ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలు లేనట్టేనా?
ఫీజు రీయింబర్స్మెంట్ గత బకాయిలు చెల్లించేది లేదని సర్కార్ చెప్పకనే చెప్పింది. కేవలం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకే నిధుల చెల్లింపును ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 39.66 శాతం మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను చెల్లించామని ఎస్సీ అభివృద్ధిశాఖ వెల్లడించింది. దరఖాస్తులు కాలేజీల్లోనే పెండింగ్ ఉంటున్నాయని, పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలను సైతం పరిష్కరించామని స్పష్టంచేసింది.
- ఈ విద్యా సంవత్సరానికే చెల్లిస్తున్న ప్రభుత్వం
- ఇప్పటివరకు చెల్లించింది 39.66 శాతం మందికే..
- కాలేజీల్లోనే దరఖాస్తుల పెండింగ్ అంటూ సర్కార్ దాటవేత
- 5,513 కోట్ల బకాయిల పరిస్థితేందని విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ గత బకాయిలు చెల్లించేది లేదని సర్కార్ చెప్పకనే చెప్పింది. కేవలం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకే నిధుల చెల్లింపును ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 39.66 శాతం మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను చెల్లించామని ఎస్సీ అభివృద్ధిశాఖ వెల్లడించింది. దరఖాస్తులు కాలేజీల్లోనే పెండింగ్ ఉంటున్నాయని, పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలను సైతం పరిష్కరించామని స్పష్టంచేసింది.
‘ఫీజుల ఎగవేతకు సర్కారు కుట్ర’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కీమ్‌కు సంబంధించిన నోడల్ డిపార్ట్మెంట్ ఎస్సీ అభివృద్ధిశాఖ స్పందించింది. ఎస్సీ అభివృద్ధిశాఖ సెక్రటరీ విజయేందిర బోయి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ-పాస్ పోర్టల్ జూలై 2026 నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నదని, మధ్యలో సాంకేతిక సమస్యలు తలెత్తగా వాటిని మూడు రోజుల్లో పరిషరించామని తెలిపారు. పోర్టల్ పనిచేయడం లేదనే ప్రచారం అవాస్తవమని వివరించారు. నూతన మార్గదర్శకాల ప్రకారం విద్యార్థి ఆధార్‌లో పేరు, పదో తరగతి సర్టిఫికెట్లో పేరు ఒకేలా ఉండాలని, తేడా ఉంటే విద్యార్థులే సరిచేసుకోవాలని సూచించింది.
ఇప్పటివరకు కేవలం 1,31,000 దరఖాస్తులే వచ్చాయనడం అవాస్తమని తెలిపింది. శాఖ లెకల ప్రకారం ఈ ఏడాది 10.89 లక్షల దరఖాస్తులు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో ఇప్పటివరకు మొత్తం 6,03,175 (55.38 శాతం) వచ్చాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 2,39,263 (39.66శాతం) మందికి రూ.957 కోట్లు విడుదల చేశామని స్పష్టం చేశారు. కాలేజీల్లోనే 2,84,265 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, రెన్యువల్ దరఖాస్తులు నమోదు కావడం లేదనేది అవాస్తవమని తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నారాయణపేట, మహబూబాబాద్, జనగామ ఆరు జిల్లాల్లో కలిపి మొత్తంగా 9,398 రెన్యువల్ దరఖాస్తులు వచ్చాయని వివరించారు. నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలిస్తూ నిధులను చెల్లిస్తున్నామని సెక్రటరీ విజయేందిర బోయి వెల్లడించారు.
చేతికందని సర్టిఫికెట్లు.. విద్యార్థుల ఇక్కట్లు
ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే ఆశతోనే అనేకమంది బడుగు బలహీనవర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఇప్పటికే ప్రైవేట్ కాలేజీల్లో చేరారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత బకాయిలను విడుదల చేయకపోవడంతో వారంతా తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారు. ఫీజులు చెల్లించనిదే ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదు.
అప్పులు చేసి కొందరు విద్యార్థులు కాలేజీలకు ఫీజు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఆ స్థోమత కూడాలేని నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు మధ్యలోనే స్వస్తిపలుకుతున్నారని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు తమ కోర్సులను సైతం పూర్తి చేసుకున్నారు. ఫీజు బకాయిలు ఉండడంతో వాళ్లకు ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వచ్చిన తరువాతే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసి చెబుతున్నారు. సర్టిఫికెట్లు చేతికి అందకపోవడంతో విద్యార్థులు ఉన్నతవిద్య, ఉద్యోగ అవకాశాలను పొందలేని దుస్థితి నెలకొన్నది.
రూ.5,513.76 కోట్ల బకాయిల సంగతేంది?
ప్రభుత్వం గత విద్యాసంవత్సరాల బకాయిలు నిలిపివేసి, ఈ విద్యాసంవత్సరం నుంచే చెల్లింపులను కొనసాగిస్తున్నది. రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2,500 పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ స్కీమ్‌కు సంబంధించి రూ. 5,513.76 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఆ నిధులను విడుదల చేయాలని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు 34 నెలలుగా కోరుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులనే పరిశీలిస్తూ నిధులను విడుదల చేస్తున్నారు. వెరసి బకాయిల చెల్లింపు లేనట్టేనని స్పష్టంగా తెలిసిపోతున్నది. అదీగాక నూతన షరతులతో దరఖాస్తులు సైతం భారీగా తగ్గినట్టు ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

