హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎస్ కే రామకృష్ణారావుకు తన రాజీనామా లేఖను పంపించారు. తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తిచేశానని, బాధ్యత పూర్తవడంతో రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో ప్రస్తావించారు. 2024 సెప్టెంబర్ 6న ఆకునూరి మురళి చైర్మన్‌గా తెలంగాణ విద్యా కమిషన్‌ను సర్కార్ ఏర్పాటు చేసింది. రెండేండ్ల కాలానికి ఆయన్ను చైర్మన్‌గా నియమించింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌తో రెండేండ్ల పదవీకాలం పూర్తికానున్నది. నాలుగు నెలల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం కలకలం రేపుతున్నది. దూకుడు స్వభావం కలిగిన ఆకునూరి విద్యాకమిషన్ చైర్మన్ హోదాలో కొన్ని వివాదాలను మూటగట్టుకొన్నారు. అయితే కొంతకాలంగా ఆయన తీవ్రంగా మదనపడుతున్నారట. ఏం చేయాలన్నది తేల్చుకోలేక రాజీనామాకు సిద్ధపడ్డట్టు తెలిసింది.
విద్యాకమిషన్ తన పదవీకాలంలో 9 నివేదికలను సర్కార్‌కు సమర్పించింది. 434 సిఫార్సులు చేసింది. అయితే కమిషన్ సిఫార్సులను సర్కార్ సీరియస్‌గా తీసుకోలేదు. చాలా అంశాలను పట్టించుకొన్న దాఖలాల్లేవు. పైగా తానొకటి చెబితే.. సర్కార్ మరోటి చేయడం కూడా వివాదం రాజేసింది. దీంతో ఆయన పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మీడియా ఇంటర్వ్యూల్లోను సర్కార్‌పై బహిరంగ విమర్శలు చేశారు. టీచర్లకు జీతాలెక్కువ ఉన్నాయని, తగ్గించాలని ఆయన సిఫార్సు చేయడంతో ఉపాధ్యాయ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనది. టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని, ఎప్‌సెట్ రద్దు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయాలని సూచించడం కూడావివాదానికి దారితీసింది. ఈ మొత్తం వ్యవహారాల నేపథ్యంలో కేకే కల్పించుకొని ప్రెస్‌మీట్ పెట్టి టీచర్ల జీతాలను తగ్గించబోమని ప్రకటన చేయాల్సి వచ్చింది.
ఓ ఐఏఎస్ అధికారితో విభేదాలే ఆకునూరి మురళి రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. చాలాకాలంగా సదరు అధికారితో ఆకునూరికి మనస్పర్థలున్నాయి. సర్కార్‌లో కీలకంగా ఉన్న ఆ అధికారి విద్యాకమిషన్‌ను అస్సలు లెక్కచేయడం లేదట. సదరు ఐఏఎస్ ఆకునూరి అంటేనే చిర్రుబుర్రులాడుతున్నారట. ఆకునూరి సైతం సదరు అధికారి పేరు ఉచ్ఛరించేందుకు కూడా ఇష్టపడటం లేదట. ఇటీవలే సర్కార్‌కు విద్యాకమిషన్ సమర్పించిన నివేదికలో కొందరు ఐఏఎస్‌ల పేర్లు ప్రస్తావించగా, సదరు అధికారి పేరు ప్రస్తావించకపోవడం మరింత నిప్పును రాజేసిందట.
ఈ నేపథ్యంలోనే ఆకునూరి రాజీనామాకు సిద్ధపడ్డట్టు ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది. ఆకునూరి రాజీనామాతో విద్యాకమిషన్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకొన్నాయి. ప్రస్తుతం పీఎల్ విశ్వేశ్వర్రావు, చారగొండ వెంకటేశ్, జ్యోత్స్న శివారెడ్డి కమిషన్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆకునూరి స్థానంలో కొత్త చైర్మన్‌ను నియమిస్తారా? లేక కేశవరావు కమిటీ చాలన్న భావనతో కమిషన్‌ను పూర్తిగా రద్దుచేస్తారా? ఇప్పుడున్న సభ్యులతో కొనసాగిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.