పట్టభద్రుల నిరాసక్తత.. అధికారుల నిర్లక్ష్యం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఎవరికీ పట్టని వ్యవహారంగా మారింది. అటు పట్టభద్రులైన ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత నిస్తేజంగా, నత్తనడకన సాగుతుండగా..ఇటు వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలికి ఇద్దరు సభ్యులను ఎన్నుకొనేందుకుగాను ఓటర్లుగా నమోదు చేసుకొనేందుకు పట్టభద్రులు ఆసక్తి చూపడం లేదు.
- వెరిఫికేషన్లో అధికారుల అలసత్వం
- మందకొడిగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు
- నత్తనడకన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ
- వచ్చిన దరఖాస్తులు 3,53,897 మాత్రమే
- ఆమోదం పొందినవి 2409, తిరస్కరణ 220
- ఇక మిలిగింది 20 రోజులే
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఎవరికీ పట్టని వ్యవహారంగా మారింది. అటు పట్టభద్రులైన ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత నిస్తేజంగా, నత్తనడకన సాగుతుండగా..ఇటు వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలికి ఇద్దరు సభ్యులను ఎన్నుకొనేందుకుగాను ఓటర్లుగా నమోదు చేసుకొనేందుకు పట్టభద్రులు ఆసక్తి చూపడం లేదు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదలై 20 రోజులు కావస్తున్నా 30 శాతం మంది కూడా తమ ఓటు హక్కు కోసం ముందుకురాలేదు. గతంలో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు 10 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. కానీ ఈసారి ఇప్పటివరకు కేవలం 3.53 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు అధికారులు సైతం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు 3,53,897 దరఖాస్తులు రాగా, కేవలం ఒక్కశాతం దరఖాస్తులనే పరిశీలించారు. 3,53,897 దరఖాస్తుల్లో 2,409 ఆమోదం పొందగా, 220 తిరస్కరించారు.
మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. అధికారులు గురువారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో 1,52,905 దరఖాస్తులు రాగా, అందులో 94 దరఖాస్తులనే ఆమోదించారు. ఇంకా 99.9 శాతం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా యి. రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ వంటి జిల్లాల్లో ఆమోదించిన దరఖాస్తుల సంఖ్య దాదాపు సున్నా. వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 2,00,992 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు ఆమోద పొందినవి 2,315 మాత్రమే. దాదాపు 1,98,460 (98.7%) దరఖాస్తులు పెండింగ్లో పడి ఉన్నాయి. బూత్ లెవల్ అధికారి (బీఎల్వో) స్థాయిలోనే లక్షలాది అప్లికేషన్లు నిలిచిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.
నాడు 5,31,268 ఓట్లు.. నేటి దరఖాస్తులు 1,52,905
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో గతంలో (2021) మొత్తం ఓటర్లు 5,31,268గా నమోదయ్యారు. కానీ ఈసారి ఇప్పటికి 1,52,905 దరఖాస్తులే వచ్చాయి. గతంతో పోలిస్తే దాదాపు 71 శాతం కంటే ఎకువ మంది పట్టభద్రులు ఇంకా నమోదు ప్రక్రియకు దూరంగానే ఉన్నారు. గతంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 1,44,416 మంది ఓటర్లు ఉండగా, ఇప్పుడు ఆ జిల్లా నుంచి కేవలం 43,624 దరఖాస్తులే వచ్చాయి. నాడు మేడ్చల్ మల్కాజిగిరి నుంచి 1,31,284 ఓట్లు ఉండగా, నేడు 28,561 దరఖాస్తులు, హైదరాబాద్ నుంచి 1,10,243 ఓట్లు ఉండగా, ఇప్పుడు 17,073 దరఖాస్తులు మాత్రమే అందాయి. గడిచిన ఐదేండ్లలో పట్టభద్రుల సంఖ్య గణనీయంగా పెరుగగా, దరఖాస్తులు మాత్రం బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
40% కూడా రాని దరఖాస్తులు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి గతంలో (2021) మొత్తం ఓటర్లు 5,05,565 మంది ఉన్నారు. ఈసారి 2,00,992 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో ఉన్న ఓటర్లలో ఇప్పటివరకు దాదాపు 39.7 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన నల్లగొండ జిల్లా నుంచి 2021లో అత్యధికంగా 90,826 ఓట్లు ఉండగా, ఇప్పుడు 7,309 దరఖాస్తులు మాత్రమే అందాయి. ఖమ్మం నుంచి 87,172 ఓట్లు ఉండగా, 29,724 దరఖాస్తులు, వరంగల్ అర్బన్ (హనుమకొండ) నుంచి 66,379 ఓట్లు ఉండగా, నేడు 17,392 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఒకవైపు గతంలో ఉన్న ఓటర్ల సంఖ్యలో కనీసం సగం కూడా నమోదు కాకపోవడం, వచ్చిన కొద్దిపాటి దరఖాస్తుల పరిశీలనను కూడా బీఎల్వోలు, ఆఫీసర్లు మూలన పడేయడంపై రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశీలనను వేగవంతం చేయకపోతే వేలాది మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హకును కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
దరఖాస్తులకు గడువు నవంబర్ 6
2026 నవంబర్ ఒకటిని అర్హత తేదీగా నిర్ణయించి పూర్తిగా పునఃసిద్ధం (డీనోవో) పద్ధతిలో నూతన ఓటర్ల జాబితాలు రూపొందించాలని సెప్టెంబర్ 28న కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీచేసింది. ప్రస్తుత జాబితాలో పేరున్న వ్యక్తులు కూడా తాజాగా సవరించిన ఫారమ్-18 ద్వారా నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పట్టభద్రుల ఓటర్లకు ముఖ్య తేదీలు
ప్రజా నోటీసు జారీ : సెప్టెంబర్ 28, 2026
నోటీసు తొలి పునఃప్రచురణ : అక్టోబర్ 15, 2026
నోటీసు రెండో పునఃప్రచురణ : అక్టోబర్ 25, 2026
ఫారమ్-18 దరఖాస్తులకు చివరి తేదీ : నవంబర్ 6, 2026
ముసాయిదా జాబితా ముద్రణ : నవంబర్ 20, 2026
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ : నవంబర్ 25, 2026
క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ : నవంబర్ 25-డిసెంబర్ 10, 2026
క్లెయిమ్లు, అభ్యంతరాల పరిషారం : డిసెంబర్ 25, 2026లోగా
తుది ఓటర్ల జాబితా ప్రచురణ : డిసెంబర్ 30, 2026
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం
గురువారం వరకు వచ్చిన దరఖాస్తులు :1,52,905
అందులో ఆమోదం పొందినవి: 94… తిరస్కరణ: 3
ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు: 1,52,808 (99.9%)
వరంగల్- ఖమ్మం – నల్లగొండ నియోజకవర్గం
గురువారం వరకు వచ్చిన దరఖాస్తులు: 2,00,992
అందులో ఆమోదం పొందినవి: 2,315 తిరస్కరణ:217
ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు: 1,98,460 (98.7%)

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

