హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. రాష్ట్ర, కేంద్ర వాటాలతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టామని, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టి, రైతులకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో పథకం అమలుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2025-26 సంవత్సరానికి పథకం కోసం రూ.71కోట్లు కేటాయించగా, రూ.63 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. రైతులకు మరింత విసృ్తతంగా యాంత్రీకరణ ప్రయోజనాలు అందించేందుకు 2026-27 సంవత్సరానికి రూ.147.99 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం, బీసీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ అందనున్నట్టు మంత్రి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ప్రస్తుతం 37 రకాల వ్యవసాయ పరికరాలను ఖరారు చేసినట్టు మంత్రి తెలిపారు. రైతుల సూచనలు పరిగణనలోకి తీసుకుని, వారికి గరిష్ఠ ప్రయోజనం కలిగేలా పథకానికి తుదిరూపం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.