పందంలో ఉన్న మేరకు వెయ్యి మెగావాట్లే సరిగా ఇవ్వలేక పోయింది. దానితో రెండో వెయ్యి మెగావాట్లకు ట్రాన్స్మిషన్ ఒప్పందం రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
‘ఛత్తీస్‌గఢ్ ఒప్పందానికి ఈఆర్సీ తుది ఆమోద ముద్ర వేయలేదు. ఈఆర్సీ ఆమోదం లేదు కాబట్టి ఈ చెల్లింపులు అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాలి’ అనేది మరో ఆరోపణ. వాస్తవమేమంటే మధ్యంతర ఉత్తర్వు మాత్రమే ఉందనేది పచ్చ పత్రికల దింపుడుకళ్లెం ఆశ. అయితే ఈఆర్సీలో మధ్యంతరం, తదనంతరం, జన్మాంతరం అంటూ ఉండవు. ఎప్పుడు ఏ ఉత్తర్వు ఇస్తే అదే ఫైనల్. ఇదే విషయాన్ని ఈఆర్సీ స్పష్టం చేసింది కూడా! ఇది పక్కన పెట్టినా ప్రస్తుత సీఎం, నాటి టీడీపీ నాయకుడు ఈ ఒప్పందం మీద అప్పుడే ఈఆర్సీకి లేఖ రాశారు. ఫిర్యాదు చేశారు. వాదనలకు హాజరై తన వాదన వినిపించారు. ఈఆర్సీ ఆ వాదనలు తోసిపుచ్చి తీర్పు చెప్పింది. అభ్యంతరాలుంటే అప్పిలేట్‌కు పోవాలి. కానీ రేవంత్ పోలేదు. అక్కడితో ఆ వివాదం ముగిసిపోయింది. ఆనాడు ఈఆర్సీ ఇచ్చిన తీర్పే అంతిమమైంది. ఈ వాదనలు, వివాదాలు అన్నీ ఈ పత్రికలన్నీ అప్పట్లో అచ్చొత్తినవే. వాళ్ల కూ ఈ విషయాలు తెలుసు. అయినా లీకులను కొట్టేయలేని దైన్యం ఏదో వెంటాడుతున్నట్టుంది.
ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు
గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు ఒప్పందాలన్నీ ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థల మధ్య జరిగినవే. ఇందులో అవకతవకలకు అవినీతికి తావే లేదు. వాస్తవానికి 2014లో కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆయనను కలిసి విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆనాడు తెలంగాణలో తీవ్ర విద్యుత్తు కొరత ఉండడంతో విద్యుదుత్పత్తికి అనుమతి వస్తే తమ పంట పండినట్టేనని వారి ఆశ. అయితే కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థలకు తప్ప ప్రైవేటుకు విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పారు.
అలాగే విద్యుత్ కొనుగోళ్ల విషయంలోనూ అదే విధానం పాటించారు. విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కే ఇచ్చారు. పక్క రాష్ట్రంలో సింహభాగం ప్రైవేటు రంగానికే ఇచ్చారు. బాబు, వైఎస్ హయాంలలో విద్యుత్ ఒప్పందాలు ముక్కున వేలేసుకునే స్థాయిలో ఉన్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్లాంట్లతో కుదిరిన ఒప్పందాల ప్రకారం గ్యాస్ కేటాయింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. నిర్ణీత సమయంలో గ్యాస్ కేటాయింపు జరగకపోయినా జరిగినట్టే భావించి రానందువల్ల వచ్చే నష్టాలను ప్రభుత్వమే చెల్లించాలి. ఇదీ నాటి పాలకుల విద్యుత్తు విధానం. చంద్రబాబు హయాంలో ప్రైవేట్ విద్యుత్తు ఒప్పందాలు జరిగితే అది అభ్యుదయం, నాణ్యమైన కరెంటు, సంస్కరణ, అభివృద్ధి అంటూ ఈ పచ్చ పత్రికలే ప్రచారం చేశాయి. ప్రైవేటు పొడ కూడా సోకని తెలంగాణ విద్యుత్తు ఒప్పందాలపై మాత్రం అవినీతి, దుబారా, లాస్ అంటూ విషం కక్కుతున్నాయి.
విద్యుత్తును ప్రైవేటుకిస్తే..
విద్యుత్తును ప్రైవేటుకు ఇస్తే ఏం జరుగుతుంది? మన దేశంలోనే ఉదాహరణలున్నాయి. ఢిల్లీ రాష్ర్టానికి సీఎంగా షీలా దీక్షిత్ ఉన్న సమయంలో విద్యుత్ పంపిణీని ప్రైవేటు రంగానికి ఇచ్చారు. యూనిట్‌కు ఇంత అనే ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ఏడాదంతా అదే రేటు వసూలు చేయాలి. అయితే సదరు సంస్థ వర్షాకాలంలో విద్యుత్ చవకగా లభించే కాలంలో కరెంటు పుష్కలంగా ఇచ్చేది. ఎండాకాలం విద్యుత్ ఖరీదు కాబట్టి తీవ్రమైన కోతలు విధించేది. ఎందుకంటే ఎక్కువ ధరకు కొని ఒప్పందంలో ఉన్న రేటు మాత్రమే వసూలు చేయాలి కాబట్టి. దీని ఫలితం మూడుసార్లు వరుసగా గెలిచిన షీలాదీక్షిత్ ఆ తర్వాత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
మరి లాభాల మాటేమిటి?
మంచో చెడో కేసీఆర్ 24 గంటల కరెంటు తెచ్చాడు. ఇచ్చాడు. ఇది ప్రజలందరి అనుభవంలో ఉంది. రూ.6 వేల కోట్ల నష్టం అంటూ రంకెలేస్తున్న ఈ పచ్చమూకలు తెలంగాణ దశను ఆ 24 కరెంటు ఏ రకంగా మార్చిందో మాత్రం చెప్పరు. అవును ఈ నిరంతర కరెంటు వల్లనే తెలంగాణ దేశంలో పంజాబ్‌ను తలదన్నే ధాన్యం పండించగలిగింది. ఈ నిరంతర విద్యుత్తు వల్లనే లిఫ్టులు నిరంతరం పనిచేసి చెరువులు నింపి పంటపొలాలకు నీళ్లందించాయి. చెరువుల్లో చేపల పంటను పెంచాయి.
నిరంతర విద్యుత్తు వల్లనే రోజూ ఒకపూట, అరపూట
నడిచిన పరిశ్రమలు కాలం చాలనంతగా మూడు షిప్టుల్లో పనిచేసి రాష్ట్ర జీడీపీని పెంచాయి. వేతనాలు కూలీల రూపంలో లక్షలమంది కార్మికులకు కడుపునిండా తిండి పెట్టాయి. ఈ నిరంతర విద్యుత్తు వల్లనే హైదరాబాద్‌కు ప్రముఖ కంపెనీలన్నీ
క్యూ కట్టాయి.
ఐటీ ఎగుమతులు వేల కోట్లనుంచి లక్షల కోట్లకు పెరిగాయి. ఈ విద్యుత్తు వల్లనే జనరేటర్లు, ఇన్వెర్లర్లకు వ్యాపారసంస్థలు వీడ్కోలు పలికాయి. ఆఖరుకు ఈ విద్యుత్తు వల్లనే మీ పత్రికల ప్రింటింగ్ యూనిట్లకు డీజిల్ ఖర్చులు మిగిలాయి. అవన్నీ మీకు అనుభవంలో ఉన్నవే కదా? కాదనగలరా! కాళేశ్వరంతో మొదలైన లీకుల పరంపర ఆ తర్వాత కొంతకాలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ లాక్కొచ్చారు. అవీ బోర్ కొట్టిందేమో ఈసారి విద్యుత్తు ఒప్పందాల మీద పడ్డారు. ఏమైంది? కాళేశ్వరంలో ఎంత గొంతు చించుకున్నా.. ఎన్ని వేల టన్నుల న్యూస్ ప్రింట్ తగలెట్టుకున్నా చివరికి అంతా తేలిపోయింది. పిల్లర్ల మరమ్మతులు, డ్రౌటింగ్ పనులతో శుభం కార్డు పడింది. తర్వాత కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్‌లు అంటూ కథనాల సీరియల్ నడిపారు.
యూనిట్‌కు రూ.3.90 ఎక్కువ కాదు, న్యాయమే అంటారు. అందుకు చెల్లించింది రూ.7,719 కోట్లు. ట్రాన్స్మిషన్ చార్జీలతో కలిపి మొత్తం ఖర్చు రూ.9 వేల కోట్లు అయినపుడు, అందులోంచి న్యాయబద్ధమైన రూ.7,719 కోట్లు తీసేస్తే రూ. 6వేల కోట్ల నష్టం ఎలా వచ్చింది? ఏ లెక్కతో దాన్ని నిర్ధారించారు?
2014లో కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆయనను కలిసి విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుదుత్పత్తికి అనుమతి వస్తే తమ పంట పండినట్టేనని వారి ఆశ. కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థలకు తప్ప ప్రైవేటుకు విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

